80 Wash Washing Machine: వాషింగ్‌మిషిన్లు వచ్చాక దుస్తులు ఉతకటం తేలికైపోయింది. కాకపోతే నీళ్లే ఎక్కువ కావాలి. డిటర్జెంట్ పొడులకు, ద్రావణాలకు ఖర్చూ ఎక్కువే అవుతుంది.
ఇవేవీ లేకుండానే దుస్తులను ఉతికి పెడితే ఎంత బాగుంటుందో కదా? ఏదో ఆశ కొద్దీ అనుకుంటాం గానీ అదెలా సాధ్యమని నిట్టూర్చకండి.
చండీగఢ్‌కు చెందిన అంకురసంస్థ '80వాష్' ఇలాంటి చిత్రమైన, అద్భుతమైన వాషింగ్మిషిన్నే తయారుచేసింది. డిటర్జెంట్‌తో పనిలేకుండా, కప్పు నీళ్లతోనే.. చిటికెలో దుస్తులను ఉతకటం దీని ప్రత్యేకత!
80 Wash Washing Machine: వాషింగ్‌మిషిన్లు ఎంత ఆధునికంగా మారితేనేం? నీళ్ల వాడకం విషయంలో పెద్దగా సాధించిందేమీ లేదు. చెంచాడు మురికిని వదిలించటానికి సుమారు 100 లీటర్ల నీటిని తీసుకుంటాయి.
ఇది వ్యర్థ జలంగానే మారుతుంది. దుస్తులు శుభ్రం కావటానికి వాడే సబ్బు పొడులు, ద్రవాల్లోని రసాయనాలతో కూడిన ఈ నీరంతా మురికి కాల్వల్లోకే చేరుకుంటుంది. అక్కడ్నుంచి అది చివరికి చెరువులు, నదుల్లోనే కలుస్తుంది. పర్యావరణానికీ హాని చేస్తుంది.
ఇలాంటి సమస్యలన్నింటికీ 80వాష్ రూపొందించిన వాషింగ్‌మిషిన్ చక్కటి పరిష్కారం చూపుతుంది. తక్కువ నీటితో.. కేవలం కప్పు నీటితోనే ఐదు దుస్తులను ఉతికేస్తుంది. అదీ సబ్బు అవసరం లేకుండానే.. అతి తక్కువ సమయంలోనే! కేవలం 80 సెకన్లలోనే దుస్తులను ఉతికి పెడుతుంది. మురికి ఎక్కువగా ఉంటే ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది.
80 వాష్ సంస్థను రూబుల్ గుప్తా, నితిన్ కుమార్ సలుజా, వరిందర్ సింగ్ ఆరంభించారు. వీరి వినూత్న ఆలోచనతో రూపుదిద్దుకున్న వాషింగ్‌మిషిన్ ఒకవైపు నీటిని ఆదా చేస్తూనే.. మరోవైపు సబ్బు రసాయనాల కాలుష్యాన్ని నివారిస్తుంది.
ఇలా ఒకేసారి రెండు సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నమాట. ఇంతకీ ఈ కొత్తరకం వాషింగ్‌మిషిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? స్టీమ్ టెక్నాలజీ ఆధారంగా. ఇది తక్కువ రేడియో ఫ్రీక్వెన్సీతో కూడిన మైక్రోవేవ్ పరిజ్ఞానం సాయంతో బ్యాక్టీరియాను చంపుతుంది.
దుస్తులను మాత్రమే కాదు.. లోహ వస్తువులను, పీపీఈ కిట్లనూ శుభ్రం చేస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉత్పత్తి అయ్యే పొడి ఆవిరి సాయంతో దుస్తుల మీద దుమ్ము, ధూళితో పాటు రంగు మరకలనూ పోగొడుతుంది. 7-8 కిలోల సామర్థ్యం గల మిషిన్ ఒకసారి ఐదు దుస్తులను ఉతుకుతుందని 80వాష్ సంస్థ చెబుతోంది.
మొండి మరకలైతే మరోసారి ఉతకాల్సి ఉంటుంది. సుమారు నాలుగైదు సార్లు ఉతికితే మొండి మరకలు పోతాయి. అదే 70-80 కిలోల సామర్థ్యం గల పెద్ద మిషిన్తోనైతే ఒకేసారి 50 దుస్తులను ఉతుక్కోవచ్చు. దీనికి 5-6 గ్లాసుల నీరు అవసరమవుతుంది.
ప్రస్తుతం ఈ వాషింగ్మిషిన్ను ప్రయోగాత్మక పరీక్షల కోసం మూడు పట్టణాల్లో ఏడు చోట్ల అమర్చారు. హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.200 చొప్పున వసూలు చేస్తూ దుస్తులు ఉతుక్కోవటానికి అనుమతిస్తున్నారు కూడా.
80వాష్ రూపొందించిన వాషింగ్‌మిషిన్
ఎలా వచ్చిందీ ఆలోచన?
వినూత్న వాషింగ్‌మిషన్ ఆలోచన పంజాబ్‌లోని చిత్కర యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్లో మొగ్గ తొడిగింది. రూబుల్ గుప్తా 2017లో బీటెక్ చేస్తున్న సమయంలో దీనికి బీజం పడింది.
ఆయన చిత్కర యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అసోసియేట్ డైరెక్టర్ నితిన్‌ను, అక్కడి ఆటోసింక్ ఇన్నోవేషన్స్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వరిందర్ను కలిశారు. నితిన్, వరిందర్ పలు అంకుర ప్రాజెక్టుల మీద పనిచేశారు. ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచారు.
మొదట్లో ఆసుపత్రుల కోసం అతినీలలోహిత కిరణాల సాయంతో పనిచేసే స్టెరిలైజేషన్ యంత్రాన్ని రూపొందించాలని అనుకున్నారు. నిపుణులతో చర్చించి, వారి నిపుణుల అభిప్రాయాలను తీసుకొని చివరికి వాషింగ్మిషిన్ను తయారుచేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే దుస్తులను ఉతకటానికి అతినీలలోహిత కిరణాలు సరిపోవు. ఇది బ్యాక్టీరియాను చంపుతుండొచ్చు గానీ మురికిని వదిలించలేదు. అందుకే పొడి ఆవిరి పరిజ్ఞానంతో ప్రయత్నించి విజయం సాధించారు.
పొడి ఆవిరి అంటే?
తక్కువ తేమతో కూడిన ఆవిరిని పొడి ఆవిరి అంటారు. ఇది మరకలను సమర్థంగా పోగొడుతుంది. అయితే దీన్ని ఉత్పత్తి చేయటానికి ఎక్కువ పీడనం కావాలి. ఇందుకు ఎక్కువ విద్యుత్తు అవసరమవుతుంది.
ఇది కాస్త కష్టమైన పనే. అలాగని నిరాశ పడలేదు. గది ఉష్ణోగ్రత వద్ద పొడి ఆవిరిని ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని రూపొందించారు. దీనికి పేటెంట్ కూడా తీసుకున్నారు. ఇది మురికి, మరకలు, దుర్వాసన, సూక్ష్మక్రిములు అన్నింటినీ నిర్మూలిస్తుండటం విశేషం.
ప్రయోగ పరీక్షల కోసం 7-8 కిలోల లోడ్ సామర్థ్యం గల వాషింగ్‌మిషన్‌ను తయారుచేశారు. వచ్చే సంవత్సరం దీనికి అంతర్జాతీయ స్థాయిలో పేటెంట్ తీసుకోవాలని 80వాష్ బృందం ప్రయత్నిస్తోంది.
0 Comments:
Post a Comment