శివకేశవులకు అత్యంత ఇష్టమైన కార్తీక మాసం రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. సహజంగా కార్తీకమాసం దీపావళి మరుసటి రోజునే ప్రారంభమవుతుంది. దీపావళి తర్వాత వచ్చే పాడ్యమి రోజున కార్తీక మాసాన్ని ప్రారంభిస్తారు.
కానీ ఈ సంవత్సరం కార్తీక మాసం ప్రారంభం విషయంలో చాలా గందరగోళం నెలకొంది.
కార్తీక మాసం పాడ్యమి తిధితో మొదలు
ఈ సంవత్సరం దీపావళి మరుసటి రోజు కాకుండా, ఆ తర్వాతి రోజు ప్రారంభమవుతుంది కార్తీక మాసం. ఎందుకంటే ఈసారి అమావాస్య 24, 25 రెండు తేదీలలో ఉండటంతో నరక చతుర్దశిని, దీపావళి పండుగను 24వ తేదీన జరుపుకున్నారు. 25వ తేదీన అమావాస్యతో పాటు సూర్యగ్రహణం ఉండడంతో ఆరోజు పండుగను జరుపుకోకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు.
దీంతో 25వ తేదీన సాయంత్రం తర్వాత పాడ్యమి ఘడియలు వచ్చినప్పటికీ, సూర్యోదయ సమయంలో పాడ్యమి ఉండాలి కాబట్టి, సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిధినే నెల ప్రారంభానికి సూచనగా పరిగణిస్తారు కాబట్టి బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది.
కార్తీక మాసానికి ప్రాధాన్యత ఎందుకంటే
ఎందుకంటే కార్తీకమాసానికి నెలను ప్రారంభించేది పాడ్యమి ముహూర్తం లోనే కాబట్టి, దీపావళి తెల్లవారు జామున నేడు ఉదయం అమావాస్య ఘడియలు ఉన్నాయి కాబట్టి రేపు ఉదయం నుండి కార్తీక మాసాన్ని ప్రారంభిస్తారు.
అన్ని మాసాలలోనూ కార్తీకమాసానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు అని, శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు అని, వేదంతో సమానమైన శాస్త్రం లేదని, గంగతో సమానమైన తీర్థం లేదని స్కంద పురాణంలో చెప్పబడింది.
అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత. ఈ మాసం శివుడికి కూడా చాలా ఇష్టమైన మాసం. శివ భక్తులు కూడా ఈ మాసంలో చాలా భక్తిభావంతో పూజలు చేస్తారు. ఈ మాసంలో పూజలు చేస్తే అనుకున్నవన్నీ సిద్ధిస్తాయని, పాపాలు తొలగిపోయి, మోక్షం కలుగుతుందని చెప్తారు.
శివుడికి, విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసం
కార్తీక మాసాన్ని శివుడికి, విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ నెలలో శివకేశవులను సమానంగా ఆరాధిస్తారు. కార్తీక మాసం ఈ సంవత్సరం అక్టోబరు 26వ తేదీ నుండి నవంబర్ 23 వ తేదీ వరకు ఉంటుంది. ఈ నెల రోజుల పాటు శైవ, వైష్ణవ భక్తులు అత్యంత నియమనిష్టలతో శివకేశవులను పూజిస్తారు. ఇక ప్రముఖ శైవక్షేత్రాలు, వైష్ణవ ఆలయాలు శివ కేశవుల నామస్మరణతో మార్మోగిపోతాయి.
కార్తీక మాసం పాటించేవారికి నియమాలెన్నో
కార్తీకమాసం నియమాలను పాటించేవారు ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి. శాకాహారాన్నిభుజించాలి. పొరపాటున కూడా మాంసాహారం ముట్టుకోకూడదు. భగవంతునిపై అత్యంత భక్తి విశ్వాసాన్ని చూపిస్తూ నిత్య పూజాదికాలను నిర్వహించాలి.
మంచంపై పడుకోకూడదు. దానధర్మాలకు పెద్ద పీట వెయ్యాలి. కార్తీక మాసం నెలరోజులూ ఉదయం తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసి పూజలు చేసి భక్తిప్రపత్తులతో భగవంతుడిని ఆరాధించాలి. నదీస్నానాలు చేసి, కార్తీక దీపాలను నదులలో వదిలి భగవంతునిపై భక్తిని చాటుకోవాలి.
0 Comments:
Post a Comment