బ్రిటన్ (Britain) ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ (Boris Johnson) గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మంత్రులు, ఎంపీలు తిరుగుబాటు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రాజీనామాను ప్రకటించారు. ఐతే తదుపరి ప్రధానిని కన్జర్వేటివ్ పార్టీ ఎన్నుకునేంత వరకు ఆపద్ధర్మ ప్రధానిగా బోరిస్ జాన్సన్ కొనసాగుతారు.
ఐతే బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బ్రిటన్ ప్రధాని రేసులో ఆర్థికశాఖ మాజీ మంత్రి రిషి సునాక్, అటార్నీ జనరల్ సువేలా బ్రేవర్మాన్, రక్షణ మంత్రి బెన్ వాలెస్, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, మాజీ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్, ఆర్థికమంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నదీమ్ జహావీ, విదేశాంగ మాజీ మంత్రి జెరెమీ హంట్ ఉన్నారు.
Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా.. బాధగా ఉందని ఎమోషనల్
వీరిలో రిషి సునాక్, సువేలా బ్రేవర్‌మ్యాన్ భారత సంతతి వ్యక్తులు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. బ్రిటన్ పాలనా పగ్గాలు భారత సంతతి వ్యక్తుల చేతుల్లోకే వెళ్లే అవకాశలున్నాయి.
రిషి సునాక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనే ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశముందని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 42 ఏళ్ల రిషి సునాక్ (Rishi Sunak) ప్రధానమంత్రి పదవి కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం అందుతోంది.
ఈ క్రమంలోనే ఆయన భార్య అక్షతా మూర్తి కూడా యాక్టివ్‌గా మారారు. అక్షత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Infosys Narayana Murthy)కుమార్తె. అంటే నారాయణమూర్తికి ఆయన అల్లుడవుతారు.
ఇదీ రిషి సునాక్ నేపథ్యం
రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. ఆయన పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. రిషి పూర్వీకులు తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. అనంతరం పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
సునాక్ తండ్రి యశ్వీర్ కెన్యాలో జన్మించగా.. తల్లి ఉష టాంజానియాలో పుట్టారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలసవెళ్లాక.. అక్కడే యశ్ వీర్, ఉష పెళ్లి చేసుకున్నారు.
రిషి సునాక్ స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేశారు. చదువు పూర్తయ్యక మొదట్లో కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు.
కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతతో ఆయనకు పరిచయం ఏర్పడింది.
అనంతరం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2009లో వీరు వివాహం చేసుకున్నారు. రిషి సునాక్, అక్షత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తాను చదువుకునే రోజుల్లో కొంతకాలం పాటు కన్జర్వేటివ్ పార్టీలో ఇంటర్న్ షిప్ చేశారు రిషి సునాక్. 2014లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన.. కొద్దికాలంలోనే సత్తా చాటారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్మాండ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా రెండోసారి గెలుపొందారు. 2019లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్‌కు రిషి సునాక్ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఎన్నికయ్యాక.. రిషికి ప్రాధాన్యత ఇచ్చారు.
ఆర్థిక శాఖలో చీఫ్ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించారు. 2020 ఫిబ్రవరిలో ఛాన్సలర్‌గా ఆయన పదోన్నతి పొందారు. అదే ఏడాది మార్చిలో రిషి సునాక్ పార్లమెంట్లో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇప్పటికీ హిందూ మతాన్ని అనుసరిస్తున్న రిషి సునాక్.. పార్లమెంట్లో ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు, ఉద్యోగులకు అండగా ఉండేందుకు అనేక పథకాలను ప్రకటించి వార్తల్లో నిలిచారు రిషి సునాక్.
ఒకవేళ ఆయన ప్రధాని పగ్గాలు చేపడితే.. బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించే అవకాశముంది.
0 Comments:
Post a Comment