ప్రస్తుతం ఎంతో మంది ఊబకాయ సమస్య (Obesity) తో బాధపడుతున్నారు.
పాతికేళ్లు కాదు.. పదహారేళ్ల వయసు నుంచే పొట్టలేసుకొని తిరుగుతున్నారు. పెళ్లైన అంకుల్స్ మాత్రమే కాదు.. పెళ్లి కాని బ్యాచిలర్స్ కూడా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన బరువును తగ్గించేందుకు.. పొట్టను కరిగించేందుకు (Weight Loss) నానా కష్టాలు పడుతున్నారు. ఊబకాయ సమస్య నుంచి బయటపడేందుకు.. డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు.
యోగాలు, ఎక్సర్సైజులు చేస్తున్నారు. ఐనా చాలా మంది ఈ సమస్య నుంచి కోలుకోవడం లేదు. కానీ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)కు చెందిన ఓ పోలీస్ అధికారి ఎలాంటి మెడిసిన్స్ తీసుకోకుండానే.. యోగా చేయకుండానే.. అధిక బరువు సమస్యను జయించాడు. కేవలం 9 నెలల్లోనే 48 కేజీలు తగ్గి.. శభాష్ అనిపించాడు.
ASI విభవ్ తివారీ, ఛత్తీస్‌గఢ్‌లోని బలోదబజార్-భటపరా జిల్లాలోని సర్సివాన్ ప్రాంతానికి చెందిన విభవ్ తివారీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు.
ప్రస్తుతం కోర్బా జిల్లాలోని కుస్ముండా పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వమంగళ అవుట్‌పోస్ట్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. 49 ఏళ్ల వైభవ్ 1993 ఏప్రిల్ 12న పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్‌గా చేరారు.
మొదట పోస్టింగ్ బస్తర్ డివిజన్లోని దంతెవాడ జిల్లాలో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. చాలా కాలం పాటు అక్కడే విధులు నిర్వర్తించారు. 2017లో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ వచ్చి... ASI అయ్యారు. అనంతరం కోర్బాకు ట్రాన్స్ఫర్ అయ్యారు.
పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ.. విభవ్ ఫిటెనెస్ క్షీణించింది. బరువు విపరీతంగా పెరిగాడు. పొట్ట కూడా బాగా ముందుకు రావడంతో అందరూ గేలి చేసేవారు. ఇంత పొట్ట పెట్టుకొని... పోలీస్ డ్యూటీ ఎలా చేస్తాడని.. ప్రజలు కూడా జోకులు వేసేవారు. అలాంటి చేదు అనుభవాలు చాలా ఎదురయ్యాయి.
ఈ క్రమంలోనే ఎలాగైనా బరువు తగ్గాలని కంకణం కట్టుకున్నారు విభవ్ తివారి. అందుకోసం ఎలాంటి వైద్య సలహాలు తీసుకోలేదు. మందులు వాడలేదు. యోగా కూడా పెద్దగా చేయలేదు. కేవలం రెంటు చిట్కాలతోనే అనుకున్నది సాధించాడు.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెంటు పూటలు క్రమం తప్పకుండా వాకింగ్ చేశారు విభవ్ తివారీ. ఆహార పదార్థాల్లో నూనె వినియోగం బాగా తగ్గించాడు. ఒక్కోసారి నూనె లేకుండా వంటకాలు చేసేవారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి దీనిని అమలు చేస్తున్నాడు.
ఆ తర్వాత 9 నెలలు తిరిగే సరికి.. విభవ్ తివారీలో అనూహ్య మార్పు వచ్చింది. ఏకంగా 48 కేజీలు తగ్గి.. ఎంతో సన్నబడ్డారు. తన తోటి పోలీస్ సిబ్బందిలానే మళ్లీ ఫిట్నెస్ సాధించారు.
విభవ్ తివారీ దాదాపు 50 కేజీల బరువు తగ్గడంతో ఉన్నతాధికారులు కూడా అభినందించారు. బిలాస్పూర్ విభాగానికి చెందిన IG రతన్ లాల్ డాంగి 10 జనవరి 2021న కోర్బాలో ఆయన్ను సత్కరించారు.
ఛత్తీస్‌గఢ్ కేడర్ IPS దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్లో ASI విభవ్ తివారీ ఫోటోను షేర్ చేశారు. ''ఛత్తీస్‌గఢ్ పోలీస్ విభాగానికి చెందిన ASI విభవ్ తివారీ తన బరువును కేవలం 9 నెలల్లో 150 కిలోల నుండి 102 కిలోలకు తగ్గారు.
మెరుగైన ఫిట్నెస్ సామర్థ్యాన్ని సాధించారు. మీ విజయం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. '' అని పేర్కొన్నారు.
విభవ్ తివారీ ఫొటోలను చూసిన నెటిజన్లు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రోజుల్లో ఎంతో మంది యువత ఫిట్నెస్ లేక.. ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారని.. అలాంటి వారందరికీ మీరు ఆదర్శమని కొనియాడుతున్నారు.
మరి మీలో కూడా ఎవరైనా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే..విభవ్ తివారీ ఫార్ములాను అనుసరించండి.
0 Comments:
Post a Comment