జన్యుపరంగా పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగానే ఉండొచ్చు. అంతమాత్రాన భయపడాల్సిన పనేమీ లేదు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచే జీవనశైలితో దీన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని ద యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ అధ్యయనం భరోసా ఇస్తోంది.
పక్షవాతం తలెత్తటంలో జన్యువులు, జీవనశైలి పాలు పంచుకుంటాయి.
అందుకే ముప్పు కారకాలను.. ముఖ్యంగా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోగలిగితే పక్షవాతం వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చాలాకాలంగా సూచిస్తున్నారు.
పక్షవాతానికి దారితీసే జన్యువులతో నిమిత్తం లేకుండా ఇలాంటి జాగ్రత్తలతో పక్షవాతం ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం పేర్కొంటుండటం విశేషం.
అంటే పక్షవాతం ముప్పు నివారణలో జన్యువుల కన్నా ముప్పు కారకాలను మార్చుకోవటమే కీలక పాత్ర పోషిస్తోందన్నమాట.
కాబట్టి పొగ అలవాటును మానెయ్యటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, మంచి ఆహారం తినటం.. బరువు, కొలెస్ట్రాల్, రక్తపోటు, గ్లూకోజును అదుపులో ఉంచుకోవటం ముఖ్యం.
ఇవి గుండె, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పక్షవాతం, గుండెపోటు నివారణకు తోడ్పడతాయి.
0 Comments:
Post a Comment