అప్పట్లో చైనాలో పిచ్చుకలను చంపడానికి ప్రజలు ఎగబడ్డారు
''1958-1962 మధ్య చైనా నరకంలా తయారైంది''
ఈ వాక్యంతోనే డచ్ చరిత్రకారుడు ఫ్రాంక్ డికోటర్, తాను రచించిన 'ద గ్రేట్ ఫమైన్ ఇన్ మావోస్ చైనా' అనే పుస్తకాన్ని ప్రారంభించారు.
ఇందులో 'ద గ్రేట్ లీప్ ఫార్వార్డ్'గా పిలిచిన కాలం గురించి డికోటర్ వర్ణించారు. చైనాలో కమ్యూనిజాన్ని మావో జెడాంగ్ స్థాపించారు.
భూమి సమూహీకరణ, వేగవంతమైన పారిశ్రామికీకరణ ద్వారా ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాల సరసన చైనాను నిలిపేందుకు మావో జెడాంగ్ పలు విధానాలను ప్రవేశపెట్టారు. ఆయన నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ పలు సామాజిక, ఆర్థిక ప్రచారాలు నిర్వహించింది.
ఈ 'లీప్ ఫార్వర్డ్' సమయం తర్వాత సంభవించిన పెద్ద కరవు కారణంగా మరణించిన వారి సంఖ్యపై చరిత్రకారులు విభేదిస్తుంటారు.
డికోటర్ కంటే ముందు చరిత్రకారులు ఈ కరవు కాలంలో 15 నుంచి 32 మిలియన్ల (1.5-3.2 కోట్లు) మంది చనిపోయి ఉంటారని అంచనా వేశారు.
కానీ, 1958-1962 మధ్య చనిపోయిన వారి సంఖ్య కనీసం 45 మిలియన్లు (4.5 కోట్లు) ఉంటుందని డికోటర్ భావించారు.
ఆ సమయంలోని భయానక ఘటనలలో 'నాలుగు కీటకాలకు' వ్యతిరేకంగా జరిగిన ప్రచారం, అత్యంత అసంబద్ధమైన ఎపిసోడ్లలో ఒకటని బీబీసీ ముండోతో కిమ్ టాడ్ వివరించారు.
''చైనా అభివృద్ధికి ఏదో ఒక రకంగా జంతువులు అడ్డంకిగా ఉన్నాయని ఆ సమయంలో మావో భావించారు. ఇలా అడ్డంకిగా ఉన్న నాలుగు కీటకాలను ప్రకటించారు. వాటిని ఎలుకలు, దోమలు-ఈగలు, నల్లులు, పిచ్చుకలుగా గుర్తించారు. వాటిని తరిమి కొట్టడానికి చైనా ప్రజలందరి సహాయాన్ని తీసుకున్నారు.
ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత పేరుతో ఎలుకలు, ఈగలు-దోమలు, నల్లులను నిర్మూలించారు. కానీ పిచ్చుకలకు వేరే కారణాన్ని అంటగట్టారు.
''ధాన్యాలను బాగా తింటున్నాయనే కారణంతో పిచ్చుకలను ఈ జాబితాలో చేర్చారు. ధాన్యం కేవలం ప్రజలకు మాత్రమే చెందాలని మావో కోరుకున్నారు'' అని 'స్పారో' అనే పుస్తక రచయిత టాడ్ చెప్పారు. ఆయన సహజ చరిత్ర గురించి కూడా రాస్తుంటారు.
కానీ, లక్షలాది పిచ్చుకలను చంపడం వల్ల దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. త్వరలోనే వాటిని 'రెడ్ లిస్ట్' నుంచి తొలిగించడమే కాకుండా ఇతర దేశాల నుంచి పిచ్చుకలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.
పిచ్చుకలను వేటాడేందుకు అన్ని పద్ధతులను ఆమోదించారు
అంతర్ధానం అంచున
''పిచ్చుకలు లేకుంటే తమ దేశానికి జరిగే నష్టమేమీ లేదని 1958లో మావో జెడాంగ్ నిర్ణయించారు. ఈ అనాలోచిత నిర్ణయంతో పాటు ఆయన అమల్లోకి తెచ్చిన అనేక విధానాలు విధ్వంసానికి దారి తీశాయి'' అని పర్యావరణ పాత్రికేయుడు జాన్ ప్లాట్ వివరించారు. ఆయన 'ద రివిలేటర్' అనే వెబ్సైట్ ఎడిటర్ కూడా.
పిచ్చుకలను నిర్మూలించడానికి ఆ కాలంలో అనుసరించిన పద్ధతుల గురించి ఆయన బీబీసీ ముండోతో సంభాషణ సందర్భంగా చెప్పారు.
