వడ్డీ హామీతో...పాలసీ
ఫిక్స్డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా కాస్త అధిక రాబడితో ఎండోమెంట్ తరహా పాలసీని ఎంచుకోవాలని అనుకునే వారికోసం ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈ 'ఏబీఎస్ఎల్ఐ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్'లో జీవిత బీమాతోపాటు 6.41 శాతం రాబడినిస్తోంది. పాలసీ వ్యవధి తీరిన తర్వాత హామీతో కూడిన మొత్తాన్ని అందిస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లకన్నా ఈ మొత్తం అధికమని బీమా సంస్థ పేర్కొంటోంది. ప్రీమియం ఒకేసారి చెల్లించి, పాలసీని కనీసం అయిదేళ్ల నుంచి 10 ఏళ్లపాటు కొనసాగించాలి. గడువుకు ముందే పాలసీని స్వాధీనం చేసినా, ఎలాంటి రుసుములు ఉండవు. చెల్లించిన ప్రీమియానికి 1.25 నుంచి 1.77 రెట్లు (ఆప్షన్ ఏ) లేదా 10 రెట్ల నుంచి 10.42 రెట్ల (ఆప్షన్ బి) వరకూ జీవిత బీమాను ఎంచుకోవచ్చు. జీవిత బీమా మొత్తాన్ని ఎంచుకున్నదాన్ని బట్టి, పాలసీ ఇచ్చే రాబడి మారుతుంది. ఆప్షన్ బీతో పోలిస్తే.. ఆప్షన్ ఏ ఎంచుకున్న వారికి ప్రతిఫలం అధికంగా ఉంటుంది. పాలసీపై కనీసం రూ.5వేల నుంచి విలువపై 80 శాతం వరకూ రుణం తీసుకునే వీలూ ఉంది. చెల్లించిన ప్రీమియానికి సెక్షన్ 80సీ నిబంధనల మేరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కనీసం రూ.12వేల నుంచి ఈ పాలసీకి ప్రీమియం చెల్లించవచ్చు.
30 షేర్లలో మదుపు..
స్థిరమైన వృద్ధితో దీర్ఘకాలంలో సంపద సృష్టించాలనుకునే మదుపరులను లక్ష్యంగా చేసుకొని, ఎడిల్వైజ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం ఎన్ఎఫ్ఓ (న్యూ ఫండ్ ఆఫర్) ముగింపు తేదీ ఈ నెల 25. కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకం పనితీరును లెక్కించేందుకు 'నిఫ్టీ 500 టీఆర్ఐ'ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఎడిల్వైజ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ కింద 30 షేర్లతో పోర్ట్‌ఫోలియో నిర్మిస్తారు. ఫలానా రంగానికి లేదా ఫలానా తరగతికి చెందిన కంపెనీ అని పరిమితి పెట్టుకోకుండా.. అన్ని రంగాలూ, తరగతులకూ సంబంధించిన షేర్లను ఈ ఫండ్ ఎంచుకుంటుంది.
ఫోకస్డ్ ఈక్విటీ పెట్టుబడుల విధానానికి సంబంధించి యూఎస్ స్టాక్ మార్కెట్లలో హెన్డ్రిక్ బెస్సెంబిందెర్ నిర్వహించిన అధ్యయనాన్ని ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. దీని ప్రకారం 1926 నుంచి అమెరికా స్టాక్ మార్కెట్లలో నమోదైన షేర్లలో కేవలం 4 శాతం షేర్లు నూరు శాతం లాభాలు పండించాయి. అందువల్ల ఫోకస్డ్ పెట్టుబడులు అధిక లాభాలు ఇస్తాయనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణలో ఉన్న ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్లను పరిశీలిస్తే ఏడాది కాలంలో సగటున 15 శాతానికి పైగా ఫ్రతిఫలం కనిపిస్తోంది.
0 Comments:
Post a Comment