తమ పొరుగునే నివసించే ఓ మహిళా టీచర్‌కు నిస్వార్థంగా సేవలు చేయడమే ఆ ఇద్దరి సోదరీమణులకు వరంగా మారింది. వారి నిస్వార్ధమైన సేవలను మెచ్చి ఆ గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్ తాను జీవితాంతం దాచుకున్న రూ.19 లక్షలు గిఫ్ట్‌గా అందించారు.
వృద్ధురాలైన ఈ టీచర్ తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుకు నామినీలుగా ఇద్దరు పొరిగింటివారిని పేర్కొన్నారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ సిటీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కోకిలాబెన్ భట్ అనే ఉపాధ్యాయురాలు కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత కృష్ణానగర్‌లోని అభినవ్ అపార్ట్మెంట్లో నివసించేవారు.
ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. ఆమెను ఆప్యాయంగా పలకరించడానికి, ఆరోగ్య సమస్యలు వస్తే సేవలు చేయడానికి నా అనే వారు ఎవరూ లేరు. అయితే, అదే అపార్ట్మెంట్లో కోకిలాబెన్ పక్కనే సోహిని పటేల్, హేమాంగిని షా అనే అక్కాచెల్లెలు నివసిస్తున్నారు. వారు మాత్రం నిరాదరణకు గురైన కోకిలాబెన్‌ను సొంత తల్లి లాగా భావించి ఏమీ ఆశించకుండా నిస్వార్ధంగా అన్ని సేవలు చేశారు.
ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెతో చాలా సన్నిహితంగానే మెలిగారు. ఈ సోదరీమణులతోపాటు వారి కుటుంబాలు కూడా వృద్ధురాలైన కోకిలాబెన్‌కు అన్ని విషయాల్లో అండగా నిలిచారు. కోకిలాబెన్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు హేమాంగిని, ఆమె భర్త కలిసి సేవలు చేశారు. ఆమె చనిపోవడానికి మూడు, నాలుగు ఏళ్లకు ముందు ఆరోగ్యం బాగా క్షీణించింది.
ఆ సమయంలో కూడా ఆమె తరుఫు వారు చుట్టపుచూపుగా వచ్చిన పాపాన పోలేదు. కానీ హేమాంగిని ఆమెకు దగ్గరే ఉండి మరీ బాగోగులు చూసుకుంది. ఆమె భర్త కూడా టీచర్‌కు బాగా సహాయం చేశారు. ఆ సమయంలోనే కోకిలాబెన్ 2018లో సాయిజ్పూర్ బోఘా పోస్టాఫీస్‌లోని తన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.19 లక్షలకు సోహిని పటేల్, హేమాంగిని షా భర్త శైలేష్ షాలను నామినీలుగా పేర్కొన్నారు.
రెండేళ్ల తర్వాత అంటే మే 23, 2020న కోకిలాబెన్ 83 ఏళ్ల వయస్సులో కరోనా సమయంలో మరణించారు. ఆ తరువాత ఇద్దరు సోదరీమణులు జులై 6, 2020న ఆమె పొదుపు ఖాతాలోని డబ్బును క్లెయిమ్ చేశారు. అయితే, కోకిలాబెన్ మేనల్లుడు కూడా ఆ మొత్తంపై క్లెయిమ్ చేయడంతో పోస్టాఫీసు వారెవరికీ డబ్బు అందజేయలేదు. మృతురాలి మేనల్లుడు అక్కాచెల్లెళ్ల క్లెయిమ్‌ను సవాలు చేశాడు.
దాంతో ఆ డబ్బు కోసం సోదరీమణులు కోర్టులో మెట్లు ఎక్కాల్సి వచ్చింది. సోహిని, హేమాంగిని భర్త శైలేష్‌లు మొదట డిపార్ట్మెంట్తో ఈ విషయాన్ని పరిష్కరించాలి అనుకున్నారు. కానీ తరువాత లాయర్ నిషిత్ గాంధీ, కెవిన్ విర్వాదియా ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనితో హైకోర్టు తీర్పునిస్తూ.. అక్క సోహిని, చెల్లెలి భర్త శైలేష్ కోకిలాబెన్ అకౌంట్‌కు నామినీలుగా ఉన్నారు కాబట్టి ఆ మొత్తాన్ని వారికే చెల్లించాలని పోస్టాఫీస్ డిపార్ట్మెంట్కు ఆదేశించింది.
''హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పోస్టల్ శాఖ నుంచి నాకు రూ.19 లక్షల చెక్కు వచ్చింది. సేవింగ్స్ అకౌంట్లో నామినీలుగా ఉన్నా డబ్బు కోసం డిపార్ట్‌మెంట్‌పై రెండేళ్లపాటు పోరాడాల్సి వచ్చింది' అని బీఎస్ఎన్ఎల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన 63 ఏళ్ల సోహిని పటేల్ అన్నారు.
0 Comments:
Post a Comment