సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత'
గ్రహణం సమయంలో ఇలాంటి వార్తలు తరచూ కనిపిస్తుంటాయి. నేడు సూర్యగ్రహణం కావడంతో ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పటికే మీడియాలో కనిపిస్తున్నాయి.
ఏ సమయంలో గుడిని మూసివేస్తారు? ఎంత సేపు మూసివేస్తారు? సంప్రోక్షణ ఎప్పుడు చేస్తారు? వంటి వివరాలను దేవాలయాలు వెల్లడిస్తూ ఉంటాయి.
దాదాపుగా అన్ని దేవాలయాలను గ్రహణ సమయంలో మూసివేస్తారు. ఆ తరువాత మళ్లీ తెరుస్తారు.
కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక దేవాలయానికి మాత్రం మినహాయింపు ఉంది. గ్రహణం రోజున దాన్ని తెరిచే ఉంచుతారు. అదేంటో తెలుసుకునే ముందు అసలు గ్రహణం రోజున దేవాలయాలను ఎందుకు మూస్తారో చూద్దాం.
Facebook/KTR
దేవాలయాలను ఎందుకు మూస్తారు?
దీనికి కారణాలు చాలానే ఉన్నాయనేది గ్రహణాలను విశ్వసించే వారి నమ్మకం.
'తల్లి గర్భం అత్యంత పవిత్రమైన స్థలం. ఎందుకంటే అక్కడ ఒక సృష్టి జరుగుతుంది. కొత్త జీవి ప్రాణం పోసుకుంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి.
అలాగే గర్భగుడిలోనూ దేవుడు ఉంటాడు. దేవుడు కూడా సృష్టికర్తే. తల్లి గర్భం మాదిరిగానే గర్భగుడిని కూడా రక్షించుకోవాలి.
గ్రహణం సమయంలో దుష్ట శక్తుల ప్రభావం ఉంటుంది. అందువల్ల దేవాలయాలను మూసివేస్తారు' అని ఆస్ట్రాలజర్ డాక్టర్ సీవీబీ సుబ్రహ్మణ్యం అన్నారు.
బ్రాహ్మణులు అగ్నిహోత్రం చేయడానికే'
మరికొందరు ఇంకో కారణం కూడా చెబుతున్నారు. గ్రహణం రోజున ఆలయాలు మూసివేయడానికి కారణం ఆగమం, వైదిక శాస్త్రాలలో ఉందని కప్పగన్తు సోమయాజులు చెబుతున్నారు.
'నిత్యకర్మలను అనుసరించి బ్రాహ్మణులు సంధ్యావందనం, అగ్నిహోత్రం (యగ్నం చేసి అగ్నిని ఆహ్వానించడం) చేయాల్సి ఉంటుంది. అది కూడా సొంత అగ్నిహోత్రం ప్రకారం గ్రహణ హోమాలు చేసుకోవాలి.
దేవాలయాల్లో అర్చకులుగా పని చేసే బ్రాహ్మణులుంటారు. గుడిలో ఉంటే సొంత అగ్నిహోత్రం ప్రకారం గ్రహణ హోమాలు చేయలేరు. అందువల్లే దేవాలయాలను మూసివేస్తారు.
దేవాలయాల్లో హోమాలు చేసుకోవచ్చని కొన్ని వైఖానస, పాంచరాత్రం వంటి ఆగమాలు చెబుతున్నాయి. కానీ వైదికం వీటన్నింటినీ దారిలో పెట్టే ప్రయత్నం చేసింది.
వైదికం అంటే వేదపరమైన క్రతువులు చేయాలి. వేదాల ప్రకారం.. బ్రాహ్మణులు ఎవరి అగ్నిహోత్రం ప్రకారం వారు గ్రహణ హోమాలు చేసుకోవాలి. ఇంట్లోనే భార్యభర్తలు ఇద్దరు కలిసి అగ్నిహోత్రం చేయాలి.
బ్రాహ్మణులందరూ స్వధర్మాన్ని పాటించాల్సిందే. అందువల్ల గుడిలోకి వెళ్లి పూజలు చేసేవారు ఉండరు. స్వధరాన్ని పాటించకపోతే బ్రాహ్మణత్వాన్ని కోల్పోతారు. అప్పుడు గుడిలో పూజలు చేయడానికి వారికి అర్హత ఉండదు.
అందువల్ల గ్రహణం రోజున గుడులను మూసివేసే ఆచారాన్ని తీసుకొచ్చారు. అయితే కొన్ని ఆగమాల ప్రకారం గుడులలో హోమాలు చేసేవారు కూడా ఉన్నారు' అని కప్పగన్తు సోమయాజులు చెబుతున్నారు.
ఈ ఒక్క ఆలయాన్ని తెరుస్తారు..
