పాలనా రాజధానికి భారీ డిమాండ్ ? మాకే ఇమ్మంటున్న రాయలసీమ!
అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ .. వాటిని అమల్లోకి తీసుకురావడంలో మాత్రం విఫమవుతోంది. ఇన్నాళ్లూ మూడు రాజధానుల్ని కోర్టుల్లోనే తేల్చుకుంటామని చెప్తూ వచ్చిన వైసీపీ సర్కార్.
ఇప్పుడు ఆ వ్యవహారం నానాటికీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాజకీయంగానే తేల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. విశాఖ గర్జన వంటి కార్యక్రమాల ద్వారా జనాన్ని రెచ్చగొట్టేపనిలో పడింది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు సీమలోనూ కాకరేపుతోంది. విశాఖ రాజధానిపై ప్రభుత్వం పెడుతున్న ఫోకస్ సీమలోనూ ఆశలు రేపుతోంది.
మూడు రాజధానుల్లో ట్విస్టులు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మూడు ప్రాంతాల్లో పలుట్విస్టులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అమరావతిలో ఉన్న కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించి, హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రంతో పాటు కోర్టులు కూడా ఒప్పుకోకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
ఈ లోగా ప్రభుత్వం చేస్తున్న ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు సైతం అడ్డంకులు తప్పడం లేదు. దీంతో ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే కొత్త డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
విశాఖపై సర్కార్ ఫోకస్
విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజంగానే ప్రస్తుత రాజధాని ప్రాంతం అమరావతితో పాటు చుట్టు పక్కల జిల్లాలకు రుచించడం లేదు. అదే సమయంలో విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తే తమకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్న భావన ఇతర ప్రాంతాల్లోనూ పెరుగుతోంది.
మరోవైపు విశాఖలో ఎట్టిపరిస్ధితుల్లోనూ పాలనా రాజధాని ఏర్పాటు చేసి తీరుతామంటూ వైసీపీ మంత్రులు చేస్తున్న హడావిడి, ప్రకటనలు, గర్జనలు అంతిమగా ఇతర ప్రాంతాల్లోనూ పాలనా రాజధాని డిమాండ్లను రెచ్చగొడుతున్నాయి.
రాయలసీమలో పాలనా రాజధాని
విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా..దానికోసం చేస్తున్న హంగామాతో రాయలసీమ ప్రాంతంలోనూ ఇదే డిమాండ్ పెరుగుతోంది. తమకు ఇవ్వజూపుతున్న న్యాయరాజధానికి బదులుగా కార్యనిర్వాహక రాజధానే ఇవ్వాలనే డిమాండ్ అక్కడ పెరుగుతోంది.
ముఖ్యంగా టీడీపీతో పాటు ఇతర విపక్ష పార్టీలు జనంలోకి ఈ భావనను బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. విశాఖ రాజధానితో తమకు ఎలాంటి ఉపయోగం లేకపోగా.. అమరావతితో పోలిస్తే దూరం కూడా బాగా పెరుగుతుందనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నాయి. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడుతోంది.
కుదరదంటున్న జగన్ సర్కార్!
విశాఖపై వైసీపీ పెడుతున్న ఫోకస్ తో అక్కడ రాజధానిపై జనంలో ఆశలు పెరుగుతుండగా.. ఇతర ప్రాంతాల్లోనూ ఆశలు పెరుగుతున్నాయి. కార్యనిర్వాహక రాజధాని వస్తే ఇంత మేలు జరుగుతుందా .. అయితే మాకూ కావాలనే డిమాండ్ రాయలసీమలోనూ వినిపిస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
నిన్న ఇదే అంశంపై మాట్లాడిన రాయలసీమ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం రాయలసీమ పాలనా రాజధాని కోరుకోవడం లేదని చెప్పారు. తమకు హైకోర్టు చాలన్నారు. తద్వారా ఈ డిమాండ్లను తాత్కాలికంగా అయినా నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. కానీ ఎంతోకాలం జనం మౌనంగా ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
0 Comments:
Post a Comment