✍️టీచర్లతోనే ఇంటర్ బోధన
♦️హైస్కూల్ ప్లస్‌లకు 1752 మంది
♦️ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
🌻అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): బాలికల కోసం ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న ఇంటర్ కోర్సుల బోధన ఉపాధ్యాయులతోనే చేపట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధ్యాయులకు పదోన్నతి ఉండదని, ఒక ఇంక్రిమెంట్ ఇస్తామని తెలిపింది. అర్హులైన 1752 మంది స్కూల్ అసిస్టెంట్లను హైస్కూల్ ప్లస్‌లకు పంపనున్నట్లు తెలిపింది. గురువారం పాఠశాల విద్యా శాఖ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి మండలంలో బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ఇటీవల హామీ ఇచ్చారు. కళాశాలలు లేని చోట్ల ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌లుగా మార్చి ఇంటర్ విద్యను ప్రవేశపెడుతున్నారు. 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్ చేశారు.
♦️లెక్చరర్లుగా నియమించాలి: కత్తి
అప్‌గ్రేడ్ అయిన 292 హైస్కూల్ ప్లస్‌లలో స్కూల్ అసిస్టెంట్లను పీజీటీలుగా మార్పు చేయడం సరికాదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. పదోన్నతుల ద్వారా వారిని అధ్యాపకులుగా నియమించాలని డిమాండ్ చేశారు. కాగా, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ అనుమతి లేకుండా హెచ్ఎంలను గానీ, ఉపాధ్యాయులను గానీ డిప్యూటేషన్లపై పంపొద్దని ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే డిప్యూటేషన్లపై ఉన్నవారిని వెనక్కి తీసుకోవాలన్నా కమిషనర్ అనుమతి ఉండాలని స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటికే మేలో పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినా కొన్ని చోట్ల డిప్యూటేషన్లపై పంపడం, వెనక్కి తీసుకోవడం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై అలాంటివి జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా కమిషనర్ ఆదేశాలున్నప్పటికీ ఇటీవల ప్రకాశం జిల్లాలో డిప్యూటేషన్‌పై వెళ్లిన ఓ గణిత ఉపాధ్యాయుడికి బోధన బాధ్యతలు కూడా అప్పగించారు.
0 Comments:
Post a Comment