పైడిమర్రిని గౌరవిద్దాం!
జాతీయ గీతం,జాతీయ గేయాలని ఎవరు రచించారని విద్యార్థులని అడిగితే ఎవరైనా ఠక్కున సమాధానం చెప్తారు.ఆ రచయితలకు చరిత్రలో సముచిత స్థానం లభించింది.కానీ భారత దేశం-నా మాతృ భూమి ప్రతిజ్ఞ రచయిత ఎవరని అడిగితే కొందరే సమాధానం చెప్తారు.
వివిధ మతాలు, కులాలు, భాషలు ఉన్న మనదేశంలో
భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని అనుసరిస్తున్నాము. అందుకే మన దేశాన్ని ఉపఖండం అంటారు.
'భారతదేశం నా మాతృభూమి '' అనే ప్రతిజ్ఞ ద్వారా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను, సమగ్రతను చాటారు మన తెలుగు తేజం పైడిమర్రి వెంకట సుబ్బారావు. భారత స్వతంత్య్ర సంగ్రామంలో వందేమాతరం అనే పాట ఎలా భారతీయుల్లో దేశభక్తిని, స్వతంత్య్ర కాంక్షను పెంచిందో స్వాతంత్య్రానంతరం పైడి మర్రి గారి భారత జాతీయ ప్రతిజ్ఞ భారతీయుల ఐక్యతను, దేశభక్తిని, జాతీయతను భవిష్యత్ తరాలకు చాటే విధంగా ఉందనడంలో సందేహం లేదు.
జూన్10, 1916లో నల్లగొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో జన్మించిన పైడిమర్రి మంచి రచయిత, బహుభాషావేత్త. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ట్రెజరీ విభాగంలో ఉద్యోగం సంపాదించాడు. పుస్తక పఠనం, పుస్తక సేకరణ, కవితా వ్యాసంగం, వేద అధ్యయనం చేసేవారు. పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి వెట్టిచాకిరి, భూస్వామ్య వ్యవస్థపై పలు రచనలు చేశారు. ఆయన తన 18వ ఏటనే ''కాలభైరవుడు'' పేరున చిన్న నవల రాశారు. 1945లోనే ''ఉషస్సు కథలు'' సంపుటిని రచించి తొలితరం కథా రచయితగా నిలిచారు. దేవదత్తుడు, తులసీదాస్, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు, బ్రహ్మచర్యం, గృహస్థ జీవితం, స్రీధర్మం, ఫిరదౌసి, శ్రీమతి అనే నాటకాలు రాశాడు. అదేవిధంగా అనేక అనువాద రచనలు చేశారు. 1945 - 46లలో నల్లగొండలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలో ప్రముఖ పాత్ర వహించారు. పైడిమర్రి గారి రచనలు, సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా చెప్పవచ్చు.
''భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను'' అంటూ సాగే ప్రతిజ్ఞ నేడు దేశంలోని ప్రతి పాఠశాలలో పసిహృదయాలలో గుండెల నిండా దేశభక్తిని పాదుకొల్పుతున్నది. ఈ ప్రతిజ్ఞ 1962లో పైడిమర్రి గారి కలం నుండి పురుడు పోసుకున్నది. ఆ రచనను చదివి ఉప్పొంగిన సాహితీవేత్త తెన్నేటి విశ్వనాథం, నాటి విద్యా శాఖ మంత్రి పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లి ప్రతిజ్ఞ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాతప్రతిని అంద జేశారు. ఆ తరువాత బెంగళూరు వేదికగా జరిగిన కేంద్ర విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా ఆమోదించారు. జనవరి 26 ,1965 నుంచి దేశ వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ఈ ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది.
మన భారతదేశ జాతీయ సమైక్యతను తెలియజేసే ప్రతిజ్ఞ రచయిత పేరు తగిన ప్రాచుర్యంలో లేకపోవడం పెద్ద చారిత్రక తప్పిదంగా నేటి తరం రచయితలు, మేధావులు పరిగణించారు. దీన్ని మొదటగా గుర్తించిన ఎలికట్టి శంకర్రావు 2011లో ఒక మహనీయుడి మూలాలను ప్రపంచానికి తెలియజేయాలని కొంతమంది తెలంగాణ సాహితీ మిత్రులతో కలిసి ''ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి'' అనే పేరు తో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించారు. పైడిమర్రి పేరును పాఠ్యపుస్తకాలలో ముద్రింపచేయాలని జన విజ్ఞాన వేదిక ప్రతిజ్ఞ అంశాన్ని క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకు వెళ్లింది. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివిధ జిల్లాలలో ప్రతిజ్ఞ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. పైడిమర్రి జీవిత చరిత్రతో కూడిన కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు.
ఎట్టకేలకు జనవిజ్ఞాన వేదిక, పలు అభ్యుదయవాదుల కృషి ఫలించి తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా ముద్రించిన పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ ఎగువన పైడిమర్రి పేరు చేర్చారు. పైడి మర్రి జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని జన విజ్ఞాన వేదిక డిమాండ్ చేసింది. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జీవిత చరిత్ర ను ఎం.రాంప్రదీప్ ''భారతదేశం నా మాతృ భూమి'' పేరుతో ఆంగ్లంలో ''దీ పార్గాటెన్ పేట్రియాట్'' పేరుతో రాసి పైడిమర్రి గొప్పదనాన్ని పాఠకులకు తెలియజేశారు. హిందీలోకి విశ్రాంత ఉపాధ్యాయుడు రేపాక రఘునందన్ అనువదించారు. భారతీయులంతా ఒకటేనని చాటిచెప్పే ప్రతిజ్ఞ జాతీయ సమైక్యత, సమగ్రతకు, దేశభక్తికి ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ నేర్పుతూ మన జాతి గొప్ప తనాన్ని చాటి చెపుతూ నిండైన దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిఙ్ఞ పదాలను మొక్కబడిగా ఆలపించకుండా,వాటి అర్ధం తెలుసుకొని ఆచరించాలి.
2016లో పైడిమర్రి శత జయంతి ఉత్సవాలు జరిగాయి. పైడిమర్రి విగ్రహాన్ని ఆయన జన్మించిన అన్నేపర్తి గ్రామంలో ఏర్పాటు చేస్తామని తెలంగాణ సాహితీవేత్తలు అప్పట్లో ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్. టి.ఆర్ జిల్లాలో తిరువూరు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,మల్లేల గ్రామంలో తొలి పైడిమర్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జూన్ 18న పైడిమర్రి కుటుంబ సభ్యులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.ఇదొక మంచి పరిణామం. దేశానికి జాతీయ ప్రతిజ్ఞని అందించిన పైడిమర్రిని అనునిత్యం ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
యం.రాం ప్రదీప్
తిరువూరు
9492712836
జూన్ 18న మల్లేల గ్రామంలో పైడిమర్రి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా...
0 Comments:
Post a Comment