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయాన్ని మాత్రం గ్రహణం రోజున తెరచే ఉంచుతారు. ఇది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయమని అక్కడి పూజారులు చెబుతున్నారు.
ఇందుకు అనేక కారణాలున్నాయి వారు చెబుతున్నారు. శ్రీకాళహస్తి పూజారులు చెబుతున్న దాని ప్రకారం...
'ఇక్కడ ఉండే శివుని పేరు శ్రీకాళహస్తీశ్వర స్వామి.
శ్రీ అంటే సాలె పురుగు... కాళం అంటే పాము... హస్తి అంటే ఏనుగు... ఈ మూడు జంతువులు ఇక్కడ పూజలు చేసి శివునిలో ఐక్యం అయ్యాయి.
ఇక్కడ శివుడు పాము రూపంలో ఉంటారు. ఆయన శిరస్సు మీద అయిదు తలల సర్పం ఉంటుంది. అలాగే జ్ఞాన ప్రసూనాంబగా పిలుచుకునే అమ్మవారి నడుముకు నాగాభరణం ఉంటుంది.
ఈ దేవాలయంలో రాహు కేతువులు ఉన్నారు. అందువల్ల శ్రీకాళహస్తి దేవాలయం రాహు కేతు క్షేత్రంగా పేరుగాంచింది.
సూర్యగ్రహణమైనా లేక చంద్రగ్రహణమైనా సూర్యచంద్రులను కబళించేది రాహు కేతువులే.
గ్రహణం సమయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అలాగే భక్తులు కూడా వచ్చి రాహు కేతు దోష నివారణ పూజలు చేయించుకుంటారు.
అలాగే స్వామి, అమ్మవారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషమే కాకుండా నక్షత్ర, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి.'
అపసవ్య దిశలో ప్రదక్షిణలు
అలాగే ఈ దేవాలయాన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారని పూజారులు చెబుతున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం...
'ఇక్కడ స్వామి, అమ్మవారు ప్రత్యక్షంగా నివసిస్తుంటారు. ఈ క్షేత్ర పురాణం ప్రకారం రాహు కేతువులకు శివుడు గ్రహాధిపత్యం ఇచ్చారు.
ఇక్కడ గ్రహాల్లో ఏడు గ్రహాలు సవ్వ దిశలో ప్రదక్షిణలు చేస్తుంటాయి. రెండు గ్రహాలు అంటే రాహు, కేతువులు అపసవ్య దిశలో తిరుగుతుంటాయి.
అందువల్ల ఇది అపసవ్యక్షేత్రం. అంటే ఇక్కడ అపసవ్యవ ప్రదక్షిణలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ భిన్నమైన ఆచారం ఉంది. శైవాగమంలో అఘోరపరమైన సంప్రదాయం ప్రకారం ఇది జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ దేవునికి నవగ్రహ కవచం ఉంటుంది.'
పైన చెప్పిన కారణాల వల్ల శ్రీకాళహస్తికి గ్రహణ దోషం ఉండదు అని అక్కడి పూజారులు చెబుతున్నారు.
TMS.AP.GO.IN
శ్రీకాళహస్తి చరిత్ర ఏంటి?
పురాణాల ప్రకారం వాయు దేవుని కోరిక మేరకు శివుడు ఇక్కడ కర్పూర వాయులింగంగా వెలిశాడు. అలాగే సాలీడు, పాము, ఏనుగు పూజలు చేయడం వల్ల దీనికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందనేది ప్రచారంలో ఉన్న మరొక కథ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న ప్రకారం...
శ్రీకాళహస్తికి ప్రాచుర్యం రాక ముందు స్థానిక ఆదివాసీలు పూజలు చేసేవారు. 9వ శతాబ్దంలో పల్లవులు, చోళులు ఇక్కడ గుడిని కట్టారు. కులోత్తంగ చోళ గుడి గోపురం కట్టించాడు.
ఇది కొంతకాలం విజయనగర సామ్రాజ్యంలో భాగంగా కూడా ఉండేది.
1516లో గజపతులను ఓడించిన సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాళహస్తి దేవాలయంలో రాజగోపురం కట్టించాడు. ఆయన మరణం తరువాత 1529లో శ్రీకృష్ణ దేవరాయల సోదరుడు అచ్యుత రాయల పట్టాభిషేకం ఇక్కడే జరిగింది.
విజయనగర పాలకుల కాలంలో తిరుపతి, తాడిపత్రి, పెనుకొండలో కట్టిన శైవ, వైష్ణవ దేవాలయాల నిర్మాణ శైలులు శ్రీకాళహస్తికి దగ్గరగా ఉంటాయి.
0 Comments:
Post a Comment