సాధారణంగా మన దేశంలో గ్రామాలు ఎలా ఉంటాయి..? కోళ్లు, మేకలు, ఆవులు, ఎద్దులు, పచ్చని పొలాలు, చెరువులు, కాల్వలు, పొలం పనులు చేసే రైతులు.. గ్రామీణ జీవితం ఇలానే ఉంటుంది.
ఇక చిన్న ఇళ్లు, గుడిసెలు, కచ్చా రోడ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఓ గ్రామం మాత్రం ఇలా ఉండదు. మన దేశంలో ఉండే.. మెట్రో నగరాలను సైతం తలదన్నేలా ఉంటుంది.
హైటెక్ హంగులతో ఉండే విలాసవంతమైన ఇళ్లు.. పెద్ద పెద్ద రోడ్లు.. ఖరీదైన కార్లు.. అబ్బో.. అక్కడ ఇలాంటివి చాలా ఉంటాయి. స్మార్ట్ సిటీలు కూడా దాని కింద పనికిరావు. ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే.
ప్రతి వ్యక్తి వార్షికాదాయం రూ.80 లక్షలపైనే ఉంటుంది. ఇది మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. మన పక్కదేశం చైనాలో అలాంటి గ్రామం ఉంది
చైనాలోని జియాగ్యిన్ నగరానికి సమీపంలో హువాజీ (Huaxi village ) అనే గ్రామం ఉంటుంది. ప్రపంచంలోనే ధనిక గ్రామం (Worlds Richest Village) గా దీనికి పేరుంది.
ఇక్కడ నివసించే ప్రతి ఫ్యామిలీ.. నగరాల్లో నివసించే ధనవంతులతో సమానంగా సంపాదిస్తారు. ఇల్లు, కారు, లైఫ్ స్టైల్ కూడా గొప్పగా ఉంటుంది. హువాజీ గ్రామంలో ఉండే ప్రతి ఇల్లు ఎంతో విలాసవంతంగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీకి ఖరీదై కార్లు ఉంటాయి.
గ్రామం మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. పక్కా రోడ్లు అద్దాల్లా మెరుస్తాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉంది. అసలు ఇదంతా ప్రత్యేక లోకంలా.. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఉండే ప్రజలను చూసి... స్మార్ట్ సిటీలో ఉండే వారు కూడా అసూయ పడతారు.
అంతగా అభివృద్ధి చెందారు. మరి వీరికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా..? వ్యవసాయం. అవును.. ఇక్కడున్న వారంతా వ్యవసాయం చేస్తారు. పంటల ద్వారానే భారీగా డబ్బు సంపాదిస్తున్నారు.
మనదేశంలో రైతులు చాలా పేదవారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ హువాజీ గ్రామస్తులు (Huaxi Farmers) మాత్రం వ్యవసాయంతోనే కోటీశ్వరులయ్యారు.
ఇప్పుడు ప్రపంచంలోనే ధనిక గ్రామంగా పేరున్న హువాజీ.. ఒకప్పడు మాత్రం ఎన్నో ఇబ్బందులు పడింది. 1961లో ఈ గ్రామం ఏర్పడింది. అప్పుడు ఇక్కడి ప్రజలు చాలా పేదవారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం.
కానీ వ్యవసాయం పరిస్థితి అప్పట్లో చాలా అధ్వాన్నంగా ఉండేది. ఆ తర్వాత గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ప్రెసిడెంట్ వు రెన్వావో గ్రామ ముఖచిత్రాన్నే మార్చారు.
వ్యవసాయంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఎవరి పంట వారు పండించకుండా.. అందరూ కలిసి ఉమ్మడ వ్యవసాయం చేశారు. ప్రతి రైతు తన భూమిలో సాగు చేయకుండా.. సమూహాలుగా ఏర్పడి సాగు చేయడం ప్రారంభించారు.
సామూహిక వ్యవసాయం వల్ల పంట ఉత్పత్తి పెరిగింది. బాగా లాభాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ వెనక్కి చూడలేదు. అందరు కలిసి మెలిసి జీవిస్తూ... కోటీశ్వరలయ్యారు.
సామూహిక వ్యవసాయం అనే ఒకే ఒక్క ఐడియా.. వారి జీవితాన్నే మార్చేసింది. భవిషత్తును బంగారం చేసింది.
0 Comments:
Post a Comment