అద్భుతమైన కట్టడాలు., అబ్బురపరిచే శిలా సంపద, ఎత్తైన కొండపై బహుళ అంతస్థుల రాతి మండపాలు అలనాటి రాజుల పరిపాలనకు నిలువెత్తు సాక్షాలు.
రాజులు తమ రాజ్య పాలన, వారి కొలిచే దైవాలు.. ఆచార వ్యవహారాలకు పూర్వికులు చెక్కిన రాతి ఆకృతులు ఆనవాళ్లు.
ఒకే బండపై ఎన్నో శిల్పకళలు.. భటులు, సిపాయిల కోసం ప్రత్యేక ఆవాసాలు. ఫలహారాలు భుజించేందుకు రాతిపైనే కంచాలు ఏర్పాటు. ఉప్పు, మంచి నీటి కోనేరుల అంతుచిక్కని రహస్యం దాగి ఉన్న చంద్రగిరి దుర్గం కోట రహస్యాలు మరెన్నో. శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి విశేషాలు, వింతలు ఎన్నో అక్కడున్నాయి. రాయల వారి సంస్థానం..!
అత్యంత సంపన్న రాజ్య పాలనగా చరిత్రలో నిలుస్తోంది. శ్రీకృష్ణ దేవా రాయల పాలనలో రత్నాలు రాసులుగా పోసి విధులపై అమ్మినట్లు ఇతిహాసాల్లో మనం విన్నాం. రాయల వారి సమర్ధవంతమైన పాలనకు అద్దంపట్టే ఏకైక కట్టడం చంద్రగిరి కోట.
చంద్రగిరి కోట పరివాహక ప్రాంతం.. కోట ఎదుట ఉండే దుర్గం కొండలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి. అసలు దుర్గం కొండపై ఎలాంటి కట్టడాలు ఉన్నాయి.
శత్రు మూకలను అడ్డుకొనేందుకు చేపట్టిన కట్టడాలు ఇంకా సజీవంగా ఉన్నాయా..? రాయల వారి రత్నాల కోట చుటూ ఎలాంటి కట్టడాలు చేపట్టారో ఇప్పుడు చూదాం
మునుపెన్నడూ చూడని రాతి కట్టడాలు చూడాలంటే దుర్గం కొండకు వెళ్లాల్సిందే. శ్రీ కృష్ణ దేవరాయలవారు సామ్రాజ్యంపై పై శత్రు మూకల దాడులు, ముష్కరుల ఆటలు సాగనీయకుండా అనునిత్యం నిఘా ఉండేలా కొండను ఎంచుకున్నారు.
అప్పట్లో రాజావారి కోట నుంచి దుర్గం గొండకు వెళ్లేలా దట్టమైన అటవీ ప్రాంతంలో రాజమార్గన్ని ఏర్పాటు చేశారు. కోట నుంచి సుమారు 5 కిలో మీటర్ల దూరం వరకు ఈ మార్గాన్ని రూపొందించారు. నాటి రాజసం, వారి శిల్పాకళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరునిపై అపారమైన భక్తి భావంతో రాయలవారు రెండవ రాజధాని అయిన చంద్రగిరిలో అనేక కట్టడాలు నిర్మించారట. శ్రీనివాసుని దర్శనార్థం విచ్చేసే రాయలవారు ఇక్కడే విడిది చేసేవారని చరిత్ర చెబుతోంది. అందమైన మార్గం నుంచి దుర్గం కొండపైకి చేరుకోగానే ఒక్కో అద్భుతం మనల్ని అబ్బురపరిచేలా చేస్తుంది.
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని సమయంలోనూ ఎత్తైన కొండపై ఇలాంటి రాతి కట్టడాలు ఎలా నిర్మించారో అని ఆశ్చర్యం రాక మానదు. కొండపైకి ఎక్కినా వెంటనే ముందుగా దర్శనమిచ్చేది. శత్రువుల జాడ కోసం సైనికులు కాపాలాకాసేందుకు ఏర్పాటు చేసిన ఎత్తైన మండపం.
ఈ మండపం నుంచి చూస్తే కోటకు నలువైపులా ఉన్న మార్గాలు, అటవీ ప్రాంతం... సుస్పష్టంగా కనిపిస్తుంది. అప్పట్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా అనునిత్యం సైనికులు ఇక్కడ పహారా కాసేవారు. రాజ్యరక్షణ కోసం ఇక్కడ నుంచే ఎన్నో వ్యూహాలు సైతం అవలంభించే వారు.
