ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చాలా చారిత్రక ప్రదేశాలున్నాయి.
ప్రతి ప్రాంతానికి చాలా చరిత్ర, ప్రాముఖ్యత ఉన్నాయి. అవన్నీ అనాటి పాలనా వైభవాన్ని, రాచరికాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ఇక అప్పటి శిల్పకళా చాతుర్యం, దైవ విగ్రహాలు అబ్బురపరుస్తుంటాయి.
గుంటూరు జిల్లా (Guntur District) లో చారిత్రక ప్రదేశమైన కొండవీడు కోట (Kondaveedu Fort) ఇప్పుడు మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది.
అద్భుతమైన ఘాట్ రోడ్డు నిర్మాణం, ఎటు చూసిన పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరనం..ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేయదగ్గ అద్భుతమైన చారిత్రక కట్టడం. ఇంతకీ ఈ కొండవీడు కోట విశేషాలేంటో తెలుసుకుందాం.!
కోట చరిత్ర
కోండవీడు పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేది రెడ్డిరాజుల వైభవం.. కొండవీడు ఖిల్లాను రాజధానిగా రెడ్డిరాజులు క్రీస్తు పూర్వం 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు.
రెడ్డిరాజుల పాలనా కాలం వ్యాపార, సంగీత, సాహిత్య, నాట్యాలకు సువర్ణయుగంగా భాసిల్లింది. 14వ శతాబ్ధానికి చెందిన ఈ కొండవీడు కోట ప్రాచీన చరిత్ర, ప్రకృతి సంపదలకు నిలువెత్తు సాక్ష్యం. 1700 అడుగుల ఈ గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రఖ్యాతి గాంచింది.
అద్భుత నిర్మాణ శైలి
కోట నిర్మాణశైలి అద్భుతంగా ఉంటుంది. గిరి దుర్గం చుట్టూ ఉన్న ప్రాకారం పొడవు 20 కిలోమీటర్లు. ప్రతి కొండ శిఖరం నుంచి మరో కొండ శిఖరాన్ని తాకుతూ కొండవీడు కోటలోని అన్ని శిఖరాలను, మధ్యలో వచ్చే బురుజులను కలుపుతూ ఈ ప్రాకారం ఉంటుంది.
ప్రాకారం మధ్యలో అనేక నిర్మాణాలను రెడ్డిరాజులు అద్బుతంగా తీర్చిదిద్దారు. కొండలపైనే రాజు, రాణిల కోటలు, కారాగారం, వజ్రాగారం, ధాన్యాగారం, అశ్వ, గజ శాలలు, మందిరాలను ఏర్పాటు చేశారు.
అప్పట్లో కొండలపై రాజ ప్రాసాదాలలో నివసించే వారికి, సైనికులకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ళ చెరువులు తవ్వించారు.
కోటలో మరింత ప్రత్యేకమైనవి ఇక్కడి బావులు..., ఇంత ఎత్తైన కొండపై ఇంతింత లోతు బావుల్ని ఎలా తవ్వించారన్నది ఊహకందదు.
వీటి నుంచి నీళ్లు తోడేందుకు చాలా పొడవైన చాంతాళ్లు వాడేవారు. అందుకే 'కొండవీటి చాంతాళ్లు' అన్న నానుడి వచ్చింది.
అద్భుత శిల్పాలు
కొండవీడు రెడ్డి రాజులు నిర్మించిన గోపీనాథస్వామి దేవాలయాన్నే కత్తులబావి, చీకటి కోనేరు అని పిలుస్తారు. వెన్నముద్దల బాలకృష్ణుని విగ్రహం తొలిగా ప్రతిష్టించింది గోపీనాథస్వామి ఆలయంలోనే.
కొండవీడు ప్రాంతంలో ఉన్న అపార శిల్ప సంపద నాటి అద్బుత కళలకు ప్రతీకలు. ఎక్కడ చూసినా రాతి శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు, విశిష్ట కట్టడాలు ఆకట్టుకుంటాయి.
