బ్రేక్ఫాస్ట్ తరచూ స్కిప్ చేస్తున్నారా? అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు మీపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. చాలా మంది అల్పాహారాన్ని పెద్దగా పట్టించుకోరు.
నేరుగా లంచ్ ఎక్కువ తినవచ్చులే అనుకుని అల్పాహారాన్ని తినకుండా మానేస్తారు. మీరు రోజంతా తినే ఆహారాల్లో అతి ముఖ్యమైనది అల్పాహారమే.
కానీ ఎంతో మందికి ఈ విషయం తెలియక దాన్నే స్కిప్ చేస్తూ ఉంటారు. రాత్రి భోజనం చేశాక కనీసం 8 గంటలు నిద్రపోయి, మరుసటి రోజును సరిగ్గా ప్రారంభించడానికి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ అవసరం.
అంటే దాదాపు పది నుంచి 12 గంటలు ఉపవాసం తరువాత ఉదయం ఆహారాన్ని తినాల్సిన అవసరం ఉంది. కానీ టీ తాగేసి ఆహారం తినకుండా ఉండిపోతారు చాలా మంది. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
బరువు పెరిగి...
చాలా మందికి తెలియని విషయం ఇది. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతాం అనుకుంటారు కానీ, తెలియకుండానే బరువు పెరిగిపోతారు. నిద్ర లేచాక ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రోజంతా ఆకలి బాధను అరికడుతుంది. త్వరగా ఆకలి వేయదు.
లంచ్ కూడా ఎంత తినాలో అంతే తింటారు. కానీ బ్రేక్ ఫాస్ట్ తినకుండా నేరుగా లంచ్ తినడం వల్ల ఎక్కువ తినేసే అవకాశం ఉంది. అది కొవ్వు రూపంలో ఓ మూల పేరుకుపోతుంది.
గుండె జబ్బులు
ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును ప్రారంభించడం దీర్ఘకాలంలో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. అధ్యయనాల ప్రకారం ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో వారిలో ధమనుల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఎక్కువ.
అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది స్ట్రోకులు, గుండెపోటు వంటి ప్రమాదాలకు దారితీస్తుంది.
మధుమేహం
అల్పాహారం రోజూ తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనాలు నిరూపించాయి. బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను దూరం చేస్తుంది.
అదే అల్పాహారం తినడం మానేస్తే ఇన్సులిన్ నిరోధకత వల్ల ఏర్పడే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అందుకే ఉదయం ఆహారం తినడం మానేస్తే దీర్ఘకాలంలో డయాబెటిస్ త్వరగా వచ్చే అవకాశం ఉంది.
మెదుడుకు మేలు
క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. ఏకాగ్రతను కూడా పెంచుతుంది.
జంక్ ఫుడ్ తినకుండా...
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఆకలితో అలమటిస్తారు. దీని వల్ల జంక్ ఫుడ్ తినాలన్న కోరిక పెరుగుతుంది. ఆ కోరిక తీర్చుకునేందుకు అధికస్థాయిలో జంక్ ఫుడ్ తినేస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.
పోషకాలు
ఉదయానే అల్పాహారం తినడం వల్ల శరీరానికి అవసమైన శక్తితో పాటూ, పోషకాలు అందుతాయి. రోజంతా చురుగ్గా ఉంటారు. అయితే మంచి బ్రేక్ ఫాస్ట్ ఎంచుకోవడం అవసరం.
మీ అల్పాహారంలో ప్రోటీన్లు, తృణధాన్యాలు, పప్పులు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, తాజా పండ్లు, కూరగాయలను ఉంటే మంచిది.
0 Comments:
Post a Comment