AP Rain Alert: ఏపీకి అతిభారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు హై అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), అటు తెలంగాణ (Telangana) లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటే వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తాకు అనుకొని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం వ్యాపించింది. ఇది సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.
దీంతో పాటు మహారాష్ట్ర నుంచి కేరళ వరకు తీర ద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు, పడమర ద్రోణి వేర్వేరుగా విస్తరించాయి. అలాగే గుజరాత్ నుంచి ఒడిశాలోని గోపాల్పూర్ మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవనద్రోణి కొనసాగుతుంది.
వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున గురువారం కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రానున్న ఐదు రోజుల వరకు దక్షిణ, పడమర, మధ్య భారతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
అటు మధ్య మహారాష్ట్రలో పడమర కనుమల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాలపై వరద తీవ్రత ఉంటుందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే గడచిన 24గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పార్తీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 74.4 మి.మీ వర్షపాతం నమోదైంది. సీతంపేటలో 52.8 మి.మీ, పెందుర్తిలో 45.6, ఆనందపురంలో 42.2, వేలేరుపాడులో 30.6, మంత్రాలయంలో 31.2, కూనవరంలో 20.4, నందికొట్కూరులో 24.4, కుక్కునూరులో 25, వంగరలో 28.2, కోటనందూరులో 21.4, కోసిగిలో 21.6, సీతానగరంలో 20.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
0 Comments:
Post a Comment