టీఎంసీ నేత, పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee) సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ (Arpita Mukherjee) నివాసంలో శుక్రవారం రాత్రి ఈడీ (Enforcement Directorate) అధికారులు సోదాలు నిర్వహించి, రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో అర్పిత ముఖర్జీని శనివారం ఈడీ అధికారులు అదులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాల్లో కుంభకోణం జరిగినట్లుగా కేసు నమోదైంది.
'' అసలు ఎవరీ అర్పిత ముఖర్జీ, ఈమె బ్యాక్‌గ్రౌండ్ (Background) ఏంటీ, ఆమెకు, పార్థ ఛటర్జీకి పరిచయం ఎలా ఏర్పడింది''.. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అర్పితా ముఖర్జీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మంత్రి పార్థ ఛటర్జీకి అర్పిత ముఖర్జీ అత్యంత సన్నిహితురాలు అని మాత్రమే ఇంతవరకు తెలుసు. కానీ ఆమె గతంలో చాలా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించిన విషయం చాలా మందికి తెలీదు. 2008, 2009 సమయంలో బెంగాలీ సూపర్ స్టార్లు అయిన ప్రోసెన్జిత్, జీత్‌కు చెందిన 'మామా భాగ్నే', 'పార్ట్నర్' అనే చిత్రాల్లో అర్పిత ముఖర్జీ సైడ్ రోల్స్‌లో నటించింది.
అలాగే తమిళ, ఒడియా చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించడంతో ముఖర్జీ పేరు అందరికీ సుపరిచితమైంది. సినీ ఇండస్త్రీలో తక్కువ కాలం ఉన్నా మంచి పేరు సంపాదించింది.
అనంతరం 2019, 2020 మధ్య కాలంలో పార్థా ఛటర్జీ ఆధ్వర్యంలో నిర్వహించే దుర్గా పూజల కమిటీ 'నాట్కల ఉదయన్ సంఘ'కి ప్రచారకర్తగా వ్యవహరించింది. కోల్‌కతాలోని అతిపెద్ద దుర్గా పూజ కమిటీలలో ఇది ఒకటి. కమిటీ ఆధ్వర్యంలో తరచూ క్యాంపెయిన్లు నిర్వహించేవారు.
దుర్గాపూజ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో పార్థ ఛటర్జీ పేరు సంఘ్ అధ్యక్షుడు అని రాశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుర్గాపూజల కమిటీకి సంబంధించిన కార్యక్రమాల సందర్భంగా అర్పిత ముఖర్జీకి మంత్రితో పరిచయం ఏర్పడింది.
కమిటీ పనుల్లోనే కాకుండా తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) నిర్వహించే కార్యక్రమాల్లోనూ చురుగ్గా వ్యవహరించడంతో వారి మధ్య సాన్నిహిత్యం మరింత బలపడిందని తెలుస్తోంది. కాగా, ఈడీ సోదాల్లో ఇరవైకి పైగా మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
నటి అర్పిత ముఖర్జీతో పాటు విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారే, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య తదితరుల ఇళ్లలోనూ ఈడీ దాడులు కొనసాగాయి.
మరోవైపు ఈడీ దాడులపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడుతోంది. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపిస్తోంది. ఈ వివాదం ముందు ముందు మరెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
0 Comments:
Post a Comment