Museum of Londonలండన్‌లోని ప్లేగు సమాధుల్లో గల మానవ అస్తిపంజరాలను జన్యు విశ్లేషణకు ఉపయోగించారు
మానవాళి చరిత్రలో నమోదైన అత్యంత భీకర మహమ్మారి 'బ్లాక్ డెత్'.
పదమూడో శతాబ్దం మధ్య కాలంలో యూరప్ అంతటినీ కబళించిన ప్లేగు మహమ్మారి జనాభాలో సగం మందిని బలి తీసుకుంది.
ఆనాటి ప్లేగు మహమ్మారి మానవాళి జన్యువుల మీద వేసిన ముద్ర ఇప్పటికీ కొనసాగుతోందని, మనుషుల ఆరోగ్యాన్ని అది ప్రభావితం చేస్తూనే ఉందని పరిశోధకులు చెప్తున్నారు.
ఓ అధ్యయనంలో శతాబ్దాల కిందటి అస్తిపంజరాల డీఎన్‌ఏను విశ్లేషించినపుడు.. ఆ కాలంలో జన్యుపరివర్తనం చెందటం వల్ల జనం ఆ ప్లేగును తట్టుకుని మనగలిగారని వెల్లడైంది.
అయితే.. అవే జన్యుపరివర్తనలకు, ఇప్పుడు ప్రజలను ప్రభావితం చేస్తున్న ఆటో-ఇమ్యూన్ జబ్బులకు సంబంధం ఉందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు.
నాటి బ్లాక్ డెత్ వల్ల దాదాపు 20 కోట్ల మంది జనం చనిపోయినట్లు అంచనా. అంతటి భారీ ఘటన.. మానవ పరిణామం మీద ప్రభావం చూపి ఉండాలని పరిశోధకులు భావించారు. దీంతో ఆ కాలానికి సంబంధించిన 206 అస్తిపంజరాల నుంచి డీఎన్‌ఏ సేకరించి విశ్లేషించారు.
బ్లాక్ డెత్ వ్యాప్తికి ముందు, అది వ్యాపించిన కాలంలో, అది ముగిసిన తర్వాతి కాలంలోని అస్తిపంజరాల నుంచి ఈ డీఎన్ఏ నమూనాలు సేకరించారు.
లండన్‌లో సామూహిక ఖననాలు చేసిన ఈస్ట్ స్మిత్‌ఫీల్డ్ ప్లేగు గుంతల నుంచి తవ్వితీసిన ఎముకలు, డెన్మార్క్ నుంచి తెప్పించిన నమూనాల మీద ఈ విశ్లేషణ నిర్వహించారు.
McMaster Universityపరిశోధకులు 700 ఏళ్ల కిందటి వ్యక్తుల పన్నుల నుంచి డీఎన్‌ఏను సేకరించి విశ్లేషించారు
ఈఆర్ఏపీ2 అనే జన్యువులో జరిగిన మార్పులను ఈ అధ్యయనంలో గుర్తించారు. ఆ వివరాలను 'నేచర్' జర్నల్‌లో ప్రచురించారు.
సరైన జన్యుపరివర్తనలతో ఆ ప్లేగును తట్టుకుని మనగలిగే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉంటుంది.
''అది చాలా భారీ ప్రభావం. మానవ జన్యుపటంలో ఇలాంటి దానిని గుర్తించటం ఆశ్చర్యం కలిగించింది'' అని యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రొఫెసర్ లూయి బారీరో చెప్పారు.
శరీరం మీద దాడి చేసే సూక్ష్మజీవులను అంతం చేసే ప్రొటీన్లను తయారు చేసే విధి ఈ జన్యువుది.
అలా అంతం చేసిన ఆ సూక్ష్మజీవుల అవశేషాలను రోగనిరోధక వ్యవస్థకు చూపించటం ద్వారా, శత్రువును మరింత సమర్థవంతంగా గుర్తించటానికి, నిర్వీర్యం చేయటానికి ఆ వ్యవస్థను ఈ ప్రొటీన్లు సంసిద్ధం చేస్తాయి.
ఈ జన్యువు విభిన్న రకాలుగా ఉంటుంది. వీటిలో పని చేసే జన్యువులు, ఏ పనీ చేయని జన్యువులు ఉంటాయి. ఈ జన్యువు తల్లిదండ్రుల నుంచి ఒక్కో కాపీ చొప్పున వారసత్వంగా వస్తుంది.
తల్లిదండ్రుల నుంచి బాగా పనిచేసే జన్యువు కాపీలు లభించిన అదృష్టవంతులు.. మనగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలా బతికి బట్టకట్టిన వారు పిల్లలను కన్నపుడు.. వారిలోని సహాయకారి జన్యుపరివర్తనలు ఆ పిల్లలకు వారసత్వంగా లభించాయి. దీంతో ఆ పరివర్తిత జన్యువులు అకస్మాత్తుగా చాలా విస్తారమయ్యాయి.
