భారత దేశంలోని అన్ని రకాల దేవాలయాలు దసరా, దీపావళి పర్వదినాల్లో తెరుచుకుంటాయి. ఈ రోజుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఏవైనా గ్రహణాలు ఉంటే మాత్రం, గుళ్లను మూసివేస్తారు.
ఆ తర్వాత ఎప్పటి మాదిరిగానే కార్యకలాపాలు జరుగుతాయి. అయితే కర్ణాటకలోని ఒక ఆలయం మాత్రం ఏడాదిలో ఒక్క మూడు రోజులు తప్ప మిగిలిన రోజుల్లో మూతబడే ఉంటుంది.
ధార్వాడ్‌లోని తబకడహోన్నల్లిలో ఉన్న ఈ ఆలయాన్ని.. దీపావళి సందర్భంగా సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే భక్తుల కోసం తెరిచి ఉంచుతారు.
తబకడహోన్నల్లిలో ఉన్న ఈ దేవాలయంలో హోలాలమ్మ దేవి (Goddess Holalamma Devi) కొలువై ఉంటుంది. అయితే దీపావళి సందర్భంగా గుడి తెరుచుకున్నా, ఇక్కడ డెకరేషన్ కోసం విద్యుత్ దీపాలు వంటివి వెలిగించరు.
దీనికి బదులుగా ఇక్కడ ఉన్న శతాబ్దాల నాటి దీపాలను వెలిగించి, హోలాలమ్మ దేవి దర్శనం చేసుకుంటారు. సంవత్సరం మొత్తంలో మూడు రోజులే తెరిచి ఉండటంతో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.
సంతాన దేవత
ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హోలాలమ్మ తల్లిని దర్శించుకుంటే కోరిక కోరికలన్నీ తీరుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
అందుకే పిల్లలు పుట్టని వారు ఈ మూడు రోజుల్లో పెద్ద సంఖ్యలో దైవ దర్శనానికి వస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న హోలాలమ్మ అమ్మవారిని 'సంతానోత్పత్తి దేవత' అని కూడా పిలుస్తారు. వంధ్యత్వంతో బాధపడుతున్న చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఫలితాలను పొందారని భక్తులు చెబుతున్నారు.
తాము గత మూడు సంవత్సరాలుగా ఇక్కడకు వస్తున్నామని, తమ జీవితంలో చెప్పుకోదగిన మార్పులు వచ్చాయని ఒక భక్తుడు చెప్పారు. అమ్మవారి ఆశీర్వాదంతో తమ కోరికలు నెరవేరాయి కాబట్టి, ఏటా ఇక్కడికి వస్తున్నామని పేర్కొన్నారు.
మూడు రోజులు పూజలు
హోలాలమ్మ దేవాలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడి నియమాల ప్రకారం.. ఒకసారి గుడికి వచ్చిన భక్తుల కోరికలను అమ్మవారు నెరవేరిస్తే, వారు దేవాలయం తెరిచి ఉండే మూడు రోజుల్లో తప్పనిసరిగా పూజలు నిర్వహించాలి.
ఇది కొన్ని వందల ఏళ్లుగా వస్తున్న ప్రత్యేకమైన ఆచారమని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ ఆలయం కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడ ఉందని గ్రామస్తులు చెబుతుంటారు. అయితే దీని కచ్చితమైన చరిత్ర గురించి ఎలాంటి ఆధారాలు లేవు.
0 Comments:
Post a Comment