సరైన నగదు నిర్వహణ ఉంటే ఎటువంటి అవసరానికైనా చేతిలో డబ్బు ఉంటుంది. ముఖ్యంగా చేసే ఖర్చులలో నియంత్రణ ఉంటే..పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు. అలాగే, అత్యవసర సమయంలో అప్పు చేయాల్సిన అవసరం రాదు.
ఆదాయాన్ని బట్టి ఖర్చులు ఉంటే చాలా వరకు సమస్యలను నివారించవచ్చు. కాబట్టి, డబ్బు ఖర్చు చేసే ప్రతీ చోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఖర్చులను నియంత్రించగలం.
1. ముందుగా మీ ఖర్చులను ట్రాక్ చేయండి..
ఖర్చులను తెలివిగా నిర్వహించాలంటే..ముందుగా..మీ ఆర్థిక స్థితి తెలుసుకోవాలి. మీరు నెల నెలా ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలుస్తే..ఎలా తగ్గించుకోవాలో ప్లాన్ చేసుకోవచ్చు.
ఉదాహరణకి, ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే దాదాపు అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీంతో కాల్స్‌తో పాటు డేటా కోసం వందలు వెచ్చించి డేటా ప్యాక్ కొనుగోలు చేస్తుంటాం. ఇంట్లో వైఫై ఏర్పాటు చేస్తుంటాం.
ఇక టీవీ, ఓటీటీ, ఆన్లైన్ షాపింగ్, జిమ్ వంటి చాలా వాటిలో సభ్యత్వం తీసుకుంటుంటాం. వీటన్నింటిని విడిగా చూస్తే నెలకు రూ. 300 నుంచి రూ. 500 లోపే ఖర్చువుతుంది. ఇది చాలా తక్కువనే అనిపిస్తుంది.
అయితే, ఇవన్నీ కలిపి చూస్తే నెలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా మనలో చాలా మంది వీటిలో సభ్యత్వం అయితే తీసుకుంటారు గానీ పూర్తిగా వినియోగించుకోరు.
అందువల్ల వీటికి అయ్యే ఖర్చులను బేరీజు వేసుకుని ఎక్కువగా వినియోగించని సభ్యత్వాలను రద్దు చేసుకోవడం వల్ల ప్రతీ నెల వందల్లో ఖర్చు తగ్గించుకోవచ్చు.
అలాగే షాపింగ్ చేసేటప్పుడు వస్తువులను కొనుగోలు చేసేందుకు చాలా ఖర్చు చేస్తుంటాం. ఉదాహరణకి, బ్యూటి ప్రాడెక్ట్స్ ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం ప్రముఖ బ్రాండ్లు అందించే ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటాం.
వ్యాపారం పెంచుకొనేందుకు సంస్థలు అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితం, భారీ తగ్గింపు వంటి ఆఫర్లతో ముందుకు వస్తుంటాయి. అలాంటప్పుడు మన వద్ద ప్రాడక్ట్ ఉన్నప్పటికీ..తక్కువకు వస్తుందనే ఉద్దేశ్యంతో మళ్లీ కొనేస్తుంటాం.
కానీ ఇలాంటి ఉత్పత్తులకు ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుంది. మీ వద్ద ఉన్న వస్తువు పూర్తిగా ఉపయోగించి కొత్త వస్తువును వాడే సమయానికి దాని ఎక్స్‌పయిరీ డేట్ ముగిసిపోవచ్చు. దీంతో ఆ ప్రాడక్ట్ పనికి రాకుండా పోతుంది. దానిపై వెచ్చించిన డబ్బు మొత్తం వృధా అవుతుంది.
ఇలాంటివి ఖర్చు చేసేటప్పుడు తెలియవు. కాబట్టి ముందు నెలల్లో చేసిన ఖర్చులను ఒక దగ్గర రాసుకుంటే..ఎక్కడ ఎంత ఖర్చవుతుందో మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఎక్కడ వృధా అవుతుందో ఒక అంచనాకు రావచ్చు. దీంతో అవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు.
2. ఇతరుల మెప్పు పొందేందుకు కొనుగోళ్లు వద్దు..కొంత మంది ఇతరుల మెప్పు పొందేందుకు వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఉదాహరణకి, మీరు కారు కొనుగోలు చేయాలనుకున్నారనుకుందాం.
కారు అనేది తరుగుదల ఆస్తి. అందువల్ల మీ బడ్జెట్‌కు అనుగుణంగా, సౌకర్యంగా ఉండే కారును మాత్రమే కొనుగోలు చేయాలి. ఇతరులలో పేరు కోసం మీ బడ్జెట్‌కి మించి లగ్జరీ కారును కొనుగోలు చేస్తే..చేసిన అప్పును తీర్చేందుకు తిప్పలు పడక తప్పదు.
3. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి..
ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయండి. ఉదాహరణకి, ఒక స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తున్నాం అంటే..దానికి కనీసం రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకు ఖర్చు చేస్తుంటాం. అప్పుడు కనీసం 3 నుంచి 4 ఏళ్లు దాన్ని ఉపయోగించుకునేలా ఉండాలి. అంతేకాని ప్రతీ సంవత్సరం ఫోన్ మార్చేస్తుంటే..చాలా డబ్బు ఖర్చవుతుంది. టీవీలు, రెఫ్రిజిరేటర్లు, ఏసీలు, స్మార్ట్ఫోన్లు వంటి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వాటితో వచ్చే వ్యారెంటీ, గ్యారెంటీలను తెలుసుకోండి. కంపెనీ వారెంటీతో కూడిన వస్తువులను కొనుగోలు చేసేవారు వారెంటీ కార్డులను జాగ్రత్తగా భద్రపరచండి. వ్యారెంటీ కాలవ్యవధిలో ఏదైనా రిపేరు వచ్చినప్పుడు సంస్థ వారు ఉచితంగా సర్వీసు అందిస్తారు. వ్యారెంటీ కార్డులను జాగ్రత్తగా భద్రపరచక పోతే స్వంత ఖర్చులతో రిపేరు చేయించాల్సి వస్తుంది.
4. క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తుంటే..
చేతిలో డబ్బు లేకపోయినా, క్రెడిట్ కార్డు ఉంటే చాలు సులభంగా కొనుగోళ్లు చేయవచ్చు. కొన్ని సంస్థలు క్రెడిట్ కార్డును ఉపయోగించి చేసే కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్‌లు, రాయితీలను కూడా అందిస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డును వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకవేళ మీరు కూడా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తుంటే ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నెలాఖరుకు పూర్తి బిల్లు చెల్లించగలిగేలా మాత్రమే క్రెడిట్ కార్డు కొనుగోళ్లు ఉండాలి. ప్రతీనెల గడవు తేదిలోగా పూర్తి బిల్లు చెల్లిస్తే వడ్డీ, పెనాల్టీలు ఉండవు. ఒకవేళ గడువు తేది లోపు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే వర్తించే అధిక వడ్డీతో మీ ఆర్ధిక స్థితి అదపు తప్పే ప్రమాదం ఉంది.
5. తప్పనిసరి ఖర్చులు..
నిత్యావసర ఖర్చులు తప్పనిసరి. అంటే అద్దె, ఈఎమ్ఐ, రవాణా, స్కూల్ ఫీజులు, విద్యుత్ బిల్లు, మొబైల్ బిల్లు, ఆహార ఖర్చులు వంటివి ప్రతినెలా ఉంటాయి. తప్పించుకునేందుకు వీలుండదు. అయితే, కావాలనుకుంటే ఇందులో కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. చిన్న అపార్ట్మెంట్కి, తక్కువ అద్దె ఉన్న ఇంటికి మారడం, అవసరం లేకపోతే ఫ్యాన్, లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం, బయట చిరుతిళ్లు తగ్గించడం వంటి మార్గాల ద్వారా కొంత ఖర్చును తగ్గించుకోవచ్చు.
6. తప్పనిసరి కానీ ఖర్చులు..
కొంతమంది అవసరం లేకపోయినా..సరదా షాపింగ్ పేరుతో ఎడాపెడా కొనేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఆన్లైన్లో బ్రాండెడ్ బట్టల పేరుతో ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయడం, వన్ ప్లస్ వన్ ఆఫర్ల పేరుతో ఉచితంగా ఇచ్చే దానికోసం అవసరం లేకపోయినా కొనుగోలు చేయడం లాంటి ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవచ్చు.
7. వీలైనంత త్వరగా పెట్టుబడులు ప్రారంభించండి..
తర్వగా పెట్టుబడులు ప్రారంభించడం వల్ల..పెట్టుబడులకు కొంత డబ్బు కేటాయించాలి కాబట్టి అనవసరపు ఖర్చులకు పోకుండా మిమ్మల్ని మీరే నియంత్రించుకోగులుగుతారు. అంతేకాకుండా మీ ఆర్థిక లక్ష్యాలను కూడా త్వరగా చేరుకోగలుగుతారు.
చివరిగా..
ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులను తగ్గించుకుంటే..తప్పకుండా పొదుపు, పెట్టుబడులు చేయగలం. పొదుపు చేసేంత డబ్బు లేదని మీకు అనిపించినప్పుడు వేతనం రాగానే..పెట్టుబడుల కోసం కొంత డబ్బును ప్రక్కన పెట్టి ఆ తర్వాత ఖర్చు చేయండి.
0 Comments:
Post a Comment