గుడిలో బలిపీఠం ముట్టుకోకండి
సాధారణంగా గుడికి వెళ్లేటప్పుడు లోపల అడుగుపెట్టేముందు ప్రధాన ద్వారానికి నమస్కరిస్తారు. లోపలకు వెళ్లి ధ్వజస్తంభానికి నమస్కరిస్తారు...గుడిలోపల అడుగుపెట్టి గంట కొట్టి గర్భగుడిలో ఉండే స్వామివారికి నమస్కరిస్తారు.
కొందరు గుడి చుట్టూ ప్రదిక్షిణలు చేస్తారు. ఆ సమయంలో గుడిముందు స్వామికి నమస్కరించిన తర్వాత గర్భగుడికి వెనుకభాగం వైపు కూడా నమస్కరిస్తారు కొందరు. అయితే ఆపని మాత్రం చేయకూడదంటున్నారు పండితులు. గుడి వెనుకభాగాన్ని బలిపీఠం అంటారు.
ఆ భాగంవద్ద తాకడం లాంటివి చేయకూడదు. ఇంకా చెప్పాలంటే బలిపీఠాన్ని అర్చకులు తప్ప ఎవ్వరూ ముట్టుకోకూడదు...అక్కడ ఏమీ పెట్టకూడదు.
ఇన్నాళ్లూ తెలిసో తెలియకో ఆపని చేసినట్టైతే ఇకపై అలా చేయకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.
బలిపీఠం ఎందుకంటే
ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు.
ఆలయంలోని మూలమూర్తికి, ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు. గర్భగుడిలో ఆంతరంగికంగా శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం. ఆరుబయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి. బలిప్రదానం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది.
బలి బుక్కుల వల్ల కంటికి కనిపించే భైరవ (కుక్క), కాకి, పక్షులు, చీమలు, పురుగులు, కనిపించని సూక్ష్మజీవులు ఎన్నో తృప్తి చెందుతాయి. తప్పనిసరిగా బలిబుక్కులు ఇవ్వాలనేది శాస్త్ర నియమం.
మట్టి,కొయ్యతో కూడా నిర్మించవచ్చు
బలిపీఠాలను శిల్పంతో మాత్రమే కాదు మట్టితో, కొయ్యతో కూడా నిర్మించవచ్చని చెప్పింది విష్ణు సంహిత. తిరుమల వంటి ఆలయాలలో బలిపీఠం ప్రాకారానికి బయటే ఉంటుంది. గర్భగుడిపై ఉన్న విమానం, గుడికి ముందు ఉన్న బలిపీఠం రెండూ ఒకటే అని నారాయణ సంహిత చెప్పింది.
దేవాలయంలో కేంద్రీకృతమైన శక్తి చైతన్యం విమానం ద్వారా పైకి ప్రవహిస్తే, బలిపీఠం ద్వారా అడ్డంగా ప్రవహిస్తుంది. ఆలయపురుషుని నాభి ప్రదేశంలో బలిపీఠం ఉంటుంది. కనుక ఆలయానికి ఇది కేంద్రస్థానం అని భావించాలి.
బలిపీఠంపై వేసిన అన్నం దేవతలకు మాత్రమే
ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కుల్లోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు. శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగంగా పిలుస్తారు.
ఇందులో శివుడు సదా ఉంటాడని, బలిపీఠాన్ని దర్శించినా శివదర్శనం అయినట్లే అని శైవాగమాలు చెబుతున్నాయి.
ముఖమండపం చేరే ముందు భక్తులు బలిపీఠానికి ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసి తనలోని అహంకారాన్ని బలిగా అక్కడ విడిచి బలిపీఠం నుంచి వచ్చే దైవీకశక్తిని తనలో నింపుకుని దైవదర్శనానికి వెళ్లాలి.
కానీ బలిపీఠాన్ని తాకరాదు.బలిపీఠంపై వేసిన అన్నం ఆయా దేవతలకు మాత్రమే. ఎవ్వరూ ముట్టుకోకూడదు.
బలిపీఠ దర్శనంతో భక్తులకు సమస్త దోషాలు పోతాయని శాస్త్ర వచనం, అంతేకాదు ఆయా దిక్కుల్లో ఉన్న బలిపీఠాలను ప్రదక్షిణ సమయంలో నమస్కరించుకుంటూ పోవాలి. అలా చేస్తే ఆయా దిక్కుల ఆధిదేవతలు, దేవతలు సంతోషించి మేలు చేస్తారని పండితులు చెబుతారు.
0 Comments:
Post a Comment