🔳ఆన్లైన్లో ఫెయిల్.. జావాబు పత్రంలో పాస్
ఎంఇఒకు మార్కుల కాపీ, ప్రశ్నాపత్రం నకలును చూపుతున్న పాఠశాల కరస్పాండెంట్
ప్రజాశక్తి - ప్రత్తిపాడు:
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. ఆన్లైన్ ఫలితాల్లో ఫెయిల్ అని రాగా అసలు జవాబు పత్రంలో మాత్రం ఉత్తీర్ణత సాధించినట్లు తేలింది. ఓ ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్ చొరవతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులోని శ్రీనివాస పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదివిన మున్నంగి భవాని పరీక్షల్లో గణితంలో 28 మార్కులే వచ్చి ఫెయిల్ అయినట్లు ఆన్లైన్లో ఫలితాలు చూపించాయి. తెలుగు 85, హిందీ 28, ఇంగ్లీష్ 84, సైన్స్ 39, సోషల్ 54 వచ్చాయి. భవాని ప్రతిభగల విద్యార్థి అని, ఫలితాల్లో ఏదైనా లోపం ఉందేమోనని అనుమానం వచ్చిన పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి ఎస్ఎస్సి బోర్డుకు దరఖాస్తు చేశాడు. విద్యార్థిని జవాబు పత్రం కాపీ కావాలని కోరాడు. అనంతరం ఆ పత్రాలను పరిశీలించగా భవానికి గణితంలో 52 మార్కులు వచ్చినట్లు తేలింది. దీంతో ఆయన మండల విద్యాశాఖాధికారిని సంప్రదించి విషయం వివరించారు. విద్యాశాఖ పొరపాటు వల్ల ఓ విద్యార్థి భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం పడిందని, తమ పాఠశాలకూ చెడ్డపేరు వస్తోందని వాపోయారు. దీనిపై ఎంఇఒ స్పందిస్తూ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని, వీలుంటే సరి చేయిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా బాధిత విద్యార్థిని భవాని ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. ఒకవేళ ఇందులో మంచి మార్కులు వస్తే బెటర్‌మెంట్‌గా పరిగణించి వాటినే మార్కుల జాబితాలో నమోదు చేసే అవకాశం ఉందని ఎంఇఒ చెప్పారు
0 Comments:
Post a Comment