ఎంతో సురక్షితమైనవిగా పేరొందిన మట్టిపాత్రలు (Clay Vessels), మట్టి కుండల్లో వంటలు చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ఈ రోజుల్లో చాలామంది ఇత్తడి, కాపర్, అల్యూమినియం గిన్నెలలో అన్ని వంటకాలు వండేస్తున్నారు.
ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఎవరి వంటగదిలో చూసినా ఎక్కువగా అల్యూమినియం పాత్రలే దర్శనమిస్తున్నాయి. కూరలు, అన్నం, పిండి వంటలు... ఇలా ఏ వంటకానికైనా అల్యూమినియం పాత్రలనే (Aluminum Cooking Utensils) ప్రజలు వాడుతున్నారు. ఈ లోహంతో తయారు చేసిన కుక్కర్ల వాడకం కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మహారాజా సాయాజిరావు యూనివర్సిటీ, బరోడా (MS) ఫుడ్ రీసెర్చర్లు ఒక సంచలన నిజం కనిపెట్టారు. అల్యూమినియం వంటసామానుకి, అల్జీమర్స్ వ్యాధికి మధ్య సంబంధం ఉందని వీరు కనుగొన్నారు.
అల్జీమర్స్ (Alzheimer's) అనేది ఒక తీవ్ర మానసిక వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారిలో మెదడు కుచించుకుపోయి బ్రెయిన్ సెల్స్ నశిస్తాయి. అల్జీమర్స్ రోగులు జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోతారు. వారి ఆలోచనా శక్తి కూడా దెబ్బతింటుంది. ఆహారం తీసుకోలేరు, మాటలు కూడా అర్థం చేసుకోలేరు.
ఇంకా ఇలాంటి ఎన్నో తీవ్ర సమస్యలతో సతమతమవుతారు. ఈ వ్యాధికి చికిత్స కూడా లేదు. అయితే ఇలాంటి తీవ్ర మానసిక రుగ్మతకు, అల్యూమినియం వంట సామాగ్రికి లింకు ఉన్నట్లు మహారాజా సాయాజిరావు యూనివర్సిటీ (MSU)లోని ఆహారాలు, పోషకాహార విభాగానికి చెందిన పరిశోధకులు తెలుసుకున్నారు.
ఈ రీసెర్చర్లు అల్యూమినియం వంట పాత్రలు వాడే ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం చేపట్టారు. ఇందుకు వడోదర సిటీలో నివసించే 60 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని ఎంపిక చేసుకున్నారు.
వివిధ రకాల వంటలకు అల్యూమినియం పాత్రలు వాడే ఈ వృద్ధులలో అల్జీమర్స్ వ్యాధి ప్రభావం ఎలా ఉందనేది ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఈ రెండింటి మధ్య లింకు ఉన్నట్లు కనుగొన్నారు. ఆపై రీసెర్చర్లు అల్యూమినియం వంటసామాను మొత్తం బయట పారేసి.. వాటికి బదులు స్టెయిన్లెస్ స్టీల్ లేదా ఓవెన్-ఫ్రెండ్లీ గ్లాస్ వంటసామాను వాడాలని సూచించారు.
* అల్యూమినియంతో జీర్ణవ్యవస్థకు హాని
"మేము 90 మంది అల్జీమర్స్ రోగులను స్టడీ చేశాం. వారిలో తేలికపాటి, మితమైన, తీవ్రమైన అల్జీమర్స్ రోగులు ఉన్నారు. తీవ్రతను బట్టి ప్రతి విభాగంలో 30 మంది ఉన్నారు. ప్యాకేజింగ్ లేదా బేకింగ్ కోసం అల్యూమినియం ఫాయిల్లను ఉపయోగించే వారితో పోలిస్తే... ఫుడ్ వేయించడానికి, కాల్చడానికి లేదా ఉడకబెట్టడానికి తరచుగా అల్యూమినియం పాత్రలను ఉపయోగించే వారిలో అల్జీమర్స్ తీవ్రత ఎక్కువగా ఉందని కనుగొన్నాం" అని అర్పి షా చెప్పారు.
ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ విభాగం అధిపతి ప్రొఫెసర్ మినీ షెత్ మార్గదర్శకత్వంలో MSc విద్యార్థిని అర్పి షా ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అల్యూమినియంతో అల్జీమర్స్ ప్రమాదముందని రుజువు అయిందని షా చెప్పారు.
అల్యూమినియం పాత్రలలో ఆహార పదార్థాలను డీప్ ఫ్రై చేసినప్పుడు లేదా వాటిని నిరంతరం కదిలించినప్పుడు, ఆ పాత్రలలోని అల్యూమినియం కంటెంట్ కరిగిపోతుందని షా తెలిపారు. అలా కరిగిపోయిన అల్యూమినియం ఆహారంతో మిళితం అవుతుందని.. అలా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి రోగాలకు దారితీస్తుందని వివరించారు.
0 Comments:
Post a Comment