జపాన్‌లో సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రధాన మంత్రిగా షింజో అబేకు మంచి పేరుంది.
విదేశాంగ విధానంపైనా ఆయన తనదైన ముద్రవేశారు. ఆర్థిక వ్యూహాల్లోనూ ఆయనకు మంచి నైపుణ్యముంది. ఆయన వ్యూహాలను ''అబెనామిక్స్''గా పిలుస్తుంటారు.
67ఏళ్ల అబేను ''కనర్జేటివ్ నేషనలిస్టు''గా రాజకీయ విశ్లేషకులు చెబుతారు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ)కి రెండుసార్లు ఆయన విజయం తెచ్చిపెట్టారు.
2006లో ప్రధాన మంత్రిగా మొదటిసారి బాధ్యతలు తీసుకున్నప్పుడు ఏడాదికే ఆయన దిగిపోవాల్సి వచ్చింది. అప్పట్లో దీనిచుట్టూ వివాదం కూడా రాజుకుంది.
కానీ, 2012లో ఊహించని స్థాయిలో మళ్లీ ఆయన కెరియర్ పుంజుకొంది. 2020 వరకూ ఆయన ప్రధాని పదవిలోనే కొనసాగారు. ఆ తర్వాత ఆరోగ్య కారణాలతో రాజీనామా చేశారు.
రెండోసారి ఆయన ప్రధాన మంత్రి పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు జపాన్ ఆర్థిక సంక్షోభంలో ఉండేది. అయితే, సంస్థాగత మార్పులు, ఆర్థిక ప్యాకేజీలతో ఆయన పరిస్థితులను గాడినపెట్టారు.
ఆయన హయాంలోనే ''టొహోకు''ను భారీ భూకంపం, సునామీను కుదిపేసింది. వీటిలో దాదాపు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫుకుషిమా అణు రియాక్టర్ ప్రమాదం చోటుచేసుకుంది కూడా అప్పుడే. దీంతో పరిస్థితులు మళ్లీ సాధారణానికి వచ్చేందుకు అబే సత్వర చర్యలు తీసుకున్నారు.
వారాల పాటు వరుస ఊహాగానాల నడుమ 2020లో అబే రాజీనామా చేశారు. పెద్ద పేగు ఇన్ఫెక్షన్ ''అల్సరేటివ్ కోలైటిస్''తో ఆయన బాధపడుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్లే 2007లోనూ ఆయన రాజీనామా చేశారు.
అబే తర్వాత, ఆయన సన్నిహితుడైన యోషిహిడే సుగా ప్రధాన మంత్రి బాధ్యతలు తీసుకున్నాయి. అయినప్పటికీ, జపాన్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా అబేను రాజకీయ నిపుణులు అభివర్ణించేవారు.
అధికారం వరకు..
జపాన్ మాజీ విదేశాంగ మంత్రి షింతారో అబేకు షింజో అబే కుమారుడు. మరోవైపు మాజీ ప్రధాన మంత్రి నొబుసుకే కిషి ఆయనకు తాతయ్య అవుతారు.
1993లో ఆయన తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2005లో ఆయన క్యాబినెట్ మంత్రి అయ్యారు. అప్పట్లో జునిచిరో కుయిజుమి ప్రధాన మంత్రిగా ఉండేవారు. ఆయనే అబేకు చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ పదవిని అప్పగించారు.
ఆ తర్వాత చాలా వేగంగా అబే ప్రధాన మంత్రి పదవికి చేరువయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రధాని పదవిని చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా అబే 2006లో చరిత్ర సృష్టించారు.
అయితే, పింఛను రికార్డుల మాయం లాంటి కుంభకోణాలు అప్పట్లో అబే ప్రభుత్వాన్ని వెంటాడాయి. ఐదు కోట్ల క్లెయిములపై అప్పట్లో ప్రభావం పడింది.