గ్రామాల్లో, పంట పొలాల్లో దేవతా, నంది విగ్రహాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొండవీడు కొండలపై, దిగువన రెడ్డిరాజులు ఎన్నో ఆలయాలను నిర్మించారు.
వెలుగుచూస్తున్న ఆనవాళ్లు..!
కొండవీడు పరిసరాల్లో ఇప్పటికీ మరుగునపడిపోయి ఉన్న అనేక ఆనవాళ్ళు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. వాటిలో ఒకటే రెడ్డిరాజుల కాలం నాటి అతిపెద్ద దిగుడు బావి.
100 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 35 అడుగుల లోతు కలిగి ఉన్న ఈ భావిని 14వ శతాబ్ధంలో రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు త్రాగునీటి అవసరాల కోసం వినియోగించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
కొండవీడు కోట ఓ ఔషధ గని
ఈ కొండల్లో నాగముష్టి, తిప్పతీగ, పాషాణభేదితోపాటు లెక్కలేనన్ని ఔషధమొక్కలున్నాయి. ఈ కొండమీదున్న వందల ఏళ్ల నాటి వెదురు చెట్లకు వెదురు బియ్యం పండుతోంది. పిల్లలకు విజ్ఞానంతో కూడిన విహార ప్రదేశం ఇది.
పర్యాటకంగా అభివృద్ధి..!
రాష్ట్ర ప్రభుత్వం - కేంద్ర ప్రభుత్వం 'నగరవనం' కార్యక్రమంలో భాగంగా కోట పర్యాటకాభివృద్ధి వేగంగా జరుగుతోంది. కొండ దిగువ నుంచి కొండ మీదకు వెళ్లే ఆరు కిలోమీటర్ల ఘాట్‌రోడ్డు నిర్మించారు.
ఆ దారితో పాటు కోట లోపల రెండున్నర కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌లో నడక ప్రకృతితో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. రాశివనం, పంచవటి వంటి థీమ్ పార్కులు సిద్ధమవుతున్నాయి.
ఈ ప్రదేశం ట్రెక్కింగ్, హైకింగ్ చేయడానికి కూడా అనువుగా ఉండటం వల్ల నిత్యం ఇక్కడ పర్యాటకుల రద్దీ ఉంటుంది.
నమూనా కోట
ఈ కోటలో పర్యటించడానికి ముందు కొండవీడు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరాన ఫిరంగిపురం మండలంలోని హౌస్ గణేశ్ గ్రామంలో 'రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శన శాల'ను చూస్తే బాగుంటుంది.
ఈ మ్యూజియం అక్షరాలను శిల్పాలుగా, చిత్రాలుగా మలుచుకున్న ఒక గ్రంథాలయం. ఇందులో కొండవీటి కోట నమూనా ఉంది.
ఆ నమూనాను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత కొండవీడు దారి పడితే కోటలో చూడాల్సిన వాటిలో దేనినీ మిస్ కాకుండా చూడగలుగుతాం.
టైమింగ్స్: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడైనా ఎవ్వరైనా వెళ్లి చూడొచ్చు.
అడ్రస్: కొండవీడు, యడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 522549
ఫోన్ నెంబర్: +91 9885502778, శివారెడ్డి, కొండవీడు పరిరక్షణ సమితి. చరిత్ర కారుడు
ఎలా చేరుకోవాలి..?
కొండవీడుకోట గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం పరిధిలో ఉంది. ఈ కోటను చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి.
చిలకలూరిపేట - గుంటూరు మధ్య జాతీయ రహదారి నెం.5 నుంచి బోయపాలెం మీదుగా చేరుకోవచ్చు.
గుంటూరు - నరసరావుపేట మార్గంలో ఫిరంగిపురం నుంచి కొండవీడు చేరేందుకు మరో మార్గం ఉంది.
ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి కొండవీడు మీదుగా ఫిరంగిపురంకు పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి.
కొండవీడుకు ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లి మెట్లమార్గం ద్వారా కొండపైకి ఎక్కేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది.
0 Comments:
Post a Comment