🔳అధ్యాపకేతర సిబ్బందికి వర్సిటీల ఝలక్
వయో పరిమితి 60 ఏళ్లే.. వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉత్తర్వుల జారీ
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జగన్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులను పలు విశ్వవిద్యాలయాలు తుంగలో తొక్కుతున్నాయి. 2022 జనవరి1 నుంచి అమలులోకి వచ్చిన జీవో నంబర్ ఎమ్మెస్ 15ను రెగ్యులర్ నాన్-టీచింగ్ ఉద్యోగులకు అమలు చేయరాదని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. నాన్ టీచింగ్ ఉద్యోగులకు 62 ఏళ్ల వయో పరిమితిని అమలు చేయనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 19న వర్సిటీ జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పుడు ఉపసంహరిస్తూ వెటర్నరీ వర్సిటీ రిజిస్ర్టార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై నాన్ టీచింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆందోళన బాట పట్టాలని యోచిస్తున్నారు. కాగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనూ నాన్ టీచింగ్ ఉద్యోగులకు 60 ఏళ్ల వయో పరిమితిని అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఈనెలాఖరులోగా ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది. ఇదే బాటలో వైఎస్సాఆర్ ఉద్యాన వర్సిటీ నడిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాల్లో సుమారు 1,300 దాకా నాన్‌టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 60 ఏళ్ల వయోపరిమితితో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 300 మంది ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుంది.
సహకార ఉద్యోగులకూ లేనట్లే!రాష్ట్రంలోని సహకార సంఘాలు, బ్యాంకులు, సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఇంతే ఉంది. సహకార ఉద్యోగులకు 62 ఏళ్ల వయో పరిమితి వర్తించదని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు అమలు చేసి, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని డీసీసీబీ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కొందరు స్టే తెచ్చుకున్నా.. జీతభత్యాల చెల్లింపులు అనుమానంగానే ఉందని వారు వాపోతున్నారు.
0 Comments:
Post a Comment