✍️ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో వెనక్కి తగ్గం : బొత్స
🌻ప్రజాశక్తి అమరావతి: ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో వెనక్కి తగ్గేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలు విడుదల కార్యక్రమంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. జిఓ 117పై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో వెనక్కి వెళ్లబోమని అన్నారు. ఉద్యోగ విధివిధానాల్లో వచ్చే ఇబ్బందుల్లో మార్పులు చేసేందుకు తమకు ఇబ్బంది లేదన్నారు. ఆంగ్లమాధ్యమం, పాఠశాలల మ్యాపింగ్ అంశాలపై ముందుకెళ్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ మెరుగుపరిచేందుకు బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఈ నెల 27న నిర్వహించే అమ్మఒడి కార్యక్రమంలో ఈ పథకం కింద అందించే ట్యాబ్‌ల విధివిధానాలు సిఎం వెల్లడిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 884 పాఠశాలలను జూనియర్ కళాశాలుగా అప్‌గ్రేడ్ చేసిందన్నారు. వీటిల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కళాశాలలు ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొన్నారు. అందులో భాగంగానే 25 కళాశాలలను బాలికల కళాశాలలుగా మార్చామన్నారు. వీటిపై తమ దృష్టికి కొన్ని అభ్యంతరాలు వచ్చాయని, మార్పులు చేసే అంశంపై పరిశీలిస్తామన్నారు.
0 Comments:
Post a Comment