భారతదేశం వివిధ సంప్రదాయాలు, ఆచారాలకు నిలయం. అందుకే ఇండియాను భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ విదేశీ సంస్కృతి, సంప్రదాయాలు కూడా దర్శనమిస్తుంటాయి.
16వ శతాబ్దం నుంచి స్వాతంత్ర్యం వచ్చిన 1947 వరకు, విదేశీ సందర్శకుల కాలనీలకు దేశం నిలయంగా ఉండేది. చాలా మంది విదేశీయుల స్వాతంత్య్రం తర్వాత ఇక్కడే స్థిరపడ్డారు. ఆర్కిటెక్చర్ నుంచి రుచికరమైన వంటకాల వరకు దేశంలోని ఫ్రెంచ్, పోర్చుగీస్, చైనీస్, యూదుల పూర్వపు కాలనీలు ఇప్పటికీ ఆయా వర్గాల సంస్కృతికి అద్దం పడుతున్నాయి.
అందుకే మీరు పోర్చుగీస్, యూదు లేదా పర్షియన్ సంస్కృతిని తెలుసుకోవాలంటే, విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. భారతదేశంలోనే ఆయా వర్గాలకు చెందిన నిజమైన సంస్కృతిని ఆస్వాదించవచ్చు. అలాంటి టూరిస్ట్ స్పాట్స్ ఏవో చూద్దాం.
* పుదుచ్చేరి (ఫ్రెంచ్ సెటిల్మెంట్)
అప్పట్లో ఫ్రెంచ్ దేశస్తులు ఎక్కువగా పుదుచ్చేరిలో నివసించేవారు. దీంతో ఈ పట్టణాన్ని 'ఫ్రెంచ్ రివేరా ఆఫ్ ది ఈస్ట్' అని కూడా అంటారు. పుదుచ్చేరిలోని అప్పటి ఫ్రెంచ్ కాలనీ, ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ సాంప్రదాయ భారతీయ శైలి సంపూర్ణ సమ్మేళనంగా ఉండేది. బోగెన్‌విల్లాతో నిండిన గోడలతో ఫ్రెంచ్ క్వార్టర్ వీధి, వారి సంస్కృతికి చిరునామాగా నిలుస్తోంది.
* కొచ్చి (యూదుల సెటిల్మెంట్)
సోలమన్ రాజు కాలంలో ఇజ్రాయెల్ రాజ్యం రెండుగా విడిపోయింది. దీంతో యూదులు మలబార్ తీరానికి చేరుకుని, ఫోర్ట్ కొచ్చిలో స్థిరపడ్డారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ప్రదేశం 16వ శతాబ్దానికి చెందిన పరదేశి సినగోగ్, దాని చుట్టూ ఉన్న విచిత్రమైన దుకాణాలకు ప్రసిద్ధి చెందింది.
చర్చిలు, సుగంధ ద్రవ్యాల దుకాణాల కారణంగా ఈ ప్రదేశం చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. మీరు యూదుల ఆచారాలు, సంస్కృతులు తెలుసుకోవాలనుకుంటే కొచ్చికి వెళితే సరిపోతుంది.
* ముంబై (పార్సీ సెటిల్మెంట్)
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. పార్సీలు మొదట గుజరాత్‌లోని సంజన్ టౌన్‌కు వచ్చారు. ఆ తరువాత కాలక్రమేణా వారు మహారాష్ట్రకు వలస వెళ్లి ముంబైలో స్థిరపడ్డారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఇప్పుడు దేశంలోనే అత్యధిక సంఖ్యలో పార్సీలు నివసిస్తున్నారు. దాదర్ పార్సీ కాలనీ.. ఆర్ట్ డెకో భవనాలతో అప్పటి పార్సీల నాగరికతకు అద్దం పడుతోంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఐదు తోటలు కూడా ఉన్నాయి.
* కోల్‌కతా (చైనీస్ సెటిల్మెంట్)
కోల్‌కతాలోని తంగ్రా ప్రాంతం చైనీస్ సెటిలర్లకు నిలయంగా ఉంది. సెంట్రల్ కోల్‌కతాలోని ఓల్డ్ చైనా మార్కెట్లో 5000 మందికి పైగా చైనీస్ మూలానికి చెందిన భారతీయులు ఉన్నారు. వీరు ఇప్పటికీ చైనీస్ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తున్నారు.
కాగితపు లాంతర్లతో అలంకరించిన పాత వారసత్వ భవనాలు చైనా సంస్కృతికి నిలయంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రామాణికమైన చైనీస్ ఫుడ్ కోల్‌కతలో విరివిరిగా లభిస్తుంది. చైనీస్ కొత్త సంవత్సరంలో జరిగే భారీ వేడుకలను కోల్‌కతాలో కూడా కనులారా వీక్షించవచ్చు.
0 Comments:
Post a Comment