తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక, దేశవ్యాప్తంగా వాన జోరు సాగుతోంది. ఈ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పాటి వర్షాలకే అయ్యో రామ అనుకుంటే.. కొన్ని ప్రాంతాల్లో మరి సంవత్సరమంతా వానలు పడుతూనే ఉంటాయ్. కానీ అక్కడ వరదలు కనిపించవు. ఇళ్లు మునిగిపోవు. రోడ్లు చెరువుల్ని తలపించవు. కానీ... వర్షం మాత్రం కురుస్తూనే ఉంటుంది. భలే కదా. ఆ ప్రాంతాలేంటో ఏవో ఓ లుక్కేద్దాం.
మాసిన్రాం (Mawsynram) ప్రాంతం... మేఘాలయలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షం కురిసే ప్రాంతం ఇదే. ఎప్పుడు చూసినా చల్లగా, చినుకులతో స్వాగతం పలుకుతుంది. సంవత్సరానికి అక్కడ సగటున 11,872 మిల్లీమీటర్ల వాన పడుతోంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం... 1985లో మాసిన్రామ్లో 26,000 మిల్లీ మీటర్ల వాన పడింది. అంటే 1,000 అంగుళాలు.
చిరపుంజి (Cherrapunji) కూడా అలాంటిదే. ఇది మాసిన్రామ్కి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ కూడా ఏడాదికి సగటున 11వేల మిల్లీమీటర్లకు పైగా వాన కురుస్తోంది. ఒకప్పుడు ఇదే అత్యంత ఎక్కువ వాన పడే ప్రాంతంగా ఉండేది. ఆ రికార్డును మాసిన్రామ్ కొట్టేసింది. అయితేనేం చిరపుంజి ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఇక్కడ ఎండాకాలం కూడా ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల దగ్గరే ఉంటాయి.
తుతునెండో (Tutunendo) అనేది దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలో ఉంది. మామూలుగా అయితే కొలంబియాలో ఎండలు ఎక్కువే. కానీ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి తుతునెండో. అక్కడ రెయిన్ ఫారెస్టులు ఉన్నాయి. జనాభా వెయ్యి మంది కంటే తక్కువే. ఇక్కడ ఏడాదికి సగటున 11,800 మిల్లీ మీటర్ల వాన పడుతోంది. అందువల్ల భూమిపై తమతే అత్యధిక వర్షం పడే ప్రాంతం అని అక్కడి వారు అంటుంటారు.
క్రాప్ నది (Crop River) న్యూజిలాండ్‌లో ఉంది. ఇది 9 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇక్కడ ఏడాదికి 11,517 మిల్లీమీటర్ల వర్షం పడుతోంది. సాధారణంగా న్యూజిలాండ్‌లో పెద్దగా వర్షాలు పడవు. కానీ క్రాప్ నది దగ్గర మాత్రం వద్దంటే వాన పడుతూనే ఉంటుంది. చిత్రమే కదా.
శాన్ ఆంటోనియో ( San Antonio) ఆఫ్రికాలో ఉంది. దీన్నే యురేకా గ్రామం అంటారు. ఇది కూడా అత్యధిక వర్షం పడే ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ సంవత్సరానికి సగటున 10,450 మిల్లీమీటర్ల వర్షం పడుతోంది.
0 Comments:
Post a Comment