ఇక వర్షాకాలంలోను నివాసం ఉండేలా మండపం కింద భాగంలో భటులు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న ఆనవాళ్లు మనకు కనిపిస్తున్నాయి. వందల అడుగుల ఎత్తుతో ఉన్న దుర్గం కొండపైకి రాగానే మనల్ని మాత్రముగ్ధులు చేసే కోనేరు కనిపిస్తుంది. వర్షాలంలో కురిసే జల్లుల ఆధారంగా ఈ కోనేరులో నీరు చేరుతుంది. ఏడు నులక మంచాల దారాలంతలోతు ఉంటుందని రాయల వారి కాలంనాటి చరిత్ర చెపుతుంది.
ఇప్పటి వరకు కోనేటి లోతును ఎవరూ అంచనా వేయలేక పోయారంటే మనకు అర్థం అవుతోంది. అంచనా వేయలేనంత లోతు ఉంటుందని.., రాయలవారి సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు దుర్గం కొండపై నిత్యం భటులు క్రమ పద్ధతిలో షిఫ్ట్ విధానం ద్వారా విధులు నిర్వహించే వారు. వీరు ఉండేందుకు రాయలవారు ప్రత్యేక మండపాలు ఏర్పటు చేసిన కట్టడాలు ఇప్పటికి మనకు దర్శనమిస్తున్నాయి.
అదే విధంగా గుర్రాల కోసం మండపాలను సైతం దుర్గం కొండపై నిర్మించడం నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం.చంద్రగిరి కోటలోకి ప్రవేశించే మార్గంలో కుడివైపున మనకు పెద్ద బండరాయి కనిపిస్తుంది. దానిపై ఉరికొయ్యిని రాయలవారు ఏర్పాటు చేశారు. తీవ్రవాదులు, ముష్కరులు, నేరస్థులను రాజ్యంలోని ప్రజలందరి ముందు ఆ బండపై ఉన్న ఉరికొయ్యిపై ఉరితీసేవారు.
అయితే కొంత మంది వాటిని గంట మండపంగా పిలుస్తుంటారు. తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టి గంట మోగిస్తారు. అ శబ్దం విన్న తర్వాత బండపై గంట మోగించడం ద్వారా రాయలవారు భోజనం చేసేవారని మరో వాదన వినిపిస్తోంది.
ఇక దూరం కొండలో రెండు సట్టిలు ఉంటాయి. అందులో ఒకటి ఉప్పు సట్ఠి కాగా, మరొకటి పప్పు సట్ఠి. ఇవి దుర్గం కొండకు పడమటి భాగంలోఉంటాయి. ఇక్కడ ఒక బండలో నుంచి ఊటవస్తూ ఉంటుంది. లోపలికి వెళ్లిన తర్వాత నాలుగు ఇంచుల మందంతో ఒక చిన్న గోడ కనిపిస్తుంది. గోడకు ఇటువైపు ఉండేది పప్పు సట్టిగాను, అటువైపు ఉండేది ఉప్పు సట్టిగాను పిలుస్తారట. పప్పుసట్టిలోని నీళ్లు తియ్యగా, ఉప్పు సట్టిలోని నీళ్లు ఉప్పగా ఉంటాయట.
దుర్గం కొండపై ఉన్న పెద్ద పెద్ద రాతిపై చెక్కిన కంచాలు ఉన్నాయి. కాపాలాగా ఉండే సైనికులు రాతి కంచాల్లోనే భోజనాలు చేసేవారట. కోనేటి నుంచి పది అడుగుల దూరంలోని బండపై అడుగున్నర వెడల్పుతో అంగుళం లోతుతో గుండ్రటి కంచాలు కనిపిస్తాయి. వీటికి రెండువైపులా కూరలను ఉంచుకునేందుకు చెక్కిన తీరు చూసి ఆశ్చర్య పోక తప్పదు. భటులందరూ వీటిపైనే భోజనాలు చేసుకుని, కోనేటిలోని నీటిని తాగేవారు. కోనేటి నుంచి కాసింత దూరం నడుచుకుంటూ వేళ్తే మనకు అక్కగార్ల దేవతలు, నాగాలమ్మ విగ్రహాలు కనిపిస్తాయి. నాగాలమ్మ ఆలయం వద్ద ఉన్న నీటిలో కర్పూరం వెలిగితే, అది రగులుతూ లోపలకి వెళ్లడం అక్కడి అమ్మవారి శక్తికి ప్రతిరూపంగా నిలుస్తోంది.
పురాతన సంపద బావి తరాలకు అందజేసేందుకు దుర్గం కొండపైకి ఎవరిని అనుమతించరు కేంద్ర పురావస్తుశాఖ. ఎంతో విలువైన మన పూర్వీకుల ఆధారంగా నిలిచే ఈ కట్టడాలను పరిరక్షించేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎవరైనా ఆర్కియాలజీ వారి అనుమతి లేకుండా దుర్గం కొండ ఎక్కితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది కేంద్ర పురావస్తు శాఖ.
0 Comments:
Post a Comment