దిశ, వెబ్ డెస్క్ : విశ్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో అద్భుతాలు మన భూమిపైన ఏర్పడ్డాయి. అలాంటి ఒక అద్భుతమే లోనార్ లేక్.
ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలను ఆకర్షిస్తుంది. ఈ లేక్ ఆకాశం నుంచి పడ్డ ఓ పెద్ద ఉల్క కారణంగా ఏర్పడింది. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఈ విధంగా ఏర్పడిన సరస్సు లేదు.
నిజానికి ఇప్పటి వరకు ఇలాంటి ఒక సరస్సు ఉందని కూడా చాలా మందికి తెలిసి ఉండదు. 54 వేల ఏండ్ల క్రితం ఏర్పడిన ఈ సరస్సు మన భారత దేశంలోనే ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల చూపు మన దేశంపై పడింది.
ప్రస్తుతానికైతే ఈ సరోవరం పర్యాటక ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇంతగా ప్రాచుర్యం పొందిన ఈ సరస్సు ఎక్కడ ఉంది. దాని విశేషాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కడ ఉంది...
లోనార్ లేక్ మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం బుల్ధానా జిల్లా లోనార్ లో ఉంది. ఈ లేక్ ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ప్లీస్టోసీన్ యుగంలో అంతరిక్షంలో నుంచి ఓ పెద్ద ఉల్క భూమిని ఢీకొనడంతో ఆ ప్రదేశంలో పెద్ద గుంత ఏర్పడి అదే పెద్ద సరస్సుగా రూపాంతరం చెందింది.
ఈ సరస్సు సగటు వ్యాసం 1.2 కిలోమీటర్లు, లోతు దాదాపు 137 మీటర్లు ఉంటుందని అంచనా. ఈ సరస్సు వయసు సుమారు 54 వేల ఏళ్లు అయి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ సరస్సు చుట్టూ పచ్చని ఎత్తైన కొండలు ఉండడంతో అది పర్యాటక ప్రదేశంగా మారింది. అంతే కాదు ఈ లోనార్ లేక్ చాలా పెద్దదిగా ఉండడంతో ఆ ప్రాంతాల్లో నివసించే రైతులు సరస్సులోని నీటిని వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ నీటిని తాగడానికి మాత్రం ఉపయోగించరు.
పరిశోధనలు..
ఈ లోనార్ లేక్ పై ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలను చేశారు. భూగర్భ మొదలుకుని పర్యావరణ, పురావస్తు, ప్రకృతి, ఖగోళ శాస్త్రవేత్తలు ఈ సరస్సు పర్యావరణ వ్యవస్థ వివిధ అంశాలపై అధ్యయనాలు చేశారు.
స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సాగర్ విశ్వవిద్యాలయం, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ దీని గురించి విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించాయి. 2007 లో జరిపిన అధ్యాయాలు ఈ సరస్సులో జీవ నైట్రోజన్ ను కూడా కనుగొన్నాయి.
ఎలా చేరుకోవాలి..
అందమైన లోనార్ లేక్ చూడాలనుకుంటే ఔరంగాబాద్ నుంచి 160 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు అద్భుతమైన ప్రదేశాన్ని చేరుకోవచ్చు.
ఇక ముంబై నుంచి రావాలనుకుంటే మాత్రం 550 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయక తప్పదు. విమానం, బస్సు, రైలు ఏ మార్గం గుండా అయినా లోనార్ పట్టణానికి చేరుకోవచ్చు.
0 Comments:
Post a Comment