ATM Charges | దేశంలోని వివిధ బ్యాంకులు.. పరిమితి దాటి ఏటీఎం లావాదేవీలు నిర్వహించిన కస్టమర్లపై సర్వీసు చార్జీలను పెంచేశాయి.
అయినా కొంత మంది బ్యాంకు ఖాతాదారులు ఇప్పటికీ ఏటీఎం ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఏటీఎం సేవలు ఉపయోగించుకుంటున్నందుకు ప్రతి ఖాతాదారులు తమ బ్యాంకుకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం సేవలు అందిస్తున్న బ్యాంకులు కూడా ఆయా సేవలపై చార్జీలు పెంచేశాయి. దాదాపు అన్ని బ్యాంకుల సొంత ఏటీఎంల్లో ఐదు ట్రాన్సాక్షన్స్ ఫ్రీ. నిర్దిష్ట సంఖ్య దాటిన లావాదేవీలపై బ్యాంకులకు సర్వీస్ చార్జీలు పే చేయాల్సి ఉంటుంది. ఆయా ఖాతాలను బట్టి ఏటీఎం చార్జీలు ఖరారవుతాయి. ఏయే బ్యాంకులు తమ ఏటీఎంలపై చార్జీలు పెంచాయో ఓ లుక్కేద్దాం..
ఎస్బీఐ ఏటీఎం సేవలపై ఫీజు ఇలా
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రతి రీజియన్ పరిధిలో ఒక నెలలో ఐదు ఉచిత విత్‌డ్రాయల్స్ ఫెసిలిటీ కల్పిస్తున్నది. ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల పరిధిలో ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ప్రతి నెలా మూడు ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఒక నెలలో సొంత ఏటీఎంల్లో ఐదు కంటే ఎక్కువ లావాదేవీలు జరిగినా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిపినా ఫీజు వసూలు చేస్తుంది ఎస్బీఐ. సొంత ఏటీఎంల్లో ఐదు లావాదేవీలు దాటాక ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.10, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో పరిమితి తర్వాత జరిపే ప్రతి విత్ డ్రాయల్‌పైనా రూ.20 వసూలు చేస్తుంది. సొంత ఏటీఎంల్లో నాన్ ఫైనాన్సియల్ లావాదేవీపై రూ.5, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఆర్థికేతర ట్రాన్సాక్షన్‌పై రూ.8 వసూలు చేస్తుంది.
ఇలా హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం ఫీజులు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతి నెలా తన సొంత ఏటీఎంలో ఐదు లావాదేవీలు ఫ్రీగా అందిస్తుంది. మెట్రో సిటీలలో ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు, నాన్ మెట్రో సిటీల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా పొందొచ్చు. ఈ పరిధి దాటిన ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.21తోపాటు అనుబంధ చార్జీలు, నాన్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్ మీద రూ.8.50 చెల్లించాలి.
ఐసీఐసీఐ బ్యాంకులో ఈ ఐదు ట్రాన్సాక్షన్స్ ఫ్రీ
ఐసీఐసీఐ బ్యాంకు సైతం దేశంలోని ఆరు మెట్రోపాలిటన్ సిటీల పరిధిలో సొంత ఏటీఎంల్లో ఐదు, ఇతర బ్యాంకు ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఉచితంగా అందిస్తుంది. పరిమితి దాటి జరిపే ప్రతి ఆర్థిక లావాదేవీపై రూ.20, నాన్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్ మీద రూ.8.50 వసూలు చేస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలు, నాన్-ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంల్లో సేవలకు ఈ రూల్ వర్తిస్తుంది.
యాక్సిస్ బ్యాంకు ఏటీఎంల్లో లావాదేవీలు ఇలా
యాక్సిస్ బ్యాంక్ సొంత ఏటీఎంల్లో మెట్రో సిటీల పరిధిలో ఐదు ఉచితంగా, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటిన ప్రతి నగదు విత్ డ్రాయల్‌పై రూ.21, నాన్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్‌పైన రూ.10 వసూలు చేస్తుంది.
పీఎన్బీలో ఏటీఎం ఫీజులు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా మెట్రో పాలిటన్ సిటీల పరిధిలో సొంత ఏటీఎంల్లో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీల వరకు ఫ్రీ. అంతకు మించి జరిపే ప్రతి లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకుల్లో పరిధి దాటిన ఆర్థిక లావాదేవీలపై రూ. 20, నాన్ -ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్ మీద రూ. 9 వడ్డిస్తుంది.
0 Comments:
Post a Comment