ఇంటర్నెట్ డెస్క్: నొప్పి గుండెల్లో గునపాలు దించినట్టుగా ఉంటుంది. ప్రమాదాలు.. ఏదైనా బరువులు ఎత్తినపుడు కావొచ్చు..
కాలు, చేయి, నడుము, మెడలో ఎక్కడైనా నొప్పి మొదలవుతుంది. ఈ బాధను అధిగమించడానికి చాలామంది నొప్పి నివారణ (పెయిన్ కిల్లర్) మాత్రలను ఆశ్రయిస్తారు.
కొన్నిసార్లు వైద్యుల వద్దకు వెళ్లాల్సి వస్తుంది. చాలావరకు సొంతంగా మందులు కొనుక్కొని వాడుతుంటారు. పెయిన్ కిల్లర్లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి. నొప్పి నివారణే కాదు.. దాంతో సమస్యలు కూడా వస్తాయంటున్నారు వైద్యులు. ఈ మందుల వాడకం ఎలా ఉండాలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శంకర్ ప్రసాద్ వివరించారు.
వర ప్రసాదమైనా..
నొప్పి నివారణ మాత్రలు రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒక రకం యాంటీఇన్‌ఫ్లామేటరీ డ్రగ్, రెండో రకం ఓపియెట్ యాంజినెస్. ఇవి కాకుండా స్టెరాయిడ్లు కూడా వాడుతుంటాం.
దగ్గు, జలుబు, జ్వరం వస్తే వేసుకునే మందులు లాగే నొప్పి మాత్రలను వేసుకుంటున్నారు. స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్ కాదు కానీ నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని నొప్పి, వాపు ఉన్నప్పుడు వాడుకోవాలి. నాన్‌స్టెరాయిడ్ మందులు కూడా నొప్పి నివారిణిగా పని చేస్తాయి.
ఎలాంటి నష్టం ఉంటుందంటే..
నొప్పి నివారిణి మందులు అధికంగా వాడితే పొట్ట లోపలి మ్యూకోజా పొరలు దెబ్బతిని చిరుగులు ఏర్పడే ప్రమాదం ఉంది. రక్త నాళాలు దెబ్బతిని లోలోపలే రక్తస్రావం అవుతుంది. అల్సర్, కడుపు ఉబ్బరం ఉంటుంది.
కిడ్నీల వడపోత సామర్థ్యం క్రమేపీ తగ్గుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. చివరికి కిడ్నీలు కూడా పని చేయకపోవచ్చు.
నొప్పి నివారణ మందులతో గుండెకు కూడా ముప్పు ఉన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. అస్ప్రిన్, ఐబూప్రోఫెన్ వాడకంతో గుండె పోటుకు గురి కావొచ్చు.
పారాసిటామల్ ఎక్కువగా వేసుకుంటే కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.
పాతరకం మందులు వాడొద్దు. కొత్తగా వచ్చిన మందులను వైద్యుల సూచనతోనే వాడాలి.
నొప్పికి కాకుండా అసలు జబ్బును తగ్గించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లాలి. ఆ సమస్యను పట్టించుకోకుండా తాత్కాలిక ఉపశమనం ఉండేలా నొప్పి నివారణకు మందులు వాడటం సరికాదు.
అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వారు నొప్పి నివారణ మాత్రలు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకున్నా ఓమేజ్ లాంటి మందు బిళ్లలను వేసుకోవాలి.
0 Comments:
Post a Comment