రోజూ మీరు వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా? లేదా చన్నీళ్లతోనా? వేడి నీళ్లతో స్నానం చేయడం మంచిదే. అయితే, ఊబకాయంతో బాధపడేవారు చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతారట.
తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. మరి చన్నీళ్ల స్నానం బరువు తగ్గిస్తుందని చెప్పడానికి ఆధారాలేమిటీ? పరిశోధకులు ఏం చెప్పారు?
మన పూర్వికులు తీవ్రమైన చలిలో సైతం చన్నిటి స్నానమే చేసేవారు. మన పెద్దలు ఫిట్‌గా ఉండటానికి కారణం కూడా ఇదే కావచ్చు. కానీ, ఇప్పుడు దాదాపు అందరి బాత్రూమ్లలో గీజర్లు ఉంటున్నాయి.
దీంతో చన్నీటి స్నానం చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఆ చలిని తట్టుకోవడం మా వల్ల కాదని భావిస్తున్నారు.
అలాగే, శరీరానికి హాయిగా ఉండాలంటే వేడి నీటి స్నానమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. దీంతో నిత్యం చన్నీటి స్నానం చేసేవారి సంఖ్య తగ్గిపోతుంది.
అయితే, తాజా స్టడిలో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందని తేలింది. ఈ సందర్భంగా పరిశోధకులు ఎలుకలపై పలు పరిశోధనలు జరిపారు.
కొన్ని ఎలుకలకు కొవ్వు పట్టే పాశ్చాత్య ఆహారాన్ని ఇచ్చారు. వాటిలో కొన్నింటిని 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు గల నీటితో స్నానం చేయించారు.
మరికొన్నింటిని సాధారణ నీటితో స్నానం చేయించారు. చిత్రం ఏమిటంటే.. మిగతా ఎలుకలతో పోల్చితే చల్లదనానికి గురైన ఎలుక త్వరగా బరువు తగ్గింది.
ఈ అధ్యయనాన్ని 'నేచర్ మెటబాలిజం' అనే జర్నల్‌లో ప్రచురించారు. చలి పెరిగే కొద్ది శరీరం లోపలి నుంచి వేడిని ఉత్పత్తి చేస్తుందని, అది బరువు తగ్గేందుకు సహకరిస్తుందని పరిశోధకులు తెలిపారు.
సాధారణ నీరు లేదా వేడి నీటితో స్నానం చేసేవారి శరీరం నుంచి ఉత్పత్తయ్యే వేడి చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశాలు తక్కువన్నారు.
అయితే, కొన్ని అధ్యయనాలు మాత్రం వేడి నీటి స్నానం బరువు తగ్గేందుకు సహకరిస్తాయని చెబుతున్నాయి. వేడి స్నానం వ్యాయమంతో సమానమని పేర్కొన్నాయి.
వీటిలో ఏ నీటితో స్నానం చేయడం వల్ల ఊబకాయులకు మేలు జరుగుతుందనే అంశంపై స్పష్టమైన అధ్యయనం జరిపి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
0 Comments:
Post a Comment