''అది చాలా భారీగా ఉంది. రెండు, మూడు తరాల్లో 10 శాతం మార్పును మేం చూశాం. ఇప్పటివరకూ మానవాళి చరిత్రలో ఇదే అత్యంత బలమైన (ప్రకృతి) వరణం'' అని మెక్‌మాస్టర్ యూనివర్సిటీకి చెందిన పరిణామ జన్యుశాస్త్రవేత్త ప్రొఫెసర్ హెండ్రిక్ పొయినార్ నాతో చెప్పారు.
ప్లేగు బాక్టీరియం యెర్సీనియా పెస్టిస్‌ను ఉపయోగించి నిర్వహించిన ఆధునిక ప్రయోగాల్లో ఈ ఫలితాలు నిర్ధారణ అయ్యాయి. సహాయకార జన్యుపరివర్తనలు కలిగివున్న వారి నుంచి సేకరించిన రక్తనమూనాలు.. ఆ జన్యుపరివర్తనలు లేని రక్తనమూనాల కన్నా ఎక్కువగా ఇన్ఫెక్షన్‌ను ప్రతిఘటించగలిగాయి.
''మైక్రోస్కోప్ కింద బ్లాక్ డెత్ రెక్కలు చాచటం చూశాం. అది కళ్లు తెరిపించింది'' అని ప్రొఫెసర్ పొయినార్ పేర్కొన్నారు.
University of Chicago
నేడు కూడా ప్లేగును తట్టుకునే జన్యుపరివర్తనలు.. బ్లాక్ డెత్ కాలానికి ముందు కన్నా మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే సమస్య ఏమిటంటే.. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వంటి ఆటో-ఇమ్యూన్ జబ్బులకు ఈ జన్యుపరివర్తనలకు సంబంధం ఉంది. అంటే.. ఏడు శతాబ్దాల కిందట మీ పూర్వీకులు ప్లేగు మహమ్మారిని తట్టుకుని బతకటానికి సాయపడిన జన్యుపరివర్తలను ఇప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండవచ్చు.
అలాగే మన డీఎన్‌ఏ వారసత్వంలోని ఇతర చారిత్రక శక్తులు కూడా వాటి ప్రభావం చూపిస్తుంటాయి. ఆధునిక మానవుల్లో సుమారు 1 నుంచి 4 శాతం డీఎన్‌ఏ మన పూర్వీకులు నియాండర్తల్స్‌తో సంగమించటం వల్ల సంక్రమించింది. ఈ వారసత్వం.. కోవిడ్ సహా పలు జబ్బులకు మన శరీరం స్పందించే సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది.
''అంటే గతంలోని ఆ గాయాల గుర్తులు.. నేడు మనం జబ్బులకు గురవటం మీద ఇప్పటికీ గణనీయంగా ప్రభావం చూపుతున్నాయి'' అని ప్రొఫెసర్ బారీరో చెప్పారు.
బ్లాక్ డెత్ కాలం నాటి 40 శాతం మనుగడ సానుకూలత.. మనుషుల్లో ఇప్పటివరకూ అంచనా వేసిన అత్యంత బలమైన ప్రకృతి వరణ ప్రభావమని ఆయన పేర్కొన్నారు. హెచ్ఐవీని ప్రతిఘటించే జన్యుపరివర్తనలు, పాలను జీర్ణం చేసుకోవటానికి దోహదపడే జన్యుపరివర్తనల వల్ల లభించిన ప్రయోజనాలు.. ఈ బ్లాక్ డెత్ జన్యుపరివర్తన ముందు దిగదిడుపుగా ఉన్నట్లు కనిపిస్తాయి. అయితే ఇలా నేరుగా పోల్చటం సరికాదని ప్రొఫెసర్ బారీరో అంటారు.
కానీ.. కోవిడ్ మహమ్మారి ఈ తరహా జన్యువారసత్వాన్ని అందించదు.
జీవపరిణామం.. మన పునరుత్పత్తి ద్వారా, మన జన్యువులను వారసత్వంగా అందించే సామర్థ్యం ద్వారా పని చేస్తుంది. ఎందుకంటే.. పిల్లలను కనే స్థాయి దాటిపోయిన పెద్దవాళ్లను కోవిడ్ ప్రధానంగా బలితీసుకుంటోంది.
కానీ ప్లేగు వ్యాధి అన్ని వయసుల వారినీ, అత్యధిక సంఖ్యలో సంహరించటం వల్ల.. దాని ప్రభావం మానవ జన్యుపటం మీద చెరగని ముద్ర వేయగలిగింది.
0 Comments:
Post a Comment