Chikki - చిక్కీలకు కాలం చెల్లింది.. నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది..!
వసతిగృహాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
లావేరులో 120 కిలోల కాలం చెల్లిన ఆహార పదార్థాల గుర్తింపు
కాలం చెల్లిన ప్యాకెట్లు..
లావేరు, రణస్థలం, న్యూస్టుడే: జిల్లాలోని పలు సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో విజిలెన్స్, ఆహార భద్రత తనిఖీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో పిల్లలకు అందించే ఆహారంలో కుడా వసతిగృహ అధికారుల కక్కుర్తి వెలుగులోకి వచ్చింది. ఒక్క లావేరు మండల కేంద్రంలోని బాలుర వసతిగృహంలో 120 కిలోల కాలం చెల్లిన పదార్థాలను అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ తనిఖీలు కొనసాగాయి. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు 12 పెట్టెల్లో సుమారు 120 కిలోల చక్కీలు కాలం చెల్లినవి బయటపడ్డాయి. 2019 లోనివి 20 కిలోలు, 2020 లోనివి 40 కిలోలు, 2022 ఏడాదికి చెందినవి 60 కిలోలు ఉన్నాయని జిల్లా ఆహార భద్రత అధికారిణి కె.లక్ష్మి తెలిపారు. కాలం చెల్లిన పదార్థాలు విద్యార్థులకు అందిస్తున్న దానిపై వసతిగృహ అధికారి కె.పాపారావుపై ఎఫ్ఎస్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్లు వివరించారు. జిల్లా విజిలెన్స్ అధికారిణి ఆదేశాల మేరకు డీఎస్పీ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో దాడులు జరిపామని ఏజీ సురేష్ తెలిపారు. వసతి గృహానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని స్పష్టం చేశారు. దాడుల్లో విజిలెన్సు ఏఈ గణేష్కుమార్, జిల్లా తూనికలు, కొలతల అధికారి ఎస్.విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
రణస్థలం బీసీ బాలుర, కళాశాల బాలికల వసతి గృహాల్లో కూడా తనిఖీలు జరిగాయి. గదులు సరిపోతున్నాయా లేదా మరుగుదొడ్లు, వసతి వంటి అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేయనున్నట్లు చెప్పారు.
0 Comments:
Post a Comment