''వాటిని కాల్చి చంపారు. వాటి గూళ్లను, గుడ్లను ప్రజలను ధ్వంసం చేశారు. కానీ, ఇంకా వారు అనుసరించిన విచిత్రమైన పద్ధతి ఏంటంటే వాటిని తరమడం, అవి చచ్చిపోయేంతవరకు భారీ శబ్ధాలు చేయడం.
పిచ్చుకలకు ఎక్కువ విశ్రాంతి కావాలి. అవి త్వరగా అలసిపోతాయి. ఆహారాన్ని వేటాడటం కోసం ఎగరడం ఈ చిన్న పక్షులకు అత్యంత అలసట కలిగించే అంశం.
ప్రజలు, చాలా పిచ్చుకలను చంపారు. రెండేళ్ల కాలంలో అత్యంత విస్తృతమైన జాతుల్లో ఒకటైన పిచ్చుకలు దాదాపు అంతర్ధానమయ్యాయి'' అని జాన్ ప్లాట్ వివరించారు.
పిచ్చుకలను అంతం చేయడానికి ఉపయోగించిన పద్ధతులు సరైనవి కావని, అవి కేవలం పిచ్చుకలపైనే ప్రభావం చూపలేదని టాడ్ అన్నారు.
''పెద్ద సంఖ్యలో ప్రజలు, పిచ్చుక గూళ్లను కూలగొట్టి పిల్లలను చంపారు. బీజింగ్ లాంటి నగరాల్లో ప్రజలు, భారీ శబ్ధాలు చేస్తూ వాటిని తరిమేశారు. ఈ క్రమంలో తీవ్రంగా అలసిపోయిన పిచ్చుకలు మృత్యువాత పడ్డాయి. ఇది కేవలం పిచ్చుకలపైనే కాకుండా ఇతర పక్షులపై కూడా ప్రభావం చూపింది'' అని టాడ్ చెప్పారు.
చైనా జర్నలిస్ట్, పర్యావరణ కార్యకర్త డై కింగ్ కొన్నేళ్ల క్రితం దీని గురించి రాశారు. ''మావోకు జంతువుల గురించి ఏమీ తెలియదు. ఆయన తన ప్రణాళికల గురించి నిపుణులతో మాట్లాడలేదు. వారు చెప్పింది వినలేదు. ఆయన కేవలం ఆ నాలుగు కీటకాలను చంపేయాలని నిర్ణయించుకున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.
అయితే ఆ తర్వాత ఎలుకలు, దోమలు, ఈగల నిర్మూలనను కొనసాగిస్తూ, పిచ్చుకలను మాత్రం వదిలేసేలా ఏం జరిగింది?
పలువురు చైనా కాళాకారులకు పిచ్చుకలు ప్రేరణగా ఉండేవి
మిడతల కాలం
''పిచ్చుకలపై దాడుల తర్వాత కీటకాల ముట్టడి పెరిగింది. పిచ్చుకలను తరిమేయడం వల్లే ఇలా జరిగిందని ప్రజలు అర్థం చేసుకున్నారు. తర్వాత ఈ జాబితా నుంచి పిచ్చుకలను తప్పించి వాటి స్థానంలో నల్లులను చేర్చారు.
ప్రకృతి సమతుల్యాన్ని పునరుద్ధరించడం కోసం రష్యా నుంచి వేలాది పిచ్చుకలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది'' అని టాడ్ వివరించారు.
పిచ్చుకలు లేకపోవడం వల్ల మిడతలు పెరగడమే దీనికి కారణమని బీబీసీ జర్నలిస్ట్ టిమ్ లువార్డ్ అభిప్రాయపడ్డారు.
''వాటిని తినడానికి పిచ్చుకలు లేకపోవడంతో మిడతల జనాభా పెరిగింది. అవి, పంటల్ని నాశనం చేశాయి. ఈ కారణంగా ఏర్పడిన కరవు కారణంగా లక్షలాది మంది ప్రజలు చనిపోయారు'' అని ఆయన వివరించారు.
అయితే పిచ్చుకలను చంపడానికి, కీటకాలు ముట్టడించడానికి, కరవుకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పడం కష్టమని టాడ్ అన్నారు.
''పిచ్చుకలు ఎక్కువగా ధాన్యాన్ని తింటాయి. వాటి పిల్లలను పోషించడం కోసం కీటకాలను ఒక నిర్ధిష్ట కాలంలోనే పిచ్చుకలు వేటాడుతాయి. పిచ్చుకలు, కీటకాలను వేటాడకపోవడం వల్ల కీటకాల జనాభాపై ప్రభావం చూపిందని మీరు అనుకోవచ్చు.
