Search This Blog

Monday, 8 August 2022

Tirumala - తిరుమల లోయల్లోకి ఒకసారి తొంగి చూస్తారా?

అనగనగా ఒక రోజు...ఆకాశంలో ఏ మాత్రం నల్ల మేఘాలేవీ లేని రోజు. వానొచ్చే సూచనే  లేని రోజు. దూది పింజల్లా తెల్లటి మేఘాలు తేలుతూ ఎటో సుదూరపు యాత్రకు హడావిడిగా వెళ్తన్నట్లున్న రోజు. మీరంతా, ‘ఇక  బయల్దేరండి, లేటయితే చీకటిపడుతుంది,’అని సరుకు సరంజామా సర్దుకుని శేషాచలపు కొండల్లో ఉన్న ఒక కోనకు వెళ్తున్నారు.

అలా 30 కిమీ దూరం బైకుల మీద వెళ్లి అడవి అంచున మిగతా ప్రపంచంనుంచి విసిరేసినట్లున్న  కొండాపురం చేరారు. అక్కడ ఒక ఇంటి దగ్గిర బైకులు పార్క్ చేసి  కోన వైపు వెళ్లాలనుకున్నారు. కోన కొండ ఎక్కెందుకు ఎక్కడా దారి లేదు. నిటారుగా ఉన్న కొండను జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లాలి. ఈజీగా కొండెక్కించే కాలిమెట్లు పది కిలోమీటర్లు పోతే గాని రావు.

అందువల్ల మీరంతా ఎడ్వెంచర్ చేద్దామని కొండాపురం కొండ దరికి బయలు దేరారు.

స్వాగతం చెబుతూ చేతులూపుతున్నట్లు అడవిలో చెట్ల కొమ్మలన్నీ ఊగుతున్నాయి. అలా మీరు నాలుగు కిలోమీటర్లు నడిచాక కొండమీదికి ఎక్కేందుకు ఒక జాడ కనిపించింది. ఎక్కడం చాలా కష్టం, ఎక్కి తీరాలి. అలా గంటసేపు కష్టపడి, చెట్లకొమ్మలు పట్టుకుని కొద్ది సేపు,  మొదట వెళ్లిన కుర్రవాడు జారేసిన తాడుపట్టుకుని రొష్టుతూ రొప్పుతూ మరికొంత సేపు మొత్తానికి కొండ ఎక్కారు.

అక్కడ విశాలమయిన మైదానం. పరుపులు పరిచినట్లు బండ పరుపులు. ఒక సారి సర్వే చేద్దామని ఒక రెండు కిలో మీటర్లు తిరిగి ఒక చోటు రాత్రి మకాం వేసేందుకు అనువైందని ఎంచుకున్నారు. పక్కనే లోయ. లోయలో నుంచి జలపాతం దూకుతున్న శబ్దం. ఎవరో వచ్చారని, ‘పారాహుషార్’ అని అడవినంతా ఎలెర్ట్ చేస్తున్నట్లు ఉన్నట్లుండి ఏవో పక్షులు పెద్దగా అరుస్తున్నాయి.

వంట బృందం రెడీఅయింది. కట్టెల బృందం కట్టేలేరేందుకు కదిలింది. గుడారాల బృందం రంగంలోకి దిగింది. ఈలోపు చీకటి పడింది. మొదట టీ పూర్తయింది. ఆ తర్వాత సాంబారన్నం. మెల్లిగా చీకటిపడింది. పైన ఆకాశంలో ‘నేనున్న మీకు తోడుగా’ అంటూ  కాపలా కాస్తున్నట్లు చంద్రుడు. భోజనాలయ్యాయి. ఆ మాట ఈమాట చెప్పుకుని అంతా గుడారాల్లోకి వెళ్లేసరికి అర్థరాత్రి అయింది. నిద్రరాని కుర్రాళ్లిద్దరు క్యాంప్ ఫైర్ దగ్గిర గుసగులాడుతున్నారు.

