Success Story: 85 ఏళ్ల వయస్సులో స్టార్టప్... రాత్రికి రాత్రే సక్సెస్... డ్రీమ్ కార్ సొంతం
రిటైర్మెంట్ తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ గుజరాత్‌కు చెందిన ఓ వృద్ధుడు రిటైర్మెంట్ తర్వాత మరో వ్యాపారాన్ని ప్రారంభించారు.
85 ఏళ్ల వయస్సులో స్టార్టప్‌కు కొబ్బరికాయ కొట్టారు. బిజినెస్ విజయవంతం కావడానికి చాలా కష్టాపడాలి అనుకున్నారు కానీ... రాత్రికి రాత్రే సక్సెస్ వచ్చింది. ఆ స్టార్టప్ (Startup) అతనికి ఓవర్‌నైట్ సక్సెస్ అందించింది. అంతే... కొత్త కారు కొని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు 85 ఏళ్ల ఆంట్రప్రెన్యూర్. ఇది ఆయన డ్రీమ్ కార్ మాత్రమే కాదు, తొలి కార్ కూడా పోస్ట్ రిటైర్మెంట్ స్టార్టప్ (Post Retirement Startup) గురించి ఆయన రూపొందించిన వీడియో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 18.5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.
ఆయన పేరు రాధా క్రిషణ్ చౌదరీ. గుజరాత్‌కు చెందిన కురువృద్ధుడు. నానాజీగా పిలుస్తుంటారు. తన భార్య శకుంతలా చౌదరీతో కలిసి 2021 జనవరిలో అవిమీ హెర్బల్ పేరుతో ఆయుర్వేదిక్ హెయిర్ కేర్ బ్రాండ్‌ని ప్రారంభించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన తన కూతురితో కలిసి ఉంటున్నారు. 50 ఏళ్లపాటు కష్టపడ్డ తర్వాత కూడా స్టార్టప్ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. పోస్ట్ రిటైర్మెంట్ స్టార్టప్స్ నిర్వహించే బృందంలో చేరారు. జుట్టు ఎక్కువగా రాలుతోందని తన కూతురు బాధపడుతుండటం చూసి హెయిర్ కేర్ బ్రాండ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అసలు జుట్టు రాలడానికి గల కారణాలేంటో పరిశోధించారు. 50 కి పైగా మూలికలతో తన స్వంత హెయిర్ ఆయిల్‌ను తయారు చేశారు.
"ప్రస్తుతం వ్యాపార భాగస్వామిగా ఉన్న నా కూతురు జుట్టు రాలిపోవడంతో తీవ్రంగా బాధపడుతోంది. దీనికి చికిత్స కనుగొనమని నన్ను కోరింది. దాదాపు ఒక సంవత్సరం పాటు అధ్యయనం చేసిన తర్వాత, నేను, నా కూతురు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, శిరోజాల ఆరోగ్యం కోసం కావాల్సిన నూనెల మిశ్రమాన్ని తయారు చేసాను."
— అవిమీ హెర్బల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాధా క్రిషణ్ చౌదరీ
మరో వీడియోలో తాను రాత్రికి రాత్రే ఎలా సక్సెస్ అయ్యాను అనే అంశాన్ని వివరించారు. 85 ఏళ్ల వయస్సులో తన డ్రీమ్ కార్ ఎలా కొన్నానో చెప్పారు. తాము అవిమీ హెర్బల్ని స్థాపించి, ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాల్లోకి ప్రవేశించామని అన్నారు. విజన్ అండ్ మిషన్ ద్వారా ఇలా ఓవర్‌నైట్ సక్సెస్ అందుకోగలిగామని తెలిపారు. ఆయుర్వేదాన్ని ఉపయోగించడం ద్వారా ప్రజలు తమ జుట్టును తిరిగి పెంచుకోవడంలో సహాయపడటానికి తాము కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు ఇదంతా ఓ స్కామ్ అని మొదట్లో అన్నా, తాము తమపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్లామని చెప్పారు.
0 Comments:
Post a Comment