Vitamin D: అతి అనర్థాలకు మూలం అని పెద్దలు అంటుంటారు. ఇది అన్ని విషయాలకు వర్తిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యానికి ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తినమని డాక్టర్స్ చెబుతుంటారు.
కానీ అదే ప్రోటీన్ ఎక్కువైతే రకరకాల సమస్యలు తలెత్తుతాయి. విటమిన్స్ అధిక మోతాదు (Overdose)లో తీసుకున్నా సమస్యలు తప్పవు.
ముఖ్యంగా విటమిన్ డి (Vitamin D) అతిగా తీసుకుంటే వాంతులు, ఆకలిగా లేకపోవడం, తల తిరగడం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తాయి.
ఈ ప్రమాదాల గురించి తెలియని కొందరు విటమిన్ డి సప్లిమెంట్స్ (Vitamin D Supplements) క్రమం తప్పకుండా తీసుకుంటుంటారు. దీనివల్ల అవసరానికి మించి విటమిన్ డి శరీరానికి అందవచ్చు.
ఫలితంగా కాల్షియం (Calcium), సీరం క్రియాటినిన్ లెవెల్స్ (Serum Creatinine Levels) ప్రమాదకరస్థాయిలో పెరుగుతాయి. సీరం క్రియాటినిన్ అంటే కండరాల నుంచి రక్తంలోకి చేరే వ్యర్థాలు.
ఈ వ్యర్థాల లెవెల్స్ పెరిగితే రకరకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. అందుకే డాక్టర్లు విటమిన్ డి అతిగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా విటమిన్ డి లోపంతో చాలామంది బాధపడుతుంటారు. వీరిలో కొందరు విటమిన్-డి లోపాన్ని అధిగమించేందుకు తమ ఇష్టానుసారం సప్లిమెంట్స్ మింగేస్తుంటారు. ఒక్కోసారి సప్లిమెంట్స్‌ను అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో డాక్టర్లు సూచించవచ్చు.
కారణమేదైనా విటమిన్ డి ఓవర్‌డోస్ (Overdose) శరీరానికి తీవ్ర హాని కలిగిస్తుంది. కిడ్నీలు ఫెయిల్ కావడానికి ప్రధాన కారణాల్లో విటమిన్ డి అతిగా తీసుకోవడం కూడా ఒకటి అని వైద్యులు చెబుతున్నారు.
శరీరంలో విటమిన్-డి మోతాదు పెరిగితే కాల్షియం లెవల్స్ పెరుగుతాయి. అధిక కాల్షియంను మూత్రపిండాలు తేలిగ్గా ఫిల్టర్ చేయలేవు. దీనివల్ల ఎక్కువగా దప్పిక వేస్తుంది, తరచుగా యూరిన్ వస్తుంది.
అలానే కడుపు నొప్పి, వికారం, వాంతులు, మలబద్ధకానికి కారణమవుతుంది. తీవ్రమైన సమస్యలు కూడా వచ్చే ముప్పు ఉంది.
విటమిన్ డి అనేది ఎముకలను ఆరోగ్యకరంగా ఉంచుతూ, కాల్షియం స్థాయిలను నియంత్రణలో ఉంచే ఒక ముఖ్యమైన ప్రోహార్మోన్. ఈ విటమిన్ కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు, మెటబాలిక్ సిండ్రోమ్ ముప్పు తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి.
అయితే మారుతున్న జీవనశైలి, సూర్యరశ్మిలో తగినంత సమయం గడపకపోవడం వల్ల చాలా మంది భారత దేశ ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అందుకే వీటి సప్లిమెంట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది.
వైద్యులు కూడా వీటిని చాలా మందికి సూచిస్తున్నారు. వైద్యులు సూచించకపోయినా కొందరు స్వతహాగా వీటిని కొనుగోలు చేస్తున్నారు.
అయితే నోటి ద్వారా తీసుకునే సప్లిమెంట్స్ ఆరోగ్యకరమైన మోతాదులో ఉంటే ఎలాంటి హాని జరగదని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మోతాదులను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే మాత్రం అనారోగ్యం బారిన పడటం అనివార్యమవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఈ విటమిన్‌ను మోతాదుకు మించి తీసుకుని చనిపోయిన వారు కూడా ఉన్నారని ప్రముఖ వైద్యులు పేర్కొన్నారు.
విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వారు వైద్య సలహా లేకుండా సప్లిమెంట్లను తీసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే విటమిన్ కొవ్వులో కరుగుతూ శరీరంలో ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి వీటి పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు.
ఒకవేళ మోతాదుకు మించి విటమిన్-డి తీసుకుంటే వారికి వైద్య చికిత్సలో భాగంగా ఈ పోషకం ఇవ్వడం ఆపేస్తారు. కాల్షియం స్థాయిలను డాక్టర్లు తగ్గిస్తారు.
0 Comments:
Post a Comment