AP Government Scheme: మరో పథకం అమలుకు సిద్ధమైన ఏపీ సర్కార్.. వారి ఖాతాల్లో రూ.10వేలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఏడాదిలో రైతు భరోసా (YSR Rythu Bharosa), జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi), జగనన్న విద్యాకానుక (Jagananna Vidyakanuka) వంటి పథకాలను అమలు చేసిన ప్రభుత్వం..
వరుసగా నాలుగో ఏడాది.. వైఎస్సార్ వాహన మిత్ర (YSR Vahanamitra) డబ్బులు జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. స్వయం ఉపాధిని అత్యధికంగా ప్రోత్సహిస్తున్న రవాణా రంగానికి ఊతమిస్తూ, డ్రైవర్లకు అండగా ఉండేందుకు వైఎస్సార్ వాహన మిత్రను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 261.52 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా, సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు తమ వాహన అవసరాల కోసం వారికి అండగా ఉంటూ, గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆ శ్రమ జీవులకు తోడుగా నిలుస్తూ...ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వైఎస్సార్ వాహన మిత్ర క్రింద ఇప్పుడు అందిస్తున్న రూ.261.52 కోట్లతో కలిపి ఇప్పటివరకు రూ.1,026 కోట్లను డ్రైవర్లకు అందిస్తున్నట్లు వెల్లడించింది.
వైఎస్సార్ వాహన మిత్ర క్రింద 2019-20 సంవత్సరంలో 2,36,343 మంది లబ్ధిదారులకు రూ.236.34 కోట్లు, 2020-21 సంవత్సరంలో 2,73,476 మంది లబ్ధిదారులకు రూ.273.47 కోట్లు, 2021-22 సంవత్సరంలో 2,54,646 మంది లబ్ధిదారులకు రూ.254.64 కోట్లు, 2022-23 సంవత్సరంలో 2,61,520 మంది లబ్ధిదారులకు రూ.261.52 కోట్లు.., ఇలా మొత్తం కలిపి రూ.1,025.97 కోట్లు లబ్ధిదారులకు చేయనున్నట్లు వెల్లడించింది.
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్.. వాహనమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ఈనెల 13నే ప్రారంభంకావాల్సి ఉండగా.. భారీ వర్షాల కారణంగా శుక్రవారానికి వాయిదా వేశారు. ఇక ఈ ఏడాది సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసిన ప్రభుత్వం అనుకున్నట్లుగానే పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే జగనన్న విద్యాదీవెన (Jagananna Vidya Deevena), వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Rythu Bharosa), జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi), జగనన్న విద్యాకానుక (Jagananna Vidyakanuka) పథకాలను ప్రభుత్వం అమలు చేసింది. తాజాగా వాహన మిత్రకు రంగం సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోగా వైఎస్ఆర్ కాపునేస్తం (YSR Kapu Nestham Scheme) పథకానికి సంబంధించిన నిధులను కూడా జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
0 Comments:
Post a Comment