ఒక మాదిరి పట్టణం నుండి పెద్ద నగరాల వరకు చాలా ఇళ్లల్లో యాజమానులు ఉండటమే కాకుండా అద్దెలకు ఇచ్చే విధంగా మరిన్ని పోర్షన్లు నిర్మిస్తారు.
దీనివలన ఉన్న స్థలం మీదే అదనపు నిర్మాణాలు ఉండటమే కాకుండా అద్దెల రూపంలో ఆదాయం వస్తుంది. ముఖ్యంగా, ఈ ఆదాయం కొంత మందికి జీవన వ్యయానికి ప్రధాన ఆదాయంగా ఉంటుంది.
పదవీ విరమణ చేసిన వారికి అదనపు ఆదాయ వనరుగా ఉంటుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ప్రతి ఒక్కరూ ఏదో చోట ఒకసారి అద్దె ఇంట్లో ఉన్నవారే. అద్దె ఇళ్ల సంస్కృతి ఎప్పటి నుండో ఉంది.
అద్దెకు ఉండటం సులభమే కానీ, ఇంటిని అద్దెకు ఇవ్వడం ఇంటి యాజమానికి అంత సులభం కాదు. అద్దెకుండేవారితో భవిష్యత్తులో వాదోపవాదాలు, న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కోకుండా ఉండటానికి ముందే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
అద్దెకు, లీజుకు, లైసెన్స్ ప్రాతిపదికన నివాస ప్రాపర్టీని ఇచ్చే సమయంలో ఇంటి యజమాని స్వంత హక్కులను కాపాడుకోవడం కోసం ఇంటి యజమానులు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్య జాగ్రత్తలు ఈ క్రింది ఉన్నాయి.
1) అద్దెదారు వివరాలు, సకాలంలో అద్దె చెల్లించడానికి వారికుండే సామర్ధ్యం గురించి తప్పక తెలుసుకోవాలి. అద్దెదారు అద్దె చెల్లించకుండా ఆస్తిని ఖాళీ చేయని అనేక సందర్భాలున్నాయి. లీగల్గా వెళితే న్యాయ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది.
ఇటువంటి పరిస్థితుల్లో అద్దెదారు ప్రయోజనం పొందుతాడు, యజమాని ఆర్ధికంగా నష్టపోవడమే కాకుండా మానసిక క్షోభకు గురవుతారు. కాబట్టి అద్దెకుండేవారి వృత్తి వివరాలు, వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడమే కాకుండా వాటి జెరాక్స్ కాఫీలను దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది.
క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం కూడా మంచిది. ఇది మెరుగ్గా నిర్వహించేవారు ఆర్ధికంగా క్రమశిక్షణ గలవారని తెలుసుకోవచ్చు.
2) కర్జా టెక్నాలజీ, క్యూబిక్ ట్రీ మొదలైన ఏజెన్సీలు ఒక వ్యక్తికి సంబంధించిన ఏదైనా పెండింగ్ డిఫాల్ట్ లేదా వివాదపరమైన సమస్యలపై తక్కువ ఖర్చుతో నివేదికను అందించగలవు.
కాబట్టి, కాబోయే అద్దెదారుల పూర్తి వివరాల తనిఖీ, వివాదపరమైన వివరాలు లేదా ఎగవేతదారుడు కాదని నిర్ధారించడానికి అటువంటి నివేదికలను పొందాలి.
3) లీజు/లైసెన్స్ ఒప్పందం చెల్లుబాటు అయ్యేలా, చట్టబద్ధంగా అమలు చేయదగినదిగా చేయడానికి 2 పక్షాలచే సంతకం చేయబడి, ఇద్దరు సాక్షులచే ధృవీకరించబడిన వ్రాతపూర్వక పత్రాలు ఉండాలి.
లీజు/లైసెన్స్ ఒప్పందంలో అద్దె/లైసెన్సు రుసుము వంటి ముఖ్యమైన నిబంధనలు ఉండాలి. కాల వ్యవధి, డిపాజిట్కై జమ చేసుకునే రుసుము, ఆస్తి ప్రదేశంలో చేయవలసినవి/చేయకూడనివి వ్రాసుకోవాలి.
ఒప్పందాన్ని రద్దు చేయడానికి యజమానికి హక్కులను ఇచ్చే ఒప్పందం క్రింద తగిన రక్షణ నిబంధనలు ఉండాలి. తద్వారా అద్దెదారుడు అద్దెని ఎగవేతకు పాల్పడిన సందర్భంలో ఆస్తిని విడిచిపెట్టమని యజమాని అడిగే విధంగా ఉండాలి.
4) లీజు/లైసెన్స్ పత్రం తప్పనిసరిగా కొన్ని నెలలకు సరిపడా స్టాంప్ చేయబడాలి. దీని కాల వ్యవధి 11 నెలల కంటే ఎక్కువ ఉంటే, ఈ పత్రం తప్పనిసరిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయబడాలి. స్టాంప్ డ్యూటీ చెల్లించకపోతే, పత్రం నమోదు చేయకపోతే అది న్యాయస్థానం ముందు ఆధారపడదు.
చట్టపరమైన సమస్యలను సృష్టిస్తుంది. ఇది ఒప్పందాన్ని అమలు చేయడంలో ఆస్తి యజమానికి కష్టతరం చేస్తుంది.
5) ఆస్తి సరిగ్గానే నిర్వహించబడుతుందని, ఆస్తిని అనుమతించబడిన వినియోగానికి మాత్రమే ఉపయోగించబడుతుందని నిర్ధారించుకోవడానికి అద్దెకు ఇచ్చిన ఆస్తిని నెలవారీ లేదా 3 నెలలకొకసారి యజమాని లేక అతని తరపున ఎవరైనా దర్శించడం మంచిది. ఉదా: లీజుకు తీసుకున్న/లైసెన్స్ పొందిన ఆస్తి నివాస స్వభావం కలిగి ఉంటే, అది నివాస ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి.
6) అద్దెదారు..నీరు, విద్యుత్ ఛార్జీలను చెల్లిస్తున్నారని ఆ ఏరియా సొసైటీ నుండి వివరాలు క్రమం తప్పకుండా తెలుసుకోవాలి. ఇక్కడ అద్దెదారు ఒప్పందం ప్రకారం నివాస, వాణిజ్య అవగాహన నిబంధనలను బట్టి రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అద్దెదారుడు అలా చేయకపోతే, ఒప్పందాన్ని రద్దు చేయడానికి..యజమానికి తగిన హక్కు ఉండాలి.
7) అంగీకరించిన తేదీలో ఆస్తిని ఖాళీ చేయకపోతే నగదు రూపంలో నష్టపరిహారం విధించబడుతుందని వ్రాతపూర్వకంగా నిబంధనలను వ్రాసుకోవాలి. ఇది అద్దెదారు ఉల్లంఘనకు పాల్పడకుండా నిరోధిస్తుంది.
అదనంగా సెక్యూరిటీ డిపాజిట్ జప్తు నిబంధన చేర్చడం కూడా అవసరం. అలాగే, ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఏవైనా డ్యామేజెస్ ఉన్నట్టయితే, వాటికి సంబంధించిన మొత్తాన్ని డిపాజిట్ నుంచి తీసివేయచ్చని కూడా ముందే వ్రాసిపెట్టుకోవడం మంచిది.
చివరిగా: ఇంటిని లేక ఆస్తిని అద్దెకిచ్చేటప్పుడు తెలుసున్నవారికి గాని లేదా తెలిసినవారు సిఫార్సు చేసిన వారికి గాని ఇవ్వడం చాలా మంచిది.
0 Comments:
Post a Comment