ఈ ఏడాది బదిలీలు జరిగేనా?
♦️ఆచరణకు నోచని మంత్రి బొత్స ప్రకటన
♦️ఉపాధ్యాయులకు తప్పని ఎదురుచూపులు
🌻ఈనాడు, అమరావతి : ఉపాధ్యాయుల బదిలీలపై ఉత్కంఠ కొన సాగుతోంది. పదోన్నతులు కల్పించి, ఆగస్టులోనే బదిలీలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించి రెండు నెలలు గడిచినా ఇంతవరకు దీనిపై స్పష్టత లేదు. అసలు ఈ ఏడాది బదిలీలు ఉంటాయా? ఉంటే ఎప్పుడు నిర్వహిస్తారు? అనే దానిపై అధికారులూ చెప్పలేని దుస్థితి. బదిలీలకు సంబంధించిన నిబంధనలు తరచూ మార్పులు చేస్తుండడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒకే పాఠశాలలో ఉపాధ్యాయుడు 8 ఏళ్లు పని చేస్తే తప్పనిసరి బదిలీ ఉండేలా నిబంధన ఉంది. దీన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఐదేళ్ల సర్వీసుగా సవరించారు. ఈ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన తర్వాత 8 ఏళ్ల సర్వీసు నిబంధన ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడంతో మార్పు చేశారు. ఆ మేరకు మార్పులు చేసిన అధికారులు తిరిగి దస్త్రాన్ని పంపించారు. ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన చర్చల్లో సంఘాల నాయకులు కనీసం సర్వీసు జీరో ఉన్నా బదిలీ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆ మేరకు నిబంధనల్లో మార్పులు చేశారు. ఇలా తరచూ మార్పులు, చేర్పులు చేస్తున్నారే తప్ప బదిలీలను మాత్రం నిర్వహించడం లేదు. ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
♦️వేసవి సెలవుల్లో ఏం చేశారు?
విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తే బోధనకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. మే, జూన్లో సమయం దొరికినా ఈ ప్రక్రియ చేపట్టలేదు. జులై 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మంత్రి బొత్స ప్రకటించినా ఇంతవరకూ షెడ్యూల్ విడుదల కాలేదు. ఒక వేళ ఇప్పుడు విడుదలైనా ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాలు, వెబ్ ఐచ్ఛికాల నమోదు, కౌన్సెలింగ్ నిర్వహణకు 30-40 రోజులు సమయం పడుతుంది. అంటే డిసెంబరు వచ్చేస్తుంది. వేసవి సెలవుల్లో ఏం చేశారని.. 3,4 నెలలు గడిస్తే విద్యా సంవత్సరమే ముగిసిపోతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు..
0 Comments:
Post a Comment