ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ (Taj Mahal) గురించి తెలియని వారుండరు. అత్యద్భుతంగా కనిపించే ఈ నిర్మాణాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు భారతదేశానికి వస్తుంటారు.
అయితే మన ఇండియాలో కేవలం తాజ్ మహల్ మాత్రమే కాదు బ్లాక్ తాజ్ మహల్ (Black Taj Mahal) కూడా ఉంది. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజం.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఒక నల్ల తాజ్ మహల్ లేదా కాలా తాజ్ మహల్ (Kala Taj Mahal) ఉంది.
తాజ్ మహల్ లా కనిపించే ఇది షా నవాజ్ ఖాన్ సమాధి (Tomb of Shahnawaz Khan). మధ్యప్రదేశ్ రాష్ట్రం, బుర్హాన్పూర్ నగరం, థెరిస్సా ప్రాంతంలోని ఉటావలి నది (Utavali River) ఒడ్డున ఉన్న ఇది ప్రజలను బాగా ఆకట్టుకుంటోంది.
ఈ అద్భుతమైన నిర్మాణం తాజ్ మహల్ కట్టిన తర్వాత కట్టారు. తాజ్ మహల్ తో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఈ భవనాన్ని స్థానికంగా దొరికే నలుపు రంగు రాయితో నిర్మించారు. 1622, 1623 సంవత్సరాల మధ్య దీని నిర్మాణం పూర్తయింది.
దీనిని స్థానికంగా బ్లాక్ తాజ్ మహల్ లేదా కాలా తాజ్ మహల్ అని కూడా అంటుంటారు. షా నవాజ్ ఖాన్ అక్బర్ కాలంనాటి కవి అబ్దుల్ రహీమ్ ఖాన్ఖానా పెద్ద కుమారుడు. అతను బుర్హాన్‌పూర్‌లోనే పెరిగారు. అతని ధైర్యసాహసాలు చూసి మొఘల్ సైన్యానికి కమాండర్‌గా నియమించారు.
అయితే షా నవాజ్ 44 ఏళ్ల వయస్సులోనే కన్నుమూశారు. అతని భౌతిక కాయాన్ని బుర్హాన్‌పూర్‌లోని ఉటావలి నది ఒడ్డున ఖననం చేశారు. ఈ తాజ్లోనే షానవాజ్ ఖాన్ భార్య సమాధి కూడా ఉంది.
బ్లాక్ తాజ్ మహల్ చతురస్రాకారంలో ఉండే ఈ అద్భుతమైన కట్టడం. ఇది పెద్ద గోపురంను పోలి ఉంటుంది. ఈ సుందరమైన భవనం చుట్టూ ఒక తోట ఉంది. దాని నాలుగు మూలల్లో వరండాలు ఉంటాయి.
అలానే ఆరు మూలల్లో మినార్లు ఉంటాయి. దీని లోపలికి వెళ్ళిన తరువాత గోడలపై అందమైన పెయింటింగ్స్ కనిపిస్తూ మనసులను దోచేస్తాయి.
ఒక చిన్న నిచ్చెన స్మారక చిహ్నం క్రింద ఉన్న షా నవాజ్ ఖాన్ నిజమైన సమాధికి దారి తీస్తుంది. ఆసక్తి ఉన్న వారు, బుధవారం మినహా వారంలో ప్రతి రోజూ మీరు బ్లాక్ తాజ్ మహల్ ను విజిట్ చేయవచ్చు.
భవనం ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. దీనిని చూసేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. తాజ్ మహల్ కి వచ్చినంత పేరు దీనికి రాలేదు.
స్థానికంగా దీనిని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కానీ ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకుల తాకిడి తక్కువగానే ఉంటుంది.
0 Comments:
Post a Comment