ఇంటర్నెట్ డెస్క్: గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు (ITR) గడువు జులై 31తో ముగిసింది.
దేశవ్యాప్తంగా సుమారు 5.83 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేశారు. ఇప్పటికే రిటర్నులు దాఖలు చేసిన వారికి రీఫండ్లు (Refund) కూడా క్రెడిట్ అవుతున్నాయి. ఒకవేళ మీరూ ఐటీఆర్ దాఖలు చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఆన్లైన్ ద్వారా సులువుగా చెక్ చేసుకోవచ్చు.
సాధారణంగా ఐటీఆర్ దాఖలు చేసిన 20 నుంచి 45 రోజుల్లో ఆదాయపు పన్ను శాఖ రీఫండ్లను ప్రాసెస్ చేస్తుంది. కొంతమందికి 10-14 రోజుల్లోనే రీఫండ్ వస్తుంది. ఒకవేళ 21 రోజులు మించినా రీఫండ్ రాకపోతే రిటర్నులను మరోసారి సరిచూసుకోవడం మంచిది.
ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ రిటర్నులను ఆమోదించి ప్రాసెస్ చేస్తూ ఉంటే ఆ వివరాలు మీరు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే, రీఫండ్ స్టేటస్‌ను తెలుసుకోవాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి.
రీఫండ్ స్టేటస్ ఇలా..
www.incometax.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి.
పాన్ కార్డు వివరాలతో అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
ఈ-ఫైల్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విభాగంలో వ్యూ ఫైల్డ్ రిటర్న్స్‌ను ఎంచుకోవాలి.
వ్యూ డీటెయిల్స్‌ను ఎంచుకోవడంతో ఇటీవల మీరు దాఖలు చేసిన ఐటీ రిటర్నుల స్టేటస్‌ను మీరు తెలుసుకోవచ్చు.
ఇంటిమేషన్ లెటర్ వచ్చిందా?
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరు రిటర్నులు దాఖలు చేసి ఉంటే మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇంటిమేషన్ లెటర్ అందుతుంది. రిటర్నులు ప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఐటీ శాఖ దీన్ని రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడీకి పంపిస్తుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయిన 9 నెలల్లోగా ఇంటిమేషన్ లెటర్‌ను ఐటీ శాఖ మీకు పంపించాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువు ఏడాదిగా ఉండేది.
ప్రస్తుతం ఐటీ శాఖ ఈ ఇంటిమేషన్ లెటర్‌ను రిటర్నులు దాఖలు చేసిన కొన్ని గంటల్లోనే పంపిస్తోంది.
ఉదాహరణకు గతేడాదికి సంబంధించిన రిటర్నులను మీరు ఈ ఏడాది దాఖలు చేసి ఉంటే.. మీకు వచ్చే ఏడాది (2023) డిసెంబర్ 31లోపు ఇంటిమేషన్ లెటర్ పంపించాల్సి ఉంటుంది. 2021 బడ్జెట్లో ఈ గడువును మూడు నెలలు తగ్గించారు.
ఇ-మెయిల్‌కు వచ్చిన ఇంటిమేషన్ లెటర్‌ను ఓపెన్ చేయాలంటే పాన్ నంబర్‌ను స్మాల్ కేస్‌లో ఇచ్చిన తర్వాత మీ పుట్టిన తేదీని (DDMMYYY) ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో పన్ను వివరాలు, మినహాయింపులు పొందిన వివరాలూ ఉంటాయి.
0 Comments:
Post a Comment