Fatty food: కొవ్వు పదార్థాలు తింటే శరీర బరువు పెరుగుతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ బాగా రుచిగా ఉంటాయని వాటిని చాలా మంది లాగించేస్తుంటారు.
సన్నగా ఉన్నవారైతే ఏ భయమూ లేకుండా ఇష్టం వచ్చినంత తినవచ్చని అనుకుంటారు. అయితే, కొవ్వు పదార్థాలు తింటే కేవలం శరీర బరువు పెరగడమే కాదని మానసిక సామర్థ్యమూ తగ్గే ముప్పు ఉందని ఆస్ట్రేలియా, చైనా పరిశోధకులు గుర్తించారు.
శరీర బరువు పెరిగితే ఏమవుతుందిలే అంటూ కొవ్వు పదార్థాలు లాగించేస్తున్నవారు ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నారు. కొవ్వు పదార్థాలపై చేసిన ఓ అంతర్జాతీయ పరిశోధనల ఫలితాన్ని మెటబాలిక్ బ్రెయిన్ డిసీస్ జర్నల్లో తాజాగా ప్రచురించారు.
పరిశోధనలో భాగంగా ఎలుకలకు 30 వారాల పాటు అధిక కొవ్వు పదార్థాలను ఆహారంగా ఇచ్చారు. క్రమం తప్పకుండా వాటి శరీరంలో జరుగుతోన్న మార్పులను రికార్డు చేసుకున్నారు. ఎలుకలకు మధుమేహంతో పాటు మానసిక సామర్థ్యం తగ్గడాన్ని గుర్తించారు.
అంతేగాక, వాటిలో ఆందోళన, కుంగుబాటు, మతిమరుపు వంటి లక్షణాలు పెరిగిపోయాయని తేల్చారు. ఆలోచనా శక్తి మందగించడమే కాకుండా ఆ ఎలుకల మెదడులో వచ్చిన మార్పుల కారణంగా జీర్ణక్రియపై దుష్ప్రభావం పడి భారీగా బరువు పెరిగాయని గుర్తించారు.
ఊబకాయం, మధుమేహం కేంద్ర నాడీ వ్యవస్థను బలహీనపర్చుతాయని, మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తాయని పరిశోధకులు చెప్పారు. అలాగే, ఆలోచనా శక్తిని తగ్గిస్తాయని తెలిపారు.
0 Comments:
Post a Comment