దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు ను దక్కించుకుని నిర్మాతగా ఎంతో మంది కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన లెజెండ్రీ సినీ తార విజయ నిర్మల.
సూపర్ స్టార్ కృష్ణ రెండవ భార్య అయిన విజయ నిర్మల కెరీర్ ఆరంభించినప్పటి నుండి కూడా సంచలనమే. చిన్నప్పటి నుండే డాన్స్ పై ఉన్న ఆసక్తితో స్థానికంగా ఉన్న గురువు వద్ద నృత్యం ను నేర్చుకుంది.
చిన్నప్పుడు రాజావారి కోట లోని విక్టోరియా హాల్ లో చిన్నతనం లోనే ప్రదర్శణ ఇచ్చే అవకాశం దక్కించుకుంది. ఆ ప్రదర్శణతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా విజయ నిర్మల పేరు మారు మ్రోగిపోయింది.
సినిమాల్లో ఆఫర్లు రావడం తో కూతురు విజయ నిర్మల తో శకుంతల మద్రాసు వెళ్లారు.
ఆ సమయంలోనే పాండురంగ మహత్యం అనే సినిమాలో విజయ నిర్మలకు బాల నటిగా నటించే అవకాశం దక్కింది. సినీ జనాల దృష్టిలో పడిన విజయ నిర్మల అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు.
విజయ నిర్మల అసలు పేరు నిర్మల మాత్రమే. కాని విజయ వారి బ్యానర్ లో ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు.. విజయ నిర్మాతలు తనను ఎంతో ప్రోత్సహించారు అంటూ తన పేరుకు ముందు ఆ నిర్మాణ సంస్థ కు సంబంధించిన పేరు ను పెట్టుకుని విజయ నిర్మల గా మారిపోయారు.
అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టడం వల్ల సినిమా మేకింగ్ విషయంలో కూడా అద్బుతమైన పట్టును విజయ నిర్మల గారు సాధించారు.
అప్పటి వరకు ఇండియన్ సినీ పరిశ్రమలో లేడీ దర్శకుల సంఖ్య చేతి వేళ్లపై లెక్క పెట్టే విధంగా ఉంది. తెలుగు లో ఇద్దరు మాత్రమే అప్పటి వరకు మెగా ఫోన్ పట్టుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకత్వం చేసిన మూడవ మహిళా దర్శకురాలిగా విజయ నిర్మల రికార్డు ను దక్కించుకున్నారు.
కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా మలయాళంలో కూడా దర్శకురాలిగా విజయ నిర్మల ఎంట్రీ ఇచ్చారు. మలయాళంలో మొదటి లేడీ డైరెక్టర్ గా విజయ నిర్మల చరిత్రలో నిలిచిపోయారు.
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ మరియు లేడీ అమితాబచ్చన్ గా పేరు దక్కించుకున్న విజయశాంతి తో పాటు సహజ నటి అంటూ అద్బుతమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న జయసుధను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది విజయ నిర్మల.
ఇక కృష్ణ తో పెళ్లి విషయానికి వస్తే... చిన్న వయసులోనే విజయ నిర్మల పెళ్లి అయ్యింది. సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టాల్సిందే అంటూ భర్త డిమాండ్ చేయడంతో తనకు ఎంతో ఇష్టమైన సినిమాను వదిలేదు లేదు అంటూ తేల్చి చెప్పి అప్పటికే పుట్టిన కొడుకు నరేష్ తో సింగిల్ మదర్ గా జీవితాన్ని కొనసాగించడం మొదలు పెట్టింది.
ఆ సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ తో పరిచయం అయ్యింది. ఇద్దరు కూడా సాక్షి సినిమాతో మరింత దగ్గర అయ్యారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరికి అప్పటికే పెళ్లి అయ్యింది అనే విషయాన్ని వారు మర్చిపోయి మరీ ప్రేమలో మునిగి పోయారు.
సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు ఇరు కుటుంబాల తో మాట్లాడి ఒప్పించారు. అధికారికంగానే కృష్ణ తన రెండో భార్య గా విజయ నిర్మల ను చేసుకున్నాడు. అదే సమయంలో ఆయన మొదటి భార్య తో కూడా తెగతెంపులు చేసుకోలేదు.
పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత కృష్ణ మరియు విజయనిర్మల కలిసి ఏకంగా 50 సినిమాల్లో నటించారు. భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈ జోడీ తో సినిమాలు చేయాలని అప్పట్లో నిర్మాతలు మరియు దర్శకులు ఉబలాట పడేవారు.
ఇండస్ట్రీలో ఒక వర్గం వారు ఈమెను విమర్శించినా కూడా మెజార్టీ వర్గం వారు ఆమెను దేవత అంటూ పూజించారు. అందుకే ఆమెకు అప్పటి ఏపీ ప్రభుత్వం అత్యున్నత రఘుపతి వెంకయ్య అవార్డు ను పొందడం జరిగింది.
సినిమా పరిశ్రమలో ఎన్నో విజయాలను సొంతం చేసుకుని ఎప్పటికి నిలిచి పోయేంతటి గుర్తింపు దక్కించుకున్న విజయ నిర్మల గారు జూన్ 27, 2019 సంవత్సరంలో మృతి చెందారు.
ఆమె మృతి సమయంలో యావత్ తెలుగు సినిమా పరిశ్రమ కన్నీరు పెట్టుకుంది. ఆమె తో సుదీర్ఘ కాలంగా జీవితాన్ని పంచుకుంటూ వచ్చిన కృష్ణ కూడా కన్నీరు మున్నీరు అయ్యారు.
0 Comments:
Post a Comment