జర్మనీ పరిశోధకుల బయోహైబ్రీడ్ మాడల్
క్యాన్సర్ ఉన్న ప్రాంతానికే నేరుగా ఔషధం సరఫరా
కణజాలాన్ని చుట్టుముట్టి ముప్పేట దాడి
ఈకొలీ బ్యాక్టీరియా సాయంతో వేగవంతంగా చికిత్స
క్యాన్సర్‌తో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది మృత్యవాత పడుతున్నారు. చికిత్సకు లొంగినట్టే లొంగి.. అదునుచూసి తిరిగి దాడి చేయడం ఈ వ్యాధి నైజం.
మానవాళికి పెనుముప్పుగా మారిన ఈ మహమ్మారిని కణజాలంలోతుల్లోకి వెళ్లి మరీ మట్టుబెట్టే వినూత్న విధానాన్ని జర్మనీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. అదే 'బ్యాక్టీరియా ఆధారిత బయోహైబ్రీడ్ మైక్రోరోబో' చికిత్స.
బెర్లిన్, జూలై 21: క్యాన్సర్కారక మూలకణాల్లోకి ఆయస్కాంత శక్తిసాయంతో మైక్రోస్కోపిక్ రోబోలను పంపించి చికిత్స అందించే ఈ నూతన విధానాన్ని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనికోసం రోబోటిక్స్, బయాలజీ మేళవింపుతో కూడిన హైబ్రిడ్ సాంకేతికతను వినియోగించారు.
అటకట్టిస్తారిలా..
క్యాన్సర్ కణాల వృద్ధిని కట్టడి చేయాలంటే వ్యాధి ముదిరిన భాగంలోనే మందు వేయాలన్న సూత్రంపై ఈ చికిత్స ఆధారపడింది. దీని కోసం శరీరానికి మేలుచేసే ఈకోలీ బ్యాక్టీరియా, మైక్రోరోబోట్స్గా పిలిచే మ్యాగ్నెటిక్ నానోపార్టికల్స్‌ను ప్రధానంగా వినియోగించారు.
క్యాన్సర్ నియంత్రణకు ఉద్దేశించిన డ్రగ్ రసాయనాలను మైక్రోరోబోలలో నింపి వాటిని ఈకొలీ బ్యాక్టీరియాకు అటాచ్ చేశారు.
అనంతరం ఈ సమ్మేళనాన్ని అయస్కాంత క్షేత్ర ప్రభావానికి గురిచేశారు. దీంతో క్యాన్సర్ కణాలు ఉన్న ప్రాంతానికి డ్రగ్‌తో కూడిన వందలాది మైక్రోరోబోలు వేగంగా చేరుకొని చుట్టుముడతాయి. అనంతరం లేజర్ కిరణాలను మైక్రోరోబోలపైకి ప్రసరింపజేస్తారు.
దీంతో అందులోని డ్రగ్ రసాయనాలు విడుదలవుతాయి. దీంతో క్యాన్సర్ వ్యాప్తి మందగించడమే కాకుండా క్రమంగా తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు తెలిపారు.
ఈకొలీ బ్యాక్టీరియానే ఎందుకు?
ద్రవపదార్థాలతో పాటు జిగట పదార్థాల నుంచి కూడా ఈకొలీ బ్యాక్టీరియా సులభంగా ప్రయాణించగలదు. అలాగే, ఆక్సీజన్ స్థాయిల్లో హెచ్చతగ్గులు, ఆమ్లాల ప్రభావం దీనిపై పనిచేయదు. అందుకే ప్రయోగానికి ఈ బ్యాక్టీరియాను వినియోగించారు.
ఎక్కడ రోగమో.. అక్కడే మందు
క్యాన్సర్ ప్రభావం ఎక్కడ ఉన్నదో.. సరిగ్గా అదే ప్రాంతంలో చికిత్స అందిస్తే.. వ్యాధిని త్వరితగతిన అదుపులోకి తీసుకురావచ్చు. ఈ ప్రక్రియలో తాజా విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
-బిర్గుల్ అకోల్పోగ్లూ, పరిశోధకుడు
క్యాన్సర్ రహిత ప్రపంచం
బ్యాక్టీరియా ఆధారిత బయోహైబ్రీడ్ మైక్రోరోబో చికిత్స ద్వారా క్యాన్సర్ రహిత ప్రపంచం దిశగా కీలక అడుగులు పడ్డాయి.
0 Comments:
Post a Comment