Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాల రాకకు వేళాయే..ఇక భారీ వర్షాలే..!
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతు పవనాలు వేగంగా కదుతున్నాయి. రాగల 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి.
అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌లోని మిగిలిన భాగాలకు వ్యాపించనున్నాయి. గుజరాత్, మధ్య మహారాష్ట్రలోని మరి కొన్ని ప్రాంతాల్లోకి రుతు పవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో నైరుతి రుతు పవనాలు ముందుకు సాగుతున్నాయి.
వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు రానున్నాయి. మొదట దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు నైరుతి రాగం తాకనుంది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఆ వెంటనే తెలంగాణకు సైతం రుతుపవనాలు రానున్నాయి. కర్ణాటక, తమిళనాడులో నైరుతి రుతు పవనాలు మరింత పుంజుకోనున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ వెల్లడించింది.
మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తాజాగా ఈశాన్య బంగాళాఖాతం నుంచి మధ్య బంగాళాఖాతం, మధ్య ప్రాంతాల వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ&5.8 కి.మీ ఎత్తులో ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
రాగల మూడురోజులపాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉంది. ఈదురు గాలులు సైతం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండనుంది.
0 Comments:
Post a Comment