EPA
జులై 2007లో ఎగువ సభకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ తర్వాత అల్సరేటివ్ కోలైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల అబే రాజీనామా చేశారు.
మళ్లీ 2012లో ప్రధాన మంత్రి బాధ్యతలను అబే తీసుకున్నారు. మందుల సాయంతో ఆ ఇన్ఫెక్షన్ తగ్గిందని అప్పట్లో ఆయన చెప్పారు.
2014, 2017లో జరిగిన ఎన్నికల్లో వరుసగా ఆయన విజయం సాధించారు. దీంతో జపాన్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన మంత్రిగా మరో రికార్డును ఆయన తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రజల్లో ఆయనకున్న ఆదరణ కొన్నిసార్లు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నప్పటికీ, ఎల్డీపీలో ఆయన ప్రాబల్యం కొనసాగేది. మూడోసారి కూడా పార్టీ నాయకుడిగా కొనసాగేందుకు ఆయన పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరించారు.
Reuters
జాతీయవాది
రక్షణ, విదేశాంగ విధానాల్లో అబే నిశితంగా ఉండేవారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం రూపొందించిన జపాన్ రాజ్యాంగ సవరణ గురించి మొదట్నుంచీ ఆయన మాట్లాడేవారు.
ఈ రాజ్యాంగాన్ని అమెరికా పర్యవేక్షణలో రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమికి ఇది గుర్తుగా కన్జర్వేటివ్‌లు భావిస్తుంటారు.
అబే జాతీయవాద భావనల వల్ల చైనా, దక్షిణ కొరియాలతో ఒక్కోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునేవి.
2013లో టోక్యోలోని యసుకుని ష్రైన్ని అబే సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నుంచీ జపాన్ ఆయుధ కార్యకలాపాల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యముంది.
పదేపదే ఈ ప్రాంతాన్ని సందర్శించడం వల్ల జపాన్‌లోని వామపక్ష భావజాలమున్న పార్టీలు అబేను తప్పుపట్టేవి. యుద్ధ సమయంలో పాల్పడిన అరాచకాల విషయంలో అబే కంటితుడుపుగా వ్యవహరిస్తున్నారని విమర్శించేవి.
2015లో ఆత్మరక్షణ పేరుతో బలగాలను సమీకరించాలని అబే పిలుపునిచ్చారు. తమతోపాటు తమ మిత్రపక్షాలకు అపత్కారంలో ఈ బలగాలు అవసరం అవుతాయని ఆయన అన్నారు.
కొందరు జపాన్ ప్రజలతోపాటు పొరుగునున్న దేశాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ అబే సూచించిన మార్పులకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.
జపాన్ సైన్యానికి ప్రాధాన్యమిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలనే అబే వ్యూహాలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చేది.
అయితే, హొక్కియాడో తీరంలో నార్తర్న్ టెర్రిటరీస్‌గా పిలిచే వివాదాస్పద దీవులను రష్యా నుంచి వెనక్కి తీసుకోవడంలో అబే విఫలం అయ్యారు.
డోనల్డ్ ట్రంప్‌తో అబేకు మంచి సంబంధాలు ఉండేవి. అమెరికా వ్యాణిజ్య సుంకాలు విధించకుండా జపాన్ను ఈ బంధాలు కాపాడాయని నిపుణులు విశ్లేషిస్తుంటారు. మరోవైపు జపాన్‌లో మరిన్ని అమెరికా బలగాల సమీకరణకు అవసరమైన నిధులను కూడా అబే సమీకరించగలిగారు.
కోవిడ్-19 వ్యాప్తి సమయంలో..
అబే మార్కు ఆర్థిక వ్యూహాలను ''అబేనామిక్స్''గా పిలుస్తుంటారు. మొదటిసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు జపాన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో ఇవి సాయం చేశాయి.
