సాధారణంగా మనుషుల లాగా మూగ జంతువులకు ఎలాంటి స్థిర, చర ఆస్తులు ఉండవు. స్వార్థపరులైన మనుషులు జంతువులు నివసించే అడవులను కూడా ఇప్పుడు నరికేస్తూ స్వాధీనం చేసుకుంటున్నారు.
దీంతో వాటికి నిలువ నీడ లేకుండా పోతోంది. అలా దిక్కు ముక్కు లేని ఈ పరిస్థితులలో మూగ జంతువులు బతుకుతున్నాను. అయితే కొందరు ఈ జంతువుల కోసమేనని ప్రత్యేకంగా షెల్టర్ ఇస్తున్నారు.
మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా 32 ఎకరాల భూమి కోతులకే అంకితమిచ్చారు. అంతేకాదు, ఆ 32 ఎకరాల భూమిని తన ఊరిలో నివసించే వానరాల పేరిటే రిజిస్ట్రేషన్ చేయించారు.
మనుషులు, ఆలయాలు, సంస్థల పేరిట భూమి రిజిస్టర్ అయి ఉండటం మనం చూశాం. కానీ ఇలా జంతువుల పేరిట ల్యాండ్ రిజిస్టర్ అయి ఉండటం బహుశా ప్రపంచంలోనే ఇదే తొలిసారేమో కదా.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, ఉస్మానాబాద్ జిల్లాలో ఉప్లా అని పిలిచే ఓ గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఏకంగా 32 ఎకరాల భూమి కోతుల పేరిట రిజిస్టర్ అయి ఉంది.
రీసెంట్‌గా రెవిన్యూ అధికారులు గ్రామ పంచాయితీ రికార్డులను తిరగేస్తున్నప్పుడు 32 ఎకరాల భూమి ఆ ఊరి వానరాల పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలిసొచ్చింది. మొదట దీనిని వారు నమ్మలేదు.
ఆ తర్వాత అది నిజమేనని తెలిసి వారు ఆశ్చర్యపోయారు. గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్ ఈ భూ పత్రాలన్నీ ఆ 32 ఎకరాల భూమి వానరాలదేనని కచ్చితంగా చెబుతున్నాయని అన్నారు. అయితే, ఆ పత్రాలను ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో తనకు కొంచెం కూడా ఐడియా లేదని పేర్కొన్నారు.
నిజానికి ఈ ఊరి ప్రజలకు కోతుల అంటే ఎనలేని ప్రేమ, అభిమానం. కొన్నేళ్ల క్రితం వరకు ఈ ఊరి ప్రజలు కోతులు ఇంటికి వస్తే చాలు వాటికి ఆహారం పెట్టకుండా బయటకు పంపించేవారు కాదు.
పెళ్లిళ్లు, పండుగలు, ఇతరత్రా శుభకార్యాల సందర్భంగా కూడా వాటిని అతిథులుగా భావిస్తూ భోజనాలు పెట్టేవారు. ఇళ్లల్లో శుభకార్యం జరిగితే ముందు కోతులకే బహుమానాలు ఇచ్చేవారు.
ఆ కాలంలోనే వీటిని బాగా ప్రేమించే వ్యక్తి వీటి కోసం 32 ఎకరాల భూమిని రాసిచ్చాడేమోనని అక్కడ అధికారులు భావిస్తున్నారు. ఏది ఏదైనా ఇప్పుడు ఈ వార్త భారత దేశ వ్యాప్తంగా అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
0 Comments:
Post a Comment