Real Names of Stars - వీళ్ల అసలు పేర్లేమిటో మీకు తెలుసా ?
మనలో ఎవరికైనా పేరు పెట్టేది అమ్మానాన్నలే. కానీ, సినీ రంగంలో అడుగు పెట్టినవారికి మాత్రం అనేక రకాల కారణాలవల్ల తమ అసలు పేర్లు మారిపోయి వేరే పేర్లతో ప్రాచుర్యం పొందుతారు. ఇంకొందరు సంఖ్యాశాస్త్రం ప్రకారం తమ పేరును మార్చుకునేవారు కొందరు. ఏదేమైనా, ఏదో ఒక రకంగా తల్లిదండ్రులు పెట్టిన పేరు మారిపోయి వేరే పేరుతో ప్రాచుర్యం పొందిన, పొందుతున్న నటీనటులు కోకొల్లలు. ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ అనే విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి ఆయన తన పేరులో శివాజీ గణేశన్ లా శివాజీ వుందని సంతోషించేవారుట. కానీ, 'మూండ్రు ముడిచ్చు' చిత్రంలో నటిస్తున్నప్పుడు దర్శకులు కె.బాలచందర్ 'శివాజీ అనే పేరు నీకు ఇష్టమే కావచ్చు.
కానీ, ఎందుకో గందరగోళంగా వుంది. నీపేరు ఇప్పటినుండే రజనీకాంత్. నువ్వు ఈ పేరుతో ఫేమస్ అవుతావనిపిస్తోంది.' అన్నారుట. అలా శివాజీరావు గైక్వాడ్ కాస్తా రజనీకాంత్ గా మారిపోయారు.
ఇక ప్రముఖ డ్యాన్సర్ జయమాలిని అసలు పేరు అలమేలు. దర్శకుడు రామన్న 'నువ్వు గొప్ప నాట్యగత్తెవి కావాలి. అందుకే, హేమమాలిని గొప్ప డ్యాన్సర్ కాబట్టి ఆమె పేరులోని మాలినిని తీసుకుని జయ కలుపుకో.' అని చెప్పారుట. అలా అలమేలు కాస్తా జయమాలినిగా మారారు.
ఇక అనేక చిత్రాల్లో చక్కని పాత్రల్ని పోషించిన జయంతి అందరికీ గుర్తుండే వుంటారు. ఆమె అసలు పేరు కమల కుమారి. 'జగదేక వీరుని కథ' సినిమాలో ఆమె పేరు కమల కుమారి అనే కనిపిస్తుంది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో 'జ' అక్షరంలోనే జయం వుందనే ఉద్దేశంతో జయంతిగా మార్చుకున్నారు.
ఇక 'ముత్యాల ముగ్గు' చిత్రంలో నటించినప్పుడు నూతన్ ప్రసాద్ తన అసలు పేరైన వరప్రసాదరావుగానే వ్యవహరించబడ్డారు. ఆ తర్వాత మద్యానికి బానిసై ఆరోగ్యం పాడైంది. ఆ అలవాటును మార్చుకుని 'ఇప్పుడు నేను కొత్త వరప్రసాదరావుని' అని నూతన్ ప్రసాద్ గా మారారు.
అలనాటి హీరోయిన్ కవిత అసలు పేరు కృష్ణ కుమారి. అయితే, 'ఓ మంజూ' చిత్రంలో నటిస్తున్నప్పుడు దర్శకుడు శ్రీధర్ 'ఇప్పటికే కృష్ణ కుమారి వున్నారు గదా... మూడక్షరాల పేరు ముచ్చటగా వుంటుంది. కవిత అని మార్చుకో' అని సలహా ఇచ్చారుట. దీంతో కృష్ణ కుమారి కాస్తా కవితగా మారారు.
ఇక కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా, మంచు భక్తవత్సలం నాయుడు మోహన్ బాబుగా, భూపతిరాజు రవిశంకర రాజు రవితేజగా, లక్ష్మీ నరసింహారావు సుత్తివేలుగా, ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం ఎ.వి.ఎస్.గా, డయానా మరియం కురియన్ నయనతారగా, సుజాత జయసుధగా, లలితారాణి జయప్రదగా, విజయలక్ష్మి సిల్క్ స్మితగా, విజయలక్ష్మి రంభగా మారిన విషయం మనకు తెలిసిందే...
0 Comments:
Post a Comment