నీళ్లతో దీపాలు వెలిగించొచ్చు' సినిమాలు, పురాణ కథల్లో విన్న ఈ విచిత్ర దీపాలను ఇప్పటి వరకు ఎవరు చూసింది లేదు.
కానీ ఆ కథల్లోని సారాంశానికి సాంకేతికతను జోడిస్తే ఈ విచిత్రం సాక్షాత్కారం అవుతుందని గ్రహించిన కొందరు... నిజంగానే నీటితో వెలిగే దీపాలను తయారు చేశారు. అయితే నూనె దీపాలలో దీపం కొనకు అగ్ని ఉంటే ఈ నీటి దీపాలకు లైట్లు ఉంటాయి.
దీపావళి (Diwali) సందడి ముగియడంతోనే కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి పుణ్యస్నానం ఆచరించి దీపారాధన చేస్తుంటారు భారతీయులు.
ప్రమిధల్లో నూనె, నెయ్యి పోసి కార్తీక దీపాలను వెలిగిస్తారు. ఇలా నెల రోజుల పాటు ఇంటింటా దీపాలతో ఎంతో ఆధ్యాత్మిక శోభతో నిండి ఉంటాయి.
ప్రస్తుతం ఈ నూనె దీపాలకు బదులు నీళ్ల దీపాలు మార్కెట్లోకి వచ్చాయి. అచ్చంగా నూనె దీపాలు ఏ విధంగా కాంతినిస్తాయో అదే విధంగా ఈ నీళ్ల దీపాలు వెలుగుతూ అబ్బురపరుస్తున్నాయి. ప్రమిదలు కింది భాగంలో సెన్సార్ పరికరాన్ని ఏర్పాటు చేశారు.
బ్యాటరీ ఆధారంగా విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే ఆ సెన్సార్ పనిచేయాలంటే ప్రమిదలో నీళ్లు పోస్తే సరిపోతుంది. నీళ్లలో విద్యుత్ సరఫరా బ్యాటరీలో ఉన్నటువంటి + ప్లస్ - మైనస్ కలవడం ద్వారా విద్యుత్ బల్బుకి సరఫరా అయి బల్బు వెలుగుతుంది. ఒకసారి బ్యాటరీ వేస్తే పది గంటల పాటు ఈ దీపాలు వెలుగుతున్నాయి.
వీటితోపాటు నీళ్లలో వేస్తే వెలిగే తామర పూలు కూడా మార్కెట్లో ఉన్నాయి. అచ్చు కమలం పువ్వును పోలి ఉన్న ఈ లోటస్‌లను నీటిలో వేస్తే అవి ఎంతో కాంతివంతంగా కనిపిస్తూ అబ్బురపరుస్తున్నాయి.
సాంప్రదాయ దీపాలతో పోలిస్తే ఈ విద్యుత్ - నీటి దీపాలతో శ్రమ తక్కువగా ఉండడంతో మహిళలు వాటి పట్ల ఆసక్తి చూపుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లోని అనపర్తి నియోజకవర్గంలో బలబద్రపురం గ్రామంలో ఈ నీటి ఆధారిత విద్యుత్ దీపాలు ప్రజలు ఆకట్టుకుంటున్నాయి.
ఇటువంటి పలు రకాల సెన్సార్ దీపాలు, సెన్సార్ లోటస్‌లు ఇంటిలో అలంకరణ కోసం ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయని ప్రజలు అంటున్నారు.
మొత్తం మీద ఈ ఏడాది దీపావళి కార్తీక మాసంలో సందడి చేస్తున్న ఈ సెన్సార్ దీపాలను ఎక్కువగా విక్రయించి లాభాలు పొందుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
వీటిని ఇంటి ముందు పెట్టుకోవడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కొన్ని ఆలయాల వద్ద కూడా ఈ సెన్సార్ దీపాలను అమరుస్తున్నారు.
నూనె దీపం అయితే గాలి వేస్తే ఆరిపోతుంది కానీ ఈ సెన్సార్ ద్వారా వెలిగే దీపం మాత్రం గాలి వాన కలిసి వచ్చిన బ్యాటరీ ఉన్నంత సేపు వెలుగుతూనే ఉంటుంది.
0 Comments:
Post a Comment