వడ్డీ రేట్లను తగ్గించడంతో కంపెనీలకు రుణాలను అందుబాటులో ఉంచడం, మౌలిక సదుపాయాల నిర్మాణంలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, పన్ను మినహాయింపులు ఇవ్వడం, ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం, వలసలకు మద్దతు పలకడం లాంటి వ్యూహాలకు అబే ప్రాధాన్యం ఇచ్చేవారు.
అయితే, 2020లో మళ్లీ జపాన్‌లో ఆర్థిక మందగమనం కొనసాగింది. దీంతో ఆయన వ్యూహాల సామర్థ్యంపై ప్రశ్నలు వచ్చాయి.
మరోవైపు కోవిడ్-19 వ్యాప్తి నడుమ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. పర్యటక రంగానికి ఊతం ఇచ్చేందుకు ఆయన తీసుకున్న చర్యలు కరోనావైరస్ కేసులు పెరగడానికి కారణం అయ్యాయని విమర్శలు వచ్చాయి.
ఉద్యోగాలు చేసే మహిళలకు సాధికరత కల్పించడం, వంశపారంపర్య రాజకీయాలకు ముగింపు పలకడం, ఆరోగ్యకరమైన సంస్కృతిని ప్రోత్సహించడం లాంటి అబే వాగ్దానాలు పూర్తికాలేదని విమర్శకులు చెబుతారు.
అంతర్జాతీయంగా ''ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్'' ఒప్పందం ఘనత కూడా అబే ఖాతాలోకి వస్తుంది. 11 దేశాలతో భారీ వాణిజ్య ఒప్పందానికి అబే పునాది వేశారు.
రాజీనామా...
రాజీనామా చేస్తున్నట్లు అబే ప్రకటించడంతో.. తర్వాత నాయకుడు ఎవరనే దానిపై ఎల్డీపీలో వర్గ పోరు మొదలైంది.
ఎట్టకేలకు సుదీర్ఘ కాలం క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన యోషిహిడే సుగకు ఆ అవకాశం దక్కింది.
అయితే, రాజీనామా తర్వాత కూడా జపాన్ రాజకీయాల్లో అబే ప్రధాన పాత్ర పోషించారు. సుగ స్థానంలో ఫుమియో కిషిదను నియమించడంలోనూ అబేకు పాత్ర ఉంది.
జులై 8న జపాన్ ఎగువ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ నగరం నారాలో అబే ప్రసంగించేందుకు వెళ్లారు.
అబే మాట్లాడుతుండగా ఒక సాయుధుడు ఆయనపై కాల్పులు జరిపారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అబేను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
మోదీతో ప్రత్యేక అనుబంధం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనూ షింజో అబేకు మంచి అనుబంధముంది. ఇదివరకటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తోనూ అబేకు మంచి సంబంధమే ఉంది. కానీ, మోదీ-అబే దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
2018లో మోదీ జపాన్ వెళ్లినప్పుడు.. తమ పూర్వికుల ఇంటిలో ఆయనకు అబే ప్రత్యేక విందు ఇచ్చారు. జపాన్‌లో ఈ విదేశీ నాయకుడికీ ఇలాంటి ఘనత దక్కలేదు.
2015లో షింజో అబే భారత్ వచ్చినప్పుడు ఆయన్ను మోదీ వారణాసికి తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి గంగా హారతికి వెళ్లారు.
జపాన్‌లో క్యోటోలానే వారణాసిని అభివృద్ధి చేయాలని అప్పట్లో మోదీ చెప్పారు. 2014లో మోదీ జపాన్‌లో పర్యటించినప్పుడు ఆ దిశగా ఒక ఒప్పందం కూడా కుదిరింది. వారణాసిలాగానే క్యోటోలోనూ ఎటుచూసినా దేవాలయాలే కనిపిస్తాయి.
2017లో అబే భారత్ వచ్చినప్పుడు మోదీ ఆయన్ను అహ్మదాబాద్‌కు తీసుకెళ్లారు. అప్పుడే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
0 Comments:
Post a Comment