మూగ జీవాలు పగబడతాయా ? అని మనం ఎవరినైనా ప్రశ్నిస్తే భిన్న రకాల సమాధానాలు వస్తాయి. అవునని కొందరంటే.. అలాంటిదేమీ ఉండదని మరికొందరంటారు. అవుననే వారు దానికి బలాన్ని చేకూర్చేందుకు కొన్ని ఘటనలు వివరిస్తే..
కాదనే వారు ''అబ్బే అదంతా ట్రాష్.. అవేదో కో ఇన్సిడెన్స్ లో జరిగాయి'' అని వాదిస్తారు. సరే ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. తాజాగా ఒడిశాలో జరిగిన ఓ ఘటన మాత్రం జంతువులు పగబడతాయని..గుర్తుంచుకొని మరీ దాడి చేస్తాయని చెప్పే వారి వాదనకు బలానిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే ?
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో మాయా ముర్ము అనే 70 ఏళ్ల వృద్ధురాలు గురువారం ఉదయం రాయపాల్ గ్రామంలోని గొట్టపు బావి నుండి నీళ్లు తీసుకువస్తోంది. ఇదే సమయంలో దాల్మా వన్యప్రాణుల అభయారణ్యం నుండి సంచరిస్తున్న ఓ అడవి ఏనుగు ఆమెపై దాడి చేసింది. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది.
వెంటనే ఆమెను పలువురు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ వృద్ధురాలు కావడం, ఏనుగు బలంగా దాడి చేయడం వల్ల ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయింది.
మాయా ముర్ము హాస్పిటల్ లో చనిపోవడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు, బంధువులు ఇంటికి తీసుకొచ్చారు. మృతదేహానికి ఇంటి వద్ద చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ నిర్వహించారు. సాయంత్రం సమయంలో పాడెపై ఎక్కించుకొని చితి వద్దకు తీసుకెళ్లారు.
మృతదేహాన్ని చితిపై ఉంచగానే మళ్లీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. వృద్ధురాలిపై దాడి చేసిన ఏనుగు ఆకస్మికంగా అక్కడ ప్రత్యక్షమైంది. దానిని చూసిన గ్రామస్తులు, బంధువులు ఖంగుతిన్నారు. ఆ ఏనుగు నేరుగా చితి వద్దకు అక్కడి నుంచి తీసుకెళ్లింది. మళ్లీ ఆమె శరీరాన్ని తొక్కి, విసిరిపారేసింది.
కొంత సమయం తరువాత ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయింది. గ్రామస్తులు, బంధువులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని తీసుకొచ్చి కొంత సమయం తరువాత అంత్యక్రియలు నిర్వహించారు.
రస్‌గోవింద్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ లోపాముద్ర నాయక్ మాట్లాడుతూ.. ఏనుగు దాడిలో వృద్ధురాలు మరణించిందని, తరువాత సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో మళ్లీ వచ్చి దాడి చేసిందని తెలిపారు.
ఏనుగు వెళ్లిపోయిన కొన్ని గంటల తరువాత మళ్లీ దహన సంస్కారాలు పూర్తి చేశారని పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
0 Comments:
Post a Comment