మెల్లిగా అడవంతా సద్దుమణగడంతో దూరాన జలపాతం సవ్వడి ఇంకా ఎక్కువయింది.  భయం లేదు. ప్రతిచెట్టూ మీకు సెంట్రీ కాస్తున్నది. ఎపుడో పొద్దున ఏడుగంటలకు మీరు లేచే సరికి...అడవంతా ఆకర్ణాంత నేత్రాలతో మిమ్మల్నే గమనిస్తున్నట్లు ఉలిక్కిపడతారు. చుట్టూర పచ్చని చెట్లు ఎలా ఉంటాయి? మంచు స్నానం చేసి నీరెండలో కురులు ఆరబోసుకుంటున్న ఎంకిలా ఉంటాయా.... అపుడు సెగలుకక్కే టీ గ్లాస్ అందుకుని ఒక్కొక్క సిప్ చేస్తూ చుట్టూర కొండలను,బండలను, ఎత్తయిప చెట్లను కొండ నెర్రెల్లోంచి పొడుకు వచ్చిన మొక్కలను, మీ పక్కనే చిటికెనవేళంత లేని మొక్కకి పూచిన కొండమల్లెనె, వేటకు వెళ్లుతున్న పిట్టలను,మిమ్మల్నసలు లెక్క చేయకుండా మీ వైపు ఎగురుకుంటూ వస్తున్న ఒకటీ రెండు సీతాకోక చిలుకలను 360 డిగ్రీల్లో మీరు చూస్తుంటారు....అపుడెలా  ఉంటుంది మీ మనసు...?

దీనికి సమాధానం చెప్పాలంటే ఇలాంటి కోనని , కొండని. పక్కనే జలపాతాలున్న లోయని వెదుక్కుంటూ వెళ్లాలి. లేదా ఈ అద్బుతమయిన  ఇలాంటి అనుభవం చల్లగా తాకి ఒళ్లంతా పారాడాలంటే... రాఘవ శర్మ రాసిన ‘తిరుమల దృశ్య కావ్యం’ చదవాలి. 

68 యేళ్ల రాఘవ శర్మ సీనియర్ సిటిజన్లలో కుర్రవాడు. కుర్రవాళ్లల్లో పిల్లవాడు. ఆయన కాళ్లకి కనిపించని చక్రాలున్నాయి. ఆయన ఈజీగా కొండలెక్కగలడు, లోయల్లోకి జారగలడు. మైదానాల్లో దూసుకుపోగలడు. దీని వల్లే ఆయన తిరుపతిలోకి కుర్రవాళ్ల ట్రెకింగ్ టీమ్ లో చేరాడు. ఒదిగి పోయారు. ట్రెక్ వాళ్ల జీవన శైలి. దీన్నుంచి వచ్చిందే ఈ పుస్తకం.

తిరుపతి తిరుమల అనే మాటలు అందరికి పరిచయం. అయితే, తిరుపతి , తిరుమల ఉండే శేషాచలం కొండల గురించి ఎవ్వరికీ తెలియదు. అంతా హడావిడిగా  తిరుపతి వచ్చేసి తిరుమలేశుని దర్శించుకుని, మహా అయితే, ఆ కాళహస్తి, అలుమేలు మంగాపురం, పాపనాశం చూసి వెళ్లిపోతూ ఉంటారు. ఓపిక ఉన్నవాళ్లు చంద్రగిరి కోటను అబ్బో ఏముంది అనుకుంటూ వెళ్లిపోతుంటారు.

అయితే, తిరుమలకు చూట్టూరు రెండు మూడు పరుగుల దూరంలో మనల్ని విస్మయం చేసే వింతలున్నాయి. ఈ విషయం నాకు రాఘవ శర్మ ట్రెక్ అనుభవాలు చదవితే గాని తెలియదు. తిరుమల ఉండే శేషాచలం కొండల్లో దాదాపు 200 దాకా కోనలు, మడుగులు తీర్థాలు ఉన్నాయట. వాటి పేర్లు కూడా వినసొంపుగా ఉంటాయి. తాంత్రిక లోయ, శేష తీర్థం, కుమార ధార, తుంబురు కోన, చక్రతీర్థం, గుంజన జలపాతం, యుద్ధగళ, నెలకోన. ఎర్రొడ్ల మడుగు, గుర్రప్ప కొండ... ఇలా ఎన్నో. ఇక్కడల్లా చిన్నదో పెద్దదో గుడి ఉంది. వచ్చిపోయే వాళ్లు బాగా తక్కువ. అందుకే ఇంకా అవి స్వచ్ఛంగా, పవిత్రంగా ఉన్నాయి. ఇక్కడి సెలయేర్లలో పారే నీళ్లని, జలపాతాల్లోంచి దూకే నీళ్లని దోసిలి పట్టి జుర్రుకోవచ్చు. దోసిలితో నీళ్లు తాగడంలో ఉన్నమజాయే వేరు.

చాలా తీర్థాలకు దారులుండవు. ఉన్నాచెట్లు పెరిగి బూడిపోయి ఉంటాయి.  దారులను వెదుక్కుంటూ వెళ్లాలి. తీరావెళ్లితే, అనుకున్నచోటికి కాకుండా అది మరోచోటికి, మరోప్రపంచానికి తీసుకువెళ్తుంది. అదొక చెయిన్ ట్రెక్. ఒకచోటి నుంచి మరోచోటికి, అక్కడి నుంచి ఇంకోచోటికి, అక్కడి నుంచి కుడివైపు మరొకచోటికి, ఎడమ వైపు వెళ్లితే మరో లోయలోకి... అంతులేని దారుల మాయాజాలం ఆ ప్రపంచం.

అక్కడంతా  రాఘవ శర్మ చక్కర్లు కొట్టారు. అక్కడ లోయల్లోకి జారుకుంటూ దిగారు, ఊపిరి బిగపట్టుకుని కొండలెక్కారు.  ఆయాస పడుతూనే బండరాళ్లను ఎక్కి దిగారు. సెలయేర్లలో దిగి సేద తీరారు. కాలువల్ని చెంగున దూకి దాటారు. మడుగుల్లో ఈత కొట్టారు... ఇలా ఎనెన్ని సాహసానుభవాలున్నాయో ఈ చిన్నపుస్తకంలో.

 ఈ పుస్తకంలో పేర్కొన్న చాలా తీర్థాలకు ప్రవేశంలేదు. అటవీ శాఖ వారి అనుమతి తీసుకోవాలి కొన్ని ప్రాంతాలకు టిటిడి వారు అనుమతించరు. అధికారులు ప్రకటించిన తేదీలలోనే అనుమతిస్తారు.  కొన్ని చోట్లకు ఎపుడయినా వెళ్లొచ్చు.

తిరుమల కొండల్లో  ఒక్కొక్క తీర్థయాత్ర ఒక్కొక్క అనుభవం. కొన్నిచోట్లకు టిటిడి వాళ్లే వేసిన నిచ్చెన ఎక్కి వెళ్లాలి. దిగి, రావాలి. కుమారధారకు వెళ్లాలంటే ఇదే మార్గం.

ఈ రెండూ యాత్రలు ఒకలాగా ఉండవు.  అందులో శేషతీర్థం గురించి రాఘవ శర్మ (కింది ఫోటో) ఇలా చెప్పారు.

“తిరుమల కొండల్లో అబ్బుర పరిచే తీర్థాల్లో శేషతీర్థం ఒకటి. తిరుమల ఆలయానికి కేవలం పది కిలో మీటర్ల దూరానే ఉన్నా శేష తీర్థానికి చేరుకోవడం చాలా కష్టం. కష్టేఫలి. కష్టపడి, వగరుస్తూ, కాళ్లీడ్చుకుంటూ, ఈదుకుంటూ, దాటుకుంటూ, ఎక్కుతూ దిగుతూ శేషతీర్థం చేరాక అలసట బదులు మనసు ఉల్లాసభరితం అవుతుంది. అక్కడి కొండలు, గుండం, సన్నటి దారి, జలపాతం…  కనువిందు చేస్తాయి. కష్టమయినా సాధ్యమే శేష తీర్థం చేరడం. గోగర్భ డ్యాం నుంచి పది కి.మీ లోపే  ఉన్నా రాను పోను ట్రెకింగ్ కు నాలుగు గంటలు పడుతుంది. శేష తీర్థం యాత్ర మరచిపోలేని అనుభూతిగా మిగులుతుంది.”

ఈ సాహస యాత్రలన్నీ చాలా మటుకు  పత్రికల్లో  అచ్చయ్యాయి. అవి చూస్తే ఒక రౌండలా అక్కడికి వెళ్లాలనిపిస్తుంది. కావాలంటే అలాంటి  పుస్తకాలు మీరు  చదివిచూడండి. ఏ అనుభూతి కలుగుతుందో చెప్పండి. ఇలాంటి ట్రెక్ చేయాలి. ఇలాంటి పుస్తకాలు చదవాలి. ఎందుకంటే, ప్రకృతి మీద మనకు ఎనలేని ప్రేమ పడుతుంది. ఈ అడవుల్ని, కొండలను,చెట్లను, చేమలను, పుట్టలను గుట్టలను ఎందుకు కాపాడుకోవాలో అర్థమవుతుంది. అడవులు, కొండలు అంతరించిపోతే ఏమవుతుంది? మనిషికి అత్యంత ఇష్టమయినది ఆకు పచ్చ రంగు. అది కళ్ల ఆరోగ్యానికే కాదు, మానవజాతి ఆరోగ్యానికి అవసరం.  అడవులు,కొండలు అంతమయితే పచ్చదనం పోతుంది. చుట్టూర ప్రకృతి రసహీనమవుతుంది. 

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top