పిచ్చుకలను నిర్మూలించడం కోసం చేసిన ప్రయత్నాలు వాటిపైనే కాకుండా ఇతర పక్షులపైన కూడా ప్రభావం చూపించాయి. వీటిలో కొన్ని పిచ్చుకల కంటే కూడా ఎక్కువగా కీటకాలను తినే పక్షులు ఉన్నాయి'' అని టాడ్ వివరించారు.
చైనాలో తలెత్తిన భారీ కరవుకు, పిచ్చుకలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారమే దోహదపడిందని అనడంలో తప్పు లేదని ప్లాట్ అన్నారు. కానీ, ఈ కరవును మరింత తీవ్రం చేసేందుకు మిగతా అంశాలు కూడా దోహదపడ్డాయని ఆయన చెప్పారు.
అందులో ముఖ్యమైనది 1960లలో వచ్చిన కరవుతో పాటు చైనా ప్రభుత్వ అధికారవాదం అని ఆయన అన్నారు.
వీటితో పాటు వ్యవసాయ విధానాల్లోని లోపాలను కూడా ప్లాట్ ఎత్తి చూపారు.
ఇతర రచయితలు కూడా ఈ లోపాల గురించి మాట్లాడారు. ఉక్కు ఉత్పత్తిని పెంచడం పట్ల ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించడంతో పరిశ్రమల్లో పనిచేసేందుకు ప్రజలు గ్రామాలను వదిలేశారు. దీంతో ఆ సమయంలో వచ్చిన కరవును తట్టుకునేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తులు సరిపోలేదు.
మరో తీరాన యుద్ధం
అయితే, ఈ వ్యవహారమంతా కేవలం గతానికి చెందినది కాదని, ఈరోజుకి కూడా పునరావృతమయ్యే అనేక అంశాలు ఉన్నాయని ప్లాట్ అన్నారు.
''ప్రపంచం అంతటా నిరంకుశత్వం మళ్లీ పుట్టింది. సైన్స్‌ను ప్రాతిపదికగా తీసుకోకుండా నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. కరవులు, వడగాలులతో పాటు ప్రకృతి సమతూకం కోల్పోయిన అనేక ఘటనలు నమోదు అవుతున్నాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
మానవ చరిత్రలో పిచ్చుకలకు వ్యతిరేకంగా ప్రచారం జరగడం ఇదొక్కసారి మాత్రమే కాదని టాడ్ చెప్పారు.
''అమెరికాలో కూడా 'పిచ్చుకలపై యుద్ధం' ప్రకటించారు. అయితే, చైనాలో జరిగినదానికి ఇది భిన్నమైనది'' అని బీబీసీ ముండోతో ఆయన అన్నారు.
19వ శతాబ్ధం మధ్యలో ఇది జరిగింది. కీటకాల నియత్రణతో పాటు ఇతర కారణాల రీత్యా పిచ్చుకలను దిగుమతి చేసుకోవడం మంచి ఆలోచన అని చాలా మంది అమెరికన్లు నిర్ణయించారు.
''అమెరికాలోని సిన్సినాటి, ఒరెగాన్, బ్రూక్లిన్లలో చాలా మంది ప్రజలు వాటిని దిగుమతి చేసుకున్నారు. అయితే, రెండు దశాబ్దాల్లోనే, వేగంగా పిచ్చుకల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. పర్యావరణం నుంచి కొన్ని స్థానిక పక్షి జాతులు అదృశ్యమయ్యాయని పక్షి శాస్త్రవేత్తలు గమనించడం మొదలుపెట్టారు. వాటి స్థానాన్ని పిచ్చుకలు ఆక్రమించాయని వారు గుర్తించారు'' అని టాడ్ చెప్పారు.
దీంతో కొన్ని పిచ్చుకలను వదిలించుకోవాలని కొందరు పక్షి శాస్త్రవేత్తలు ప్రతిపాదించగా, వాటిని సంరక్షించుకోవాలని కొందరు పట్టుబట్టారు. ఈ రెండు వర్గాల మధ్య ఒక రకమైన యుద్ధం జరిగింది.
''అయితే, ఈ ఇరు పక్షాలు ఒకరిపైఒకరు విజయం సాధించలేకపోయాయి. వీరిపై పిచ్చుకలే గెలుపొందాయి. ఈ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో కూడా మా ఇంటి కిటికీ దగ్గర అవి అరుస్తోన్న అరుపుల్ని నేను వింటున్నాను. నేను అమెరికాలోని మిన్నెపొలిస్‌లో ఉంటాను'' అని టాడ్ ముగించారు.
0 Comments